భారత్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ హామీ
న్యూఢిల్లీ : భూటాన్‌లో న్యాయ వ్యవస్థ డిజిటలీకరణకు సహకరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. భూటాన్ రాజు జిగ్మె ఖెసార్ నంగ్యెల్ వాంగ్‌చుక్‌తో గురువారం థియాంపులో సమావేశమైన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. భూటాన్ న్యాయ వ్యవస్థ, ప్రక్రియల డిజిటలీకరణకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని సమగ్రంగా ఆందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్, భూటాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించి, బలోపేతం చేయడానికి సంబంధించి ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారని ఆ ప్రకటన తెలిపింది.
ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా వున్న బంధం గురించి కూడా వివరంగా మాట్లాడుకున్నారని, జ్యుడీషియల్ భాగస్వామ్యాల రూపంలో ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతను వ్యక్తం చేశారని ఆ ప్రకటన పేర్కొంది. సైబర్ నేరాలు వ్యాప్తిపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారని, ఇటువంటి నేరాలను నివారించడానికి, వీటిపై విచారణ జరపడానికి భారత్, భూటాన్‌లు సంయుక్తంగా చేయగలిగిన ప్రయత్నాలపై కూడా వారు చర్చించారని ఆ ప్రకటన తెలిపింది. ”ఇరువురి మధ్య జరిగిన సంభాషణలు, చర్చలు ఇరు దేశాల మధ్య గల సాంస్కృతిక, ఆథ్యాత్మిక, మేథో బంధాన్ని పునరుద్ఘాటించాయి. ఆలోచనలు, అభిప్రాయాలు పరస్పరం పంచుకోవాలని, మద్దతు ఇలాగే కొనసాగాలని తీర్మానించాయి.” అని ఆ ప్రకటన పేర్కొంది.
భూటాన్‌లో న్యాయవ్యవస్థ డిజిటలీకరణకు సహకరిస్తాం
- Advertisement -
- Advertisement -



