Monday, January 12, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఏకమై పోరాడతాం

ఏకమై పోరాడతాం

- Advertisement -

దేశ వ్యాప్తంగా మహిళలందరినీ ఏకం చేయడంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) పాత్ర కీలకమైనది. సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చింది. పోరాడితేనే హక్కుల దక్కుతాయని మహిళల్లో చైతన్యం నింపుతోంది. అటువంటి ఐద్వా అఖిల భారత మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు మన హైదరాబాద్‌ మహానగరంలో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా మహిళలందరినీ సమస్యలపై ఏకం చేస్తామంటున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణజ్యోతితో మానవి సంభాషణ…

కరోనా తర్వాత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల రూపం మారిపోయింది. అంతకు ముందు అనుభవిస్తున్న కష్టాలకంటే ఎక్కువయ్యాయి. ఆ కాలంలో కుటుంబాలను పోషించుకోవడం కోసం అప్పులు చేశారు. ముఖ్యంగా మైక్రోఫైనాన్స్‌ రుణాలు తీసుకొని వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవాళ్లు కూడా ఉన్నారు. ఒకపక్క పనులు తగ్గిపోయాయి. ఆదాయం కోల్పోయారు. ఒక్కపనికే పరిమితమైతే కుటుంబాలను పోషించుకోవడం కష్టం. ఇటు ఉద్యోగంతో పాటు జీతం సరిపోక టైలరింగ్‌, శారీ బిజినెస్‌ వంటి పార్ట్‌టైం పనులు కూడా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళల సమస్యలైతే వర్ణనాతీతం. మల్టీటాస్కింగ్‌ చేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

చట్టాలు పట్టించుకోవడం లేదు
ఒక పక్క మహిళలపై హింస పెరిగిపోతూనే ఉంది. మరోపక్క తమని తాము కాపాడుకోవడానికి పోరాడి సాధించుకున్న చట్టాలను పట్టించుకోవడం లేదు. వరకట్న చట్టమే చూస్తే పెండ్లయిన తర్వాత ఏడేండ్ల లోపు ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నా, హత్య చేయబడినా అందులో భర్త కుటుంబ సభ్యుల భాగస్వామ్యం ఉందనే అనుమానం వస్తే వాళ్లను వెంటనే అరెస్టు చేసి విచారణ చేయాలి. ఆ విచారణలో నేరం చేసింది వారే అని తేలితే శిక్ష విధించాలి. కానీ ఇప్పుడు ఆ చట్టం మిస్‌ యూజ్‌ అవుతుందనే వంకతో అనుమానం ఉన్నా అసలు అరెస్ట్‌ చేయడం లేదు.

తప్పు చేసిన వాళ్లు హాయిగా బయట తిరుగుతున్నారు. చివరకు సాక్షాధారాలు మాయం చేసి శిక్షల నుండి తప్పించుకుంటున్నారు. ఇక లైంగిక దాడి జరిగిందని ఓ అమ్మాయి వస్తే గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఎవరైనా టీనేజ్‌ అమ్మాయి కనిపించడం లేదని పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఎవరితోనే వెళ్లుంటుందిలే ఆమే వస్తుంది అంటూ ఎగతాళిగా మాట్లాడతారు. దిశ కేసులో ఇలాగే జరిగింది. ఇలా పోలీసులు అమ్మాయిల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతో చాలా మంది పోలీస్‌ స్టేషన్‌కు రావడానికే భయపడుతున్నారు.

మద్యం అమ్మకాలతో…
మద్యం మీద ప్రభుత్వం పొందుతున్న ఆదాయం రోజురోజుకు పెరిగిపోతుంది. మద్యాన్ని ఓ ఆదాయ వనరుగా చూస్తున్నారు. ఒకపక్క అర్థరాత్రి వరకు మద్యం అమ్ముతున్నారు. మరోపక్క ఆరు గంటల తర్వాత తాగి బండి నడిపితే ఫైన్లు వేస్తున్నారు. దాంతో చాలామంది తాగుడు కోసం వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తున్నారు. తాగి డ్రైవింగ్‌ చేస్తూ ఫైన్లు కడుతున్నారు. ఇలా రెండు రకాలుగా జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. దీని ప్రభావం మహిళలపై తీవ్రంగా ఉంటుంది. తల్లీ, బిడ్డా అనే తేడా లేకుండా హింసకు పాల్పడుతున్నారు. తాగిన మత్తులో పసి పిల్లలపై లైంగిక దాడులు చేస్తున్నారు. స్కూళ్లల్లో కూడా డ్రగ్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. దీనివల్ల కూడా హింస పెరిగిపోతుంది.

