Thursday, September 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజికేరళ లౌకికవారసత్వాన్ని బలపరుచుకుంటాం

కేరళ లౌకికవారసత్వాన్ని బలపరుచుకుంటాం

- Advertisement -

ప్రపంచంలోని అతి పెద్ద తీర్థయాత్రా స్థలాల్లో శబరిమల ఒకటి. చాలాకాలం నుండి క్రమశిక్షణ, సంఘీభావం, భక్తిశ్రద్ధలతో ఈ శబరిమల తీర్థయాత్ర జరుగుతోంది. ట్రావెన్కోర్‌ దేవస్థానం బోర్డు చొరవతో ఏర్పడ్డ ‘గ్లోబల్‌ అయ్యప్ప సంగమం’ దాని ప్లాటినమ్‌ జూబ్లీ ఉత్సవాన్ని ఈ నెల (సెప్టెంబరు) 20న జరుపుకోబోతోంది. శబరిమల ఒక గుడి మాత్రమే కాదు. అంతకుమించినది. అది కేరళ సాంఘిక, సాంస్కృతిక సంస్లేషణ (సింథసిస్‌) భక్తులు తమకు తాము శిక్ష విధించుకుంటూ, అత్యంత భక్తిశ్రద్ధలతో సమానత్వాన్ని పునరుద్ఘాటిస్తారు. వారాలతరబడి నడిచి క్రమశిక్షణతో శబరిమల కొండెక్కుతారు. అక్కడ ‘పవర్‌నాదా’ అయ్యప్పస్వామి ముస్లిం సహచరునికి అంకితం చేయడం రెండు మతాల మధ్య ఐక్యతను సూచిస్తుంది. ఈ తీర్థయాత్రకెళ్ళే దారిలో ప్రధాన క్రైస్తవ గుడి అయిన అర్తున్కాల్‌ చర్చి ఉండటం ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న అంశం. మరొక సంకేతాత్మక అంశమేమంటే ‘హరివరసనమ్‌’ అయ్యప్పను రోజూ గుళ్ళలో నిద్రపుచ్చడానికి ఆయన భక్తులు పాడే పాట రాసిన జి. దేవరాజన్‌ ఒక నాస్తికుడు, కమ్యూనిస్టు. ఆ పాటకు అమరత్వం ఇచ్చినవాడు కేజే జేసుదాసు, జన్మత్ణ క్రైస్తవుడు. ఇవన్నీ కలిపి శబరిమల యొక్క లౌకిక, మతసామరస్య మనుషుల్ని కలిపి ఉంచే వారసత్వానికి చెందినవి. మతాన్ని, భక్తిని మతోన్మాద స్థాయికి దిగజార్చకూడదు.

టావెన్కోర్‌ దేవస్థానం బోర్డు (టీడీబీ) దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఈ లౌకిక సాంప్రదాయాలను పునరుద్ఘాటిస్తున్నది. శబరిమల దేవళంలో నువ్వు ఒకరికి అభివాదం చేస్తే అందరి మనసుల్లో ఆ భావనే పుట్టుకొస్తుందనే భావం శబరిమల ఈ ప్రపంచానికి చెందినదనే భావం ఎల్లెడలా వ్యక్తమవుతోంది. కాని ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రంలో దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. మతోన్మాద శక్తులతోనిండిన ‘శబరిమల కర్మ సమితి’ సెప్టెంబరు 22న పండలంలో విశ్వాసుల సమ్మేళనం జరుపుతామని ప్రకటించింది. చారిత్రాత్మకంగా ప్రజల్ని ఐక్యం చేసే చోట మతోన్మాద రాజకీయాల్తో విభజించే కుట్ర ఇది.
ఇక్కడే విశ్వాసులకీ, మతోన్మాదులకి మధ్య తేడా చూడాలి. మొదటిది.. తమ నైతిక బలాన్ని విశ్వాసం నుండీ, క్రమశిక్షణ నుండీ, సోదర భావం నుండి గ్రహిస్తుంది. రెండవది.. మతభావాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కలిపి వండుతుంది. విశ్వాసులు సంస్కరణల వైపు, అభివఅద్ధివైపు నిలిచారనేది కేరళ చరిత్ర. శ్రీనారయణ గురు, అయ్యంకళితోపాటు ఇతర సంస్కరణవాదులు మత నమ్మకాల నుండే ఆవిర్భవించారు. కాని వారు సమానత్వం కోసం, విముక్తి కోసం, సాంఘిక మార్పు కోసం నిలిచారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ అయ్యప్ప సంగమాన్ని మనం చూడాలి.

