రెండేండ్ల కనిష్టానికి సెన్సెక్స్
2025-26లో మైనస్ రిటర్న్‌లు
కుప్పకూలిన కీలక రంగాలు
రూ.1.34 లక్షల కోట్ల సంపద ఆవిరి..
లక్ష మార్క్ ఆశలు ఆవిరి
ముంబయి : స్టాక్ మార్కెట్లలో లాభాల పంట పండుతుందని ఆశించిన ఇన్వెస్టర్లకు గతేడాది కోలుకోని దెబ్బ తీసింది. గడిచిన ఏడాది కాలంగా అంతర్జాతీయ యుద్ధ మేఘాలు, ముడి చమురు సెగలు, రూపాయి పతనం, దేశీయ వృద్ధి రేటుపై అనుమానాలు, భయాలు వంటి ముప్పేట దాడులతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. కష్టపడి దాచుకున్న లక్షల కోట్ల రూపాయల సంపద కండ్ల ముందే హరించుకుపోవడంతో సామాన్య ఇన్వెస్టర్ల నుంచి బడా ట్రేడర్ల వరకు అంతా గొల్లుమంటున్నా రు. ఆర్థిక సంవత్సరం 2025-26లో అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ 7 శాతం, నిఫ్టీ 5 శాతం మేర కుంగిపోవడంతో ఈ ఆర్థిక సంవత్సరం ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. విదేశీ ఇన్వెస్టర్లు సుమారు రూ.1.80 లక్షల కోట్ల నిధులను వెనక్కి తీసుకోవడం మార్కెట్లను మరింత అగాధంలోకి నెట్టింది. మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూపాయి 95 మార్కును దాటడం ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. వెరసి గతేడాది మార్కెట్ సంబరం కాస్తా విషాదంగా మారి మదుపర్ల జేబులకు భారీ చిల్లులు పెట్టింది. గతేడాది సెప్టెంబర్ నుంచి భారత ఈక్విటీ మార్కెట్లు పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 1,00,000 మార్కును చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేయగా.. దానికి విరుద్ధంగా ప్రస్తుతం సూచీలు రెండేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో 2025-26 మార్కెట్లకు గడ్డుకాలంగా మారింది. 2025 మార్చి ముగింపు నాటికి సెన్సెక్స్ 77,414 వద్ద ముగిసింది. ఈ ఏడాది సెన్సెక్స్ 5,467 పాయింట్లు లేదా 7 శాతం పతనమై మార్చి 30 నాటికి 72,000 దిగువన 71,947కు పరిమితమయ్యింది. గత రెండ్లేంలో సెన్సెక్స్ రెండుసార్లు 85,000 మార్కును తాకినప్పటికీ ఆ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది. మార్కెట్ అస్థిరతను సూచించే ‘ఇండియా విఐఎక్స్ ఇండెక్స్ గత ఏడాది కాలంలో 120 శాతం పెరిగి 27.89 వద్ద ముగియడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. 2025-26లో బీఎస్‌ఈలో లిస్టింగ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.413.75 లక్షల కోట్ల నుంచి రూ.412.41 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే ఇన్వెస్టర్లు సుమారు రూ.1,34,414 కోట్ల మేర తమ సంపదను కోల్పోయారు.
పీఎస్‌యూ బ్యాంకుల హవా
మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పటికీ కొన్ని రంగాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ముఖ్యంగా నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 27 శాతం లాభపడటం తో ఈ ఏడాది మెరుగైన ప్రగతిని కనబర్చింది. వీటితో పాటు మెటల్ 23 శాతం, డిఫెన్స్ 13 శాతం, ఆటో 12 శాతం చొప్పున లాభాలను అందించాయి. అయితే, ఐటి రంగం 21 శాతం పతనమై తీవ్రంగా నష్టపోయింది. రియల్టీ, టూరిజం రంగాలు 23 శాతం చొప్పున కుంగాయి. ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాలు కూడా రెండంకెల నష్టాలను చవిచూశాయి.
యుద్ధం ముగిస్తే తప్పా..
భారత కరెన్సీ రూపాయి విలువ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం క్షీణించి చరిత్రలో తొలిసారిగా 95 మార్కును దాటడం ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతినడం, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ద్రవ్యోల్బణానికి దారితీసి కంపెనీల లాభాలపై ప్రభావం చూపాయి. రాబోయే 2026-27లో కూ డా యుద్ధం ముగిసి, చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్ల స్థాయికి దిగివస్తే తప్ప మార్కెట్లు కోలుకునే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అప్పటివరకు సాధారణ ఇన్వెస్టర్లు ఆచి తూచి అడుగులు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



