Saturday, February 28, 2026
E-PAPER
Homeరాష్ట్రీయందళారీకి సం'పత్తి'.. రైతుకు వి'పత్తి'

దళారీకి సం’పత్తి’.. రైతుకు వి’పత్తి’

- Advertisement -

తుది దశకు సీసీఐ కొనుగోళ్లు..
కపాస్‌ యాప్‌ తెచ్చినా ఆగని దళారుల దందా
రైతుల పేరుతో సీసీఐకి అమ్మి లబ్ది పొందిన వ్యాపారులు
రాష్ట్రంలో పత్తి పండించిన రైతులు 21 లక్షలు..
సీసీఐకి విక్రయించింది 8.50 లక్షల మందే
ఇప్పటివరకు 16 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తి విక్రయం


నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఈ ఏడాది పత్తి పంట రైతులకు ఆశాజనకంగా లేదనే చెప్పాలి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు వెంటాడాయి. దీనివల్ల పత్తిలో తేమశాతం పెరిగింది. పంట నాణ్యత కూడా దెబ్బతిన్నది. దూది నల్లగా మారింది. వెరసి సీసీఐ నిబంధనలకు అనుగుణంగా పత్తి పంట లేకపోవడం దళారులకు వరంగా మారింది. దళారుల పాత్రను నిరోధించి, మద్దతు ధరతో రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసేందుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) చేసిన ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దళారుల నియంత్రణ కోసం తెచ్చిన కపాస్‌ యాప్‌ రైతులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని కేంద్రం ప్రగల్బాలు పలికింది. కానీ రైతులకు దీనిపై అవగాహన లేకపోవటం.. ప్రభుత్వం సైతం అవగాహన కల్పించకపోవడం.. రైతుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడం.. దళారులకు కలిసి వచ్చింది. ఓవైపు యాప్‌.. మరోవైపు సీసీఐ నిబంధనల పేరుతో కొర్రీలు.. ఇవన్నీ ఎందుకని రైతులు ప్రయివేట్‌ వ్యాపారులకు అధిక మొత్తంలో విక్రయించారు. అదే రైతుల పట్టాదారు పాస్‌ పుస్తకాలను ఉపయోగించుకొని.. వారి పేరుతో దళారులు సీసీఐకి విక్రయించి లబ్ది పొందారు. రైతుల వద్ద నుంచి క్వింటాల్‌ పత్తి రూ.4వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేసిన వ్యాపారులు.. సీసీఐ నిర్ధారించిన ధరలకు అమ్మి ప్రయోజనం పొందారు. ఇలా క్వింటాకు కనీసం రూ.300 నుంచి రూ.వెయ్యికి పైగా లాభం పొందారు.

దళారీకి భేష్‌.. కపాస్‌ యాప్‌
కపాస్‌ కిసాన్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని, దాని ద్వారానే స్లాట్‌ బుక్‌ చేసుకొని పత్తిని సీసీఐకి విక్రయించాలనే నిబంధన కేంద్రం విధించారు. దాని ఆధారంగా అధికారులు రైతు పండించిన పత్తిని ఉమ్మడి జిల్లా పరిధిలోని జిన్నింగ్‌ మిల్లుల్లోనే విక్రయించేలా నిబంధనలు పెట్టారు. దీనిలోని లొసుగులను ఆసరాగా చేసుకొని దళారులు, జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేసి, మద్దతు ధరకు రైతుల ముసుగులో మళ్లీ సీసీఐకే అనేకచోట్ల విక్రయించారు. రాష్ట్రంలో పత్తి పండించిన రైతులకు.. విక్రయించిన రైతులకు మధ్యనున్న భారీ వ్యత్యాసమే దీనికి నిదర్శనం. రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రైతులు ఖరీఫ్‌ సీజన్‌లో పత్తిని సాగు చేయగా, నాలుగు నెలల పాటు పత్తి విక్రయాలు సాగాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా పత్తి విక్రయాలు పూర్తయ్యే దశకు వచ్చాయి. ఈనెల 20తో అధికారికంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయాలని సీసీఐ భావించింది. కానీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు మరికొంత సమయం ఇచ్చింది.

