వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
గేదెల మృతి బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే, కారకులపై కఠిన చర్యలకు ఆదేశం
ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ – వనపర్తి
విద్యుత్ షాక్ కు గురై మృతి చెందిన గేదెల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హామీనిచ్చారు. గోపాల్పేట మండలం జయన్నతిరుమలాపురం గ్రామంలో శుక్రవారం ఉదయం కరెంట్ షాక్ తో పూసల చెరువులో రైతులు మద్దుల కొల్ల మల్లయ్య, భాస్కర్ రెడ్డిలకు చెందిన ఎనిమిది పాడి గేదెలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి తిరుమలాపురం గ్రామంలోని పాడి గేదెలు మృతి చెందిన బాధిత కుటుంబాలను శనివారం ఉదయం పరామర్శించారు.
పాడి గేదెల మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. కరెంట్ షాక్ తో గేదెలు మృత్యువాత పడుతున్నాయని తెలిసి కూడా నిర్లక్ష్య వైఖరి వహించిన విద్యుత్ శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఎనిమిది గేదెలు మృతి చెందడంతో వాటి పిల్లలకు తల్లిపాలు లేక ఇబ్బంది పడుతున్నాయని దయచేసి ఇందుకు సంబంధించి ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాలని కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వపరమైన సహాయ సహకారాలు పూర్తిస్థాయిలో అందిస్తామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయంగా మద్దుల కొల్ల మల్లయ్య కు రూ.18000, భాస్కర్ రెడ్డి కి రూ.6000 నగదును అందజేశారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు. గ్రామంలో మురికి కాలువలు లేవని, విద్యుత్ స్తంభాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోయారు. స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వెంటనే గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఉమ్మడి గోపాల్పేట మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సత్యశీలారెడ్డి, కొంకి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