శబరిమల యొక్క లౌకిక స్వభావాన్ని శతాబ్దాల సంస్కరణలు, చర్చోపచర్చలు, సామాన్య భక్తుల పోరాటాల నేపథ్యంలో చూడాలి. శబరిమలలోగాని, ఇతర దేవస్థానాల్లోగాని వచ్చిన సంస్కరణలు సమాజం నుండే వచ్చాయని మనం గుర్తుంచుకోవాలి. కులదొంతర్లను, మత విభజనను అడ్డుకునేందుకు ఈ సంస్కరణలు అత్యవసరమని వామపక్ష శక్తులు పరిగణిస్తాయి. అందుకే, పైన పేర్కొన్న ‘సంగమాన్ని’ మతతత్వంతో నింపడాన్ని ప్రతిఘటించాలి. తమ రాజకీయ లాభార్జనకు, అభివృద్ధికరమైన సంస్కరణలను మత విశ్వాసాలపై దాడిగా అభివర్ణిస్తూ శబరిమలను ఒక ఆయుధంగా తయారు చేసుకునేందుకు బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. శబరిమల ఏనాడూ మతోన్మాదుల కేంద్రంకాదు. దాని సమ్మిళితత్వం, అన్ని కులాలు, మతాల మధ్య అంతర్లీనంగా ఉన్న సంబంధాలు, దాని చారిత్రాత్మక సంస్కరణలు మత విభజన రాజకీయాలకు భిన్నమైనవి. కమ్యూనిస్టులు మత విమర్శకులు కావున శబరిమలలో జోక్యం చేసుకోవడానికి సీపీఐ(ఎం) ప్రయత్నిస్తోందని వారు ప్రచారం చేస్తున్నారు.

మరింత మెరుగైన సమాజం కోసం ప్రయత్నించే కమ్యూనిస్టులు అన్నింటినీ అధ్యయనం చేస్తారు. విమర్శనాత్మకంగా పరిశీలిస్తారు. దానిలో భాగంగానే మతం కూడా ఉంటుంది. మార్క్స్‌ చెప్పినట్లు మతం అణగారిన ప్రజల నిట్టూర్పు.. మతం మత్తుమందులాంటిది. అణిచివేతకు గురయ్యే ప్రజలు తమ బాధలు మరిచిపోయేలా మతం చేస్తుందని మార్క్స్‌ చెప్పదల్చుకున్నాడు. ఒకనాడు వైద్య వృత్తి చేసే వారు బాధల నుండి ఉపశమనం కలుగజేయడానికి ‘ఓపియమ్‌’ను వాడేవారు. శబరిమల మాస్టర్‌ ప్లాన్‌, ఎయిర్‌పోర్టు వంటి ఎన్నో అభివృద్ధి కార్యకలాపాలను చర్చించేందుకు ‘గ్లోబల్‌ అయ్యప్ప సంగమం’ ఉద్దేశించబడింది. కేరళ ప్రజాక్షేత్రాన్ని విచ్ఛిన్నశక్తులకు నిలయం కానివ్వకూడదనేది ఒక రాజకీయ దృఢ నిశ్చయం. లౌకికతత్వం ఒక అమూర్తమైన (యాబ్‌స్ట్రాక్ట్‌) రాజ్యాంగ సూత్రం కాదు.. అది సజీవమైన, మన తీర్థయాత్ర సాంప్రదాయాల్తో నిండిన ఆచరణ.
(ద హిందూ సౌజన్యంతో)
అనువాదం : ఆరెస్బీ

ఎమ్‌.ఎ. బేబీ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -