– విద్యార్థి సంఘాలతో భేటీ అయిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
– ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి సమస్య పరిష్కారానికి హామీ
నవతెలంగాణ – కామారెడ్డి : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు.
గురువారం కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో పలు విద్యార్థి సంఘాల నాయకులు షబ్బీర్ అలీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా సుమారు రూ.60 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందకపోవడంతో కళాశాల యాజమాన్యాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక కొన్ని కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొన్నట్లు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన షబ్బీర్ అలీ విద్యార్థుల సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటానని చెప్పారు. వెంటనే రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఫోన్‌లో సంప్రదించి సమస్యను వివరించి సమయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ వారంలోపే విద్యార్థి సంఘాల ప్రతినిధులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఉపముఖ్యమంత్రిని కలిసి సమస్యపై చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన షబ్బీర్ అలీకి విద్యార్థి సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



