జల వివాదాలపై బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం
కేంద్రంపై ఒత్తిడితో పాటు న్యాయ పోరాటం చేస్తాం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
గోదావరి-నల్లమలసాగర్ ప్రాజెక్ట్‌ను అంగీకరించేది లేదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జూమ్ మీటింగ్ ద్వారా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ ఏ రూపంలో మల్లించినా అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీ జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశంలో గోదావరి-నల్లమలసాగర్‌ను చేర్చొద్దని ప్రతిపాదించామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్‌కు అనుమతి ఇవ్వలేదనీ, సంబంధిత పొరుగు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు పోతామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్.పాటిల్ గురువారం లేఖ రాశారని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ నీటి పారుదల రంగాన్ని వింధ్వసం చేశారని విమర్శించారు.
పదేండ్లలో నీటి పారుదల శాఖకు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేశారనీ, అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్ట్‌కే రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి, మిగతా మొత్తాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్‌లకు వ్యయం చేశారని విమర్శించారు. పాలమూరుకు రూ.21,500 కోట్లు, సీతారామ ప్రాజెక్ట్‌కు రూ.8 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీరందించలేదని ఆరోపించారు. షార్ట్ టర్మ్ లోన్లు తెచ్చి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని ఎద్దేవా చేశారు పాలమూరు-రంగారెడ్డి, కోయిల సాగర్, నెట్టెంపాడు, భీమా డిండీ, ఎస్‌ఎల్‌బీసీ మొదలగు ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్‌లను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కృష్ణా నీటివాటాల విషయంలో బీఆర్‌ఎస్ పదేండ్ల కాలంలో చేసిన తప్పుడు ఒప్పందాలే తెలంగాణకు మరణశాసనమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణకు, 66శాతం (515 టీఎంసీలు) ఏపీకి కేటాయించడాన్ని రెండు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లతో పాటు కేఆర్‌ఎంబీ బోర్డు మీటింగుల్లో బీఆర్‌ఎస్ సర్కార్ ఒప్పుకుందని ఆరోపించారు. కృష్ణా నీటి వాటాలో 70 శాతం తెలంగాణకు, 30శాతం ఏపీకి ఇవ్వాలని పోరాడుతున్నామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు పేరు మార్చుకుని గోబెల్స్ అని పెట్టుకోవాలని సూచించారు.



