Saturday, February 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎక్సైజ్‌ అధికారులకు ఆయుధాలు

ఎక్సైజ్‌ అధికారులకు ఆయుధాలు

- Advertisement -

ప్రత్యేక శిక్షణ ఇచ్చి అప్పగిస్తాం
డ్రగ్స్‌రహిత తెలంగాణే లక్ష్యం
కానిస్టేబుల్‌ సౌమ్య బలిదానం వృధా కానివ్వం : ఎక్సైజ్‌ అధికారుల డైరీ ఆవిష్కరణలో మంత్రి జూపల్లి కృష్ణారావు


నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. దీనికోసం ఎక్సైజ్‌ అధికారులకు ఆయుధాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదనీ, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కానిస్టేబుల్‌ సౌమ్య బలిదానాన్ని వృధా కానివ్వబోమని, కచ్చితంగా ఇప్పుడున్న విధానాల్లో మార్పులు చేస్తామని స్పష్టంచేశారు. ఆయుధాల వినియోగంపై ఎక్సైజ్‌ అధి కారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రోహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ రూపొందించిన డైరీ, క్యాలెండర్లను శుక్రవారం రవీంద్రభారతిలో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్తు కోరల్లో చిక్కి యువత భవిష్యత్‌ నాశనమవుతోందనీ, ఎన్నో కుటుంబాలు చితికిపోయి, తల్లిదండ్రుల ఆశలు అడియాశలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో కానిస్టేబుల్‌ సౌమ్య మృతి చెందడం దుర దృష్టకరమనీ, ఆమె కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిందని గుర్తుచేశారు. స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్‌ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదనీ, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చి ఆయుధాలను అప్పగిస్తామని తెలిపారు. అక్రమ మద్యం నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు అంకితభావంతో పని చేస్తున్న అధికారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీ, ఎక్సైజ్‌ అకాడమీ డైరెక్టర్‌ సురేష్‌ రాథోడ్‌, జాయింట్‌ కమిషనర్‌ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌) జీ అంజన్‌రావు, డిప్యూటీ కమిషనర్‌ జే హరికిషన్‌, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూర కృష్ణ, జనరల్‌ సెక్రటరీ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -