నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ప్రజల సంక్షేమం, పట్టణాలాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా యాదగిరిగుట్ట కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేసి మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజల ఆశీర్వాదంతో తప్పనిసరిగా గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ దశలో ఎలా ఉత్సాహంగా బీ–ఫారమ్‌లు స్వీకరించారో, అదే ఉత్సాహంతో గెలుపొందిన అనంతరం గెలుపు ధ్రువీకరణ పత్రాలను కూడా స్వీకరించాలని ఆయన ఆకాంక్షించారు.
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పథంలో పట్టణాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్‌గా మారుస్తామని తెలిపారు. అంతకు ముందు ఆయన నివాసంలో కాంగ్రెస్ అభ్యర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బరిగే రమ్య రామచంద్రర్, బూడిద మధు, గౌలికర్ అరుణ, గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, శ్రీధర్, బబ్బూరి శ్రీధర్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.



