బలప్రయోగం చేయం
తక్షణమే చర్చలు జరగాలి
యూరప్ దేశాల తీరుపై మండిపాటు
అమెరికా ప్రపంచానికి ఆర్థిక ఇంజిను : దావోస్‌లో ట్రంప్ ప్రసంగం
దావోస్ : యూరప్ సరైన దిశలో ముందుకు సాగడం లేదంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. యూరప్‌ను తాను ప్రేమిస్తానని, అందువల్లే యూరప్‌కు మంచి చేయాలనుకుంటున్నానని చెప్పారు. కానీ యూరప్ మాత్రం సరైన దిశలో నడవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్ నగరమైన డావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో బుధవారం ట్రంప్ ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్రధానంగా గ్రీన్‌లాండ్, యూరప్‌ల గురించే ఆయన మాట్లాడారు. యూరప్ దేశాలు తమకు తామే నాశనం చేసుకుంటున్నాయని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ”అమెరికా అభివృద్ధి చెందితే యావత్ ప్రపంచమంతా అభివృద్ది చెందుతుంది” మీరు మా అభివృద్ధిని అనుసరిస్తారు, ఏ వేళలోనైనా మమ్మల్ని అనుసరించాల్సిందేనని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అమెరికాను మొత్తంగా ప్రపంచ దేశాల ఆర్ధిక ఇంజనుగా అభివర్ణించారు.
తన పాలనలో దేశ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని చెప్పుకున్నారు. వెనిజులాపై దాడికి దిగి, ఆ దేశ అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన తర్వాత గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యూరప్‌వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. డెన్మార్క్ సహా పలు దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే యూరప్ వ్యవహార శైలిపై ట్రంప్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యూహాత్మక భద్రత కోసం గ్రీన్‌లాండ్ అమెరికాకు అవసరమని అన్నారు. అయితే గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి బల ప్రయోగాన్ని చేయబోమని కూడా స్పప్టం చేశారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా మాత్రమే రక్షించగలదన్నారు. ఈ అంశంపై తక్షణమే చర్చలు జరగాలన్నారు. గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవడం నాటోకు ముప్పు కాబోదని కూడా అన్నారు.
దాదాపు 70 నిముషాల పాటు ట్రంప్ ప్రసంగించారు. అందులో 50నిముషాల పాటు అంతర్జాతీయ అంశాలపై మాట్లాడిన ట్రంప్ ప్రధానంగా యూరోపియన్ దేశాల వ్యవహార శైలిని తూర్పాబడుతునే మాట్లాడారు. యూరప్ దేశాలకు పెద్ద ఎత్తున జరిగే వలసలపై అక్కడ ఎలాంటి నియంత్రణ లేకుండా పోయిందన్నారు. తర్వాత సమయం అమెరికాకు సంబంధించిన సమస్యలపై మాట్లాడారు. అమెరికా లేకపోతే ఈ భూమ్మీద కొన్ని దేశాలు బతకలేవంటూ విపరీతపు వ్యాఖ్యలు కూడా చేశారు. కేవలం అమెరికా కారణంగానే కెనడా బతుకుతోందని అన్నారు. అనేక ఉచితాలను కూడా పొందుతోందన్నారు. అందుకు ఆ దేశం ఎప్పటికీ కృతజ్ఞతతోనే వుండాలన్నారు. కానీ డావోస్‌లో కెనడా ప్రధాని చేసిన ప్రసంగం ఆ రీతిలో లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ వ్యవస్థ చాలా ఆందోళనకరమైన పరిస్థితుల్లో వుందని, వ్యవస్థలో చీలికలు తలెత్తాయని, ఇటువంటి పరిస్థితుల్లో ‘మధ్యస్త శక్తులు కలిసికట్టుగా వ్యవహరించాలని కెనడా ప్రధాని పిలుపిచ్చారు.
ఒప్పందం కుదుర్చుకోకపోతే స్టుపిడ్‌లే
ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం డబ్ల్యుఇఎఫ్ చీఫ్ అడిగే ప్రశ్నలపై దృష్టి సారించారు. ఉక్రెయిన్ యుద్ధంపై జెలెన్‌స్కీ, పుతిన్‌లు ఒప్పందం కుదుర్చుకోకపోతే వారు ‘స్టుపిడ్’ లని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరువురు నేతలు ఒక ఒప్పందానికి కుదుర్చుకునే దశకు వచ్చారని నేను విశ్వసిస్తున్నా, ఒకవేళ అది జరగకపోతే వారు స్టుపిడ్‌లే అవుతారని విమర్శించారు. వెనిజులాను కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. గత 20ఏళ్ళలో సంపాదించలేని మొత్తాలు రాబోయే ఆరు మాసాల్లోనే వెనిజులా సంపాదిస్తుందన్నారు. అమెరికా నియంత్రణలో వెనిజులా అద్భుతంగా వుందంటూ వ్యాఖ్యానించారు. గ్రీన్‌లాండ్‌పై తన ఆలోచనలకు మద్దతివ్వని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామంటూ కూడా ట్రంప్ బెదిరింపులు చేశారు.
ఇటువంటి పరిస్థితులన్నీ కలిసి ట్రంప్‌కు, యూరప్‌కు మధ్య ఉద్రిక్తతలను సృష్టించాయి. మరోపక్క కొత్త టారిఫ్‌ల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి కూడా ప్రబలుతోంది. ఇలాంటి తరుణంలో డావోస్‌లో డబ్ల్యుఇఎఫ్ సమావేశాలకు ట్రంప్ హజరు కావడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల అధిపతులు, మంత్రులు, వాణిజ్య ప్రముఖులతో సహా దాదాపు 3వేల మందికి పైగా హాజరైన ఈ సదస్సులో ట్రంప్ ప్రతినిధి బృందమే అతిపెద్దది కూడా. ‘చర్చల స్ఫూర్తి’ అనే శీర్షికతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశపు ధీమ్ కూడా గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మరుగునపడిపోయింది.
గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