మార్కెటింగ్‌, సీసీఐ అధికారుల కుమ్మక్కు.. అనేక సందేహాలు?
రైతుల నుంచి పత్తిని దళారులు సేకరించినప్పుడే రైతుల ఫోన్‌ నంబర్లు తీసుకొని ఓటీపీ ఆప్షన్‌ ద్వారా కౌలు రైతుల పేరిట పత్తిని సీసీఐకి విక్రయించారు. ఈ దందాలో వ్యవసాయ, మార్కెటింగ్‌, సీసీఐ అది óకారులు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన కీలక వ్యక్తులు, సీసీఐ అది óకారుల మధ్య రూ. కోట్ల ఒప్పందాలు జరిగి నట్టు సమాచారం. మంత్రివరకూ ఈ విషయం వెళ్లినా పట్టనట్టే ఉండటంపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు నాలుగు నెలల్లో రూ.585 కోట్ల పత్తిని సీసీఐ సేకరించింది. 83శాతం సొమ్ము ను రైతులకు చెల్లించింది. ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా, బూర్గంపాడు, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ఆధ్వర్యంలో 14 సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. అక్టోబర్‌లో కొనుగోళ్లు మొదలవగా రూ.584 కోట్ల విలువైన 7.50 లక్షల క్వింటాళ్ల పత్తి సేకరించారు. తొలుత వారానికోసారి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమవగా.. ప్రస్తుతం మూడు రోజుల్లోనే డబ్బులు పడుతున్నట్టు మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 6.20 లక్షల క్వింటాళ్లకు రూ.485 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ఉభయ జిల్లాల్లో సుమారు 4.77 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. వరుస వర్షాలతో దిగుబడి తగ్గింది. ఆరంభం లో సీసీఐ కేంద్రాల ఏర్పాటులో జాప్యంతో రైతులు మార్కెట్‌లో వ్యాపారులు, దళారులను ఆశ్రయించారు. కనీస మద్దతు ధర రూ.8,110 దొరక్క అష్టకష్టాలు ఎదుర్కొన్నారు.

ప్రయివేటు అమ్మకాలే ఎక్కువ..
రైతులు నేరుగా సీసీఐకి అమ్మిన పంట కంటే ప్రయివేట్‌ విక్రయాలే అధికంగా ఉన్నాయి. సీసీఐ రికార్డుల ప్రకారం ఇప్పటివరకు కేవలం 8.50 లక్షల మంది రైతులు 16 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని 336 సీసీఐ కేంద్రాల్లో విక్రయించారు. వీరు కాకుండా మరో 2 లక్షల మంది రైతులు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని ప్రయివేటు వ్యాపారులకు విక్రయించి ఉండొచ్చని మార్కెటింగ్‌ శాఖ చెబుతోంది. అంటే దాదాపు 10 లక్షల మంది రైతులు 21 లక్షల మెట్రిక్‌ టన్నుల పత్తిని విక్రయించినట్టు తెలుస్తోంది. ఈ లెక్కన పత్తి సాగు చేసిన 25 లక్షల మంది రైతుల్లో మిగతా 15 లక్షల మంది రైతులు పంటను ఎక్కడ విక్రయించారనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. రైతుల ముసుగులో వ్యాపారులే ఈ విక్రయాలకు పాల్పడినట్టు తెలుస్తోంది.

కపాస్‌ యాప్‌పై అవగాహన తర్వాత పరిస్థితుల్లో మార్పు
మొదట కపాస్‌ కిసాన్‌ యాప్‌ గురించి తెలియక రైతులు ఇబ్బందులు పడ్డారు. తదనంతరం అవగాహన పెంచుకొని సులభంగా స్లాట్‌ బుక్‌ చేసుకొని పత్తిని విక్రయించారు. కొన్న మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నాం. నిబంధనల ప్రకారం పత్తి విక్రయించి రైతులు మద్దతు ధర పొందాలి.
-ఎంఏ అలీం, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి, ఖమ్మం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -