విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి : మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ- షాద్‌నగర్
మున్సిపాలిటీ ఎన్నికల్లో 75 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ మున్సిపాలిటీలో శుక్రవారం ఎన్నికల ప్రచారం అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా ప్రభుత్వం ఏర్పాటైన రెండేండ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, మున్సిపాలిటీ ఎన్నికల్లో తప్పనిసరిగా తామే గెలుస్తామని తెలిపారు. విద్యా, వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని హైదరాబాద్ చుట్టుపక్కల ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వివరించారు. విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాలమూరు లాంటి వెనుకబడిన జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలు, త్రిబుల్ ఐటీ కళాశాల, ఏకీకృత పాఠశాలల నిర్మాణాలు, రేషన్ కార్డులు, ఉద్యోగాల నియామకాలు ఇలా అన్ని రంగాల్లోనూ తమ ప్రభుత్వం సత్తా చాటిందన్నారు. వైద్యం కోసం వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులకు రాకుండా జిల్లా కేంద్రాల్లోనే వైద్యం అందుబాటులో ఉండేలా ఆస్పత్రులను ఆధునీకరిస్తున్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్యసేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. అదేవిధంగా కండ్ల పరీక్షలకు సంబంధించి ప్రత్యేక కేంద్రం, 80 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్సలు ఏర్పాటు చేసేలా శివారు ప్రాంతాల్లో 200 పడకలతో ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉస్మానియా, గాంధీ హాస్పిటల్ తరహాలోనే 32 డిపార్ట్‌మెంట్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. గ్రామీణ వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టి డయాబెటిక్ సెంటర్లు సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీలో 75 శాతానికిపైగా స్థానాల్లో విజయం సాధిస్తాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



