సీఎస్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతిపత్రం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌లో వెయిటేజ్ మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును టీఎస్‌యూటీఎఫ్ కోరింది. ఈ మేరకు గురువారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావ రవి వినతిపత్రం సమర్పించారు. టెట్‌లో అర్హత మార్కులను జనరల్, బీసీ క్యాటగిరీ అభ్యర్థులకు 40 శాతానికి, ఎస్సీ, ఎస్టీలకు 30 శాతానికి తగ్గించాలనీ, లేదా ఇన్ సర్వీస్ టీచర్లకు సర్వీసును బట్టి 5 నుంచి 20 వరకు వెయిటేజీ మార్కులు కలపాలని ఆయన కోరారు. ప్రధానంగా బయోలాజికల్ సైన్స్, భాషోపాధ్యాయులు సబ్జెక్టుకు సంబంధం లేకుండా సిలబస్‌లో ప్రశ్నలు ఎదుర్కోవలసి వచ్చిందని ఆయన తెలిపారు. వయసు, ప్రిపరేషన్ తదితర ప్రతికూలతల కారణంగా ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉందనీ, వారికి ఉపశమనం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలని రవి కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎస్ విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని హామి ఇచ్చినట్టు చావ రవి వెల్లడించారు.



