Sunday, February 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు40 సీట్లు గెలిచాం..వడ్డేపల్లి మున్సిపాల్టీ మాదే

40 సీట్లు గెలిచాం..వడ్డేపల్లి మున్సిపాల్టీ మాదే

- Advertisement -


ఇది ట్రైలర్‌ మాత్రమే
భవిష్యత్తులో సినిమా చూపిస్తాం
బీఆర్‌ఎస్‌ వైఫల్యాలతోనే కాంగ్రెస్‌కు ఎక్కువ స్థానాలు:కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌తో కలిసి మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ఎన్నికల్లో 40 సీట్లు గెలుచుకున్నట్టు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయం లో ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కన్వీనర్‌ అంబటి జోజిరెడ్డి, హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌తో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కవిత మాట్లాడుతూ బిఫామ్‌ ఇచ్చిన 33 మంది అభ్యర్థులతో పాటు మరో ఏడుగురు స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారని వివరించారు. ఇది ట్రైలర్‌ మాత్రమేననీ, సినిమా ముందుందని కవిత వ్యాఖ్యానించారు. ప్రజల కోసం కాంగ్రెస్‌ చేసిందేమీ లేదనీ, ఆ వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ వైఫల్యాలతోనే కాంగ్రెస్‌ మెజారిటీ స్థానాలు గెలిచిందని విమర్శించారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు తమకు ఆశాజనకంగా ఉన్నాయనీ, ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సంకేతం ఇచ్చారని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికలను తమ పొత్తుకు బీఆర్‌ఎస్‌, బీజేపీలు తొలిమెట్టు గా వాడుకున్నాయని కవిత విశ్లేషించారు. ప్రజల ప్రేమను ఎందుకు కోల్పోయారో బీఆర్‌ఎస్‌ ఆలోచిం చుకోవాలని ఆమె సూచించారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఆ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారనీ, ఆ పార్టీ కాంగ్రెస్‌తో మిలాఖత్‌ అయిందని గుర్తుచేశారు. సింగరేణ ిలో కార్మికుల హక్కులు పొగేట్టే విధంగా వ్యవహరించిన వారికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోందని ఆమె విమర్శించారు. అలాంటి పార్టీకి అడగకుండానే బీఆర్‌ఎస్‌ మద్దతు ప్రకటించిందనీ, బీఆర్‌ఎస్‌ విధానమేంటని కవిత ప్రశ్నించారు. గతంలో తోక పార్టీ అని విమర్శించిన పార్టీకి బీఆర్‌ఎస్‌ తోక పార్టీగా మారిందా? అని ఎద్దేవా చేశారు. వడ్డేపల్లి మున్సిపాల్టీలో తమకు స్పష్టమైన మెజారిటీతో తీర్పునిచ్చారనీ, కాంగ్రెస్‌ నాయకులు గెలిచిన వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆమె విమర్శించారు. నారాయణపేటలో తమకు వైస్‌ చైర్మెన్‌ పదవిని ఆఫర్‌ చేశారనీ, దీనిపై స్థానిక నాయకత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు ఆమె తెలిపారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ప్రభుత్వ ఖర్చుతో ఎన్నికల చట్టాలను, పరిమితులను ఉల్లంఘించినా ఈసీ పట్టించుకోలేదనీ, ప్రతిపక్షాలు ప్రశ్నించలేదని కవిత విమర్శించారు. మున్సిపల్‌ శాఖ మాజీ మంత్రి కేటీఆర్‌ 17 స్థానాలు గెలవడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌ లో నిధులు కేటాయించాలని ఆమె కాంగ్రెస్‌ ను డిమాండ్‌ చేశారు. సింగరేణి ఎన్నికల్లోన హెచ్‌ఎంఎస్‌, జాగృతి కలిసి పని చేస్తుందని కవిత తెలిపారు.

రామగుండం ఎమ్మెల్యే గుండాయిజం : రియాజ్‌ అహ్మద్‌
గెలిచిన తమ అభ్యర్థులకు కండువాలు కప్పి బలవంతంగా కాంగ్రెస్‌ పార్టీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని రియాజ్‌ అహ్మద్‌ ఆరోపించారు. అయినా తమ అభ్యర్థులు భయపడలేదని తెలిపారు. భవిష్యత్తులో కోల్‌ బెల్ట్‌ ఏరియాలో కార్మికుల కోసం పనిచేసే వారినే ప్రజలు గెలిపిస్తారని చెప్పారు. రానున్న రోజుల్లో హెచ్‌ఎంఎస్‌, జాగృతి, ఫార్వర్డ్‌ బ్లాక్‌ కలిసి కార్మికుల కోసం పనిచేస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో ఫార్వర్డ్‌ బ్లాక్‌ సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ ఆర్‌వీఆర్‌ ప్రసాద్‌, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్‌.రూప్‌ సింగ్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

బండి సంజయ్‌ బెదిరింపులు : అంబటి జోజిరెడ్డి
కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని అంబటి జోజిరెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌లో మెజారిటీ రాక బీజేపీ నేతలు తమ అభ్యర్థి ఒకరిని బెదిరించి కండువా కప్పారనీ, అయినా వారంతా తమతోనే ఉన్నారని తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులంటూ బండి సంజయ్‌ తప్పుదోవ పట్టిస్తున్నారని జోజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రికి పార్టీ అభ్యర్థికీ, స్వతంత్ర అభ్యర్థికి తేడా తెలియదా? అని ప్రశ్నించారు. భవిష్యత్తులోనూ జాగృతితో కలిసి పోటీ చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -