నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన “కోనసీమ దిష్టి” వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… పవన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు. ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి.
లేదంటే, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా.. తెలంగాణలోని ఒక్క థియేటర్‌లో కూడా ఆయన సినిమా విడుదల కాదు” అని స్పష్టం చేశారు. అనంతరం పవన్ సోదరుడు చిరంజీవిని ప్రస్తావిస్తూ.. “చిరంజీవి ఒక సూపర్ స్టార్, ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు” అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.
పవన్ ఏమన్నారంటే?
ఇటీవల పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అన్నారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.