దిగజార్చే పాత్రలు…
టీవీ సీరియల్స్‌లో, మీడియాలో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు. ఒక్క మగాడి కోసం ఇద్దరు ముగ్గురు మహిళలు కొట్టుకోవడం రోజూ సీరియల్స్‌లో చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ఇది చట్ట విరుద్దం. కానీ ఇలాంటి సీరియల్స్‌కు పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు? అలాగే మహిళలను దిగజారిపోయిన వాళ్లుగా, మగాళ్ల కోసమే బతుకుతున్నట్టుగా, వాళ్లు లేకపోతే మహిళల జీవితమే లేనట్టు మహిళల పాత్రలను చిత్రీకరిస్తున్నారు. ఇలాంటి వాటిపై మహిళలు తిరగబడాల్సిన అవసరం ఉంది.

ఎన్నో ఛాలెంజెస్‌…
ఇటీవల కాలంలో ప్రభుత్వాలు చట్టాలను పక్కదోవ పట్టిస్తున్నాయి. దీనివల్ల మహిళలకు న్యాయం దొరకడం లేదు. బిల్కిస్‌ బానో కేసు విషయంలో మనం చూశాం. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడి కుటుంబ సభ్యులందరినీ చంపిన దోషులను కోర్టు విడుదల చేసింది. మా ఐద్వా నాయకురాలైన సుభాషి ఆలీ నాయకత్వంలో పోరాటం చేసి వాళ్లను మళ్లీ అరెస్టు చేయించాం. అలాగే భార్య తన మాట వినకపోతే భర్త విడాకులు ఇవ్వొచ్చు అంటూ ఇటీవల కోర్టు తీర్పు ఒకటి ఇచ్చింది. అంటే మద్యం తాగివచ్చి హింసిస్తుంటే ఆమె చూస్తూ కూర్చోవాలా? ప్రశ్నించవద్దా? కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న భర్తను భార్య నిలదీయవద్దా? ఇలాంటి తీర్పులతో మహిళల గొంతు నొక్కేస్తున్నారు.

ఇటీవల కాలంలో యాప్స్‌ ద్వారా కూడా మహిళలను లైంగిక దోపిడీ చేస్తున్నారు. తమకు తెలియకుండానే మహిళలు ఆ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అటువంటి యాప్‌లకు పర్మిషన్‌ ఎందుకు ఇస్తున్నారు. ఇక హిజాబ్‌ ఘటన చూసినా అంతే. ఒకరు వేసుకోవాలి అంటారు. మరొకరు వేసుకోవద్దు అంటారు. అంటే ఇవన్నీ మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమే. ఇలా నేటి మహిళల ముందు ఎన్నో ఛాలెంజెస్‌ ఉన్నాయి. వీటన్నింటిపై మహిళలను ఐక్యం చేసి పోరాడేందుకు ఈ అఖిల భారత మహాసభలు వెదికకానున్నాయి.

ఏకమై పోరాడాలి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మహిళలు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. అయితే కేసీఆర్‌ పాలనలో మహిళలకు ఒరిగిందేమీ లేదు. కేజీ నుండి పీజీ ఉచిత విద్య అన్నారు. ఇల్లు లేని వాళ్లందరికీ డబుల్‌ బెడ్‌రూం అన్నారు. పిల్లలకు ఉచిత విద్య అందితే వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడతారని ఆశపెట్టుకున్నారు. కానీ ఇది అమలు కాలేదు. చాలా డబుల్‌ బెడ్‌రూములైతే పందికొక్కులకు ఆవాసాలయ్యాయి. ప్రజల బతుకులు బాగుపడే పనులు ఏమీ చేయకుండా బతుకమ్మ చీరలంటూ పంచి పెట్టి చేతులు దులుపుకున్నారు. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. వీళ్లు జాబ్‌ క్యాలెండర్‌ అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, మహిళందరికీ ఉచిత బస్సు అన్నారు.

కానీ ఉన్న బస్సులు తగ్గించేశారు. చాలా గ్రామాలకు అసలు బస్సులే లేవు. ఇక మహాలక్ష్మి పధకం కింద ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయాలు ఇస్తామన్నారు. కళ్యాళ లక్ష్మిలో డబ్బుతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. దీపం పధకం కింద తీసుకున్న గ్యాస్‌ సిలెండర్‌ మూడు వందలకే ఇస్తామన్నారు. కానీ ఇవేవీ అమలు కావడం లేదు. రెండు వందల యూనిట్లలోపు కరెంట్‌ బిల్లు మాఫీ అన్నారు. దీనికి వంద లింకులు పెట్టారు. ఈ సమస్యలన్నింటి మీద మహిళలందరూ ఏకమై పోరాడాలి. ఈ లక్ష్యంతోనే అఖిల భారత మహాసభలు నిర్వహించుకోబోతున్నాము.

  • సలీమ
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -