Friday, October 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిధర్మస్థలాల విధ్వంసం ముస్లిం రాజులు మాత్రమే చేశారా?

ధర్మస్థలాల విధ్వంసం ముస్లిం రాజులు మాత్రమే చేశారా?

- Advertisement -

మనమిప్పుడు ANTI-INTELLECTUAL TIMES లో బతుకుతున్నాం. అంటే, మేధో వ్యతిరేక కాలంలో బతుకుతున్నాం. వైజ్ఞానిక అవగాహనని, హేతుబద్దతని ప్రభుత్వాలు భరించలేక పోతున్నాయి. HUMAN ACHIEVEMENTS మీద దృష్టిపెట్టి పనిచేయాల్సిన సమయంలో మనిషి స్థాయిని, మానవత్వపు స్థాయిని తగ్గించే ప్రయత్నం ఇప్పుడు దేశంలో జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తున్న NCERT/CBSE లు హైస్కూలు స్థాయి సిలబస్‌ మార్చినందువల్ల, రాబోయే తరాల భవిష్యత్తు అంధకారం కాబోతూ ఉంది. సైన్సు,చరిత్ర, సామాజిక శాస్త్రాల్లో అత్యవసరమైన అంశాలు తొలగించి, పనికిమాలిన అంశాలు అందులో చేర్చాయి.

ఆరెస్సెస్‌- బీజేపీ హిందుత్వ ఎజెండాను వ్యాప్తి చేయడానికి ప్రభుత్వం, ఈ సంస్థలను ఉపయోగించుకుంటోంది. అహేతుకంగా పదాలు, వాక్యాలు, పేరాలు, కొన్నిభాగాలు, కొన్నిపాఠాలు తొలగించి, పాఠ్యపుస్తకంలో హేతుబద్దత ఎలా పెంచగలరూ? కోవిడ్‌ సమయంలో విద్యార్థులపై భారం తగ్గించడం కోసం కొన్ని మార్పులు చేశామన్నారు. సరే, అప్పుడేదో హడావుడిగా నిర్ణయాలు తీసుకున్నారు. కోవిడ్‌ తర్వాత నిదానంగా పరిశీలించి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేదూ? ఇవి రేషనింగ్‌ (కుదింపు)కు రేషనల్‌ (హేతుబద్దతకు తేడా తెలుసుకోకుండా తీసుకున్న తొందరపాటు చర్యలని మేధావి వర్గం తీవ్రంగా విమర్శిస్తోంది!

ఉదాహరణకు గాంధీని చంపినవాడి పేరు చెప్పకుండా, గాంధీ మరణం గురించి ఎలా చెప్పగలరూ? చంపిన వాడు మహారాష్ట్రకు చెందిన చిత్పవన్‌ బ్రాహ్మణుడన్న వాక్యం తీసేసినంత మాత్రాన అది పిల్లలపై ప్రభావం తగ్గించగలదా? అలాగే 2002 నాటి గుజరాత్‌ అల్లర్ల గురించిన విషయాలు మీరు పాఠ్యపుస్తకాల్లోంచి తీసేసినంత మాత్రాన విద్యార్థులకు ఇక అవిషయాలు తెలియకుండా పోతాయా? ఇంటా బయటా వాటి గురించిన వార్తలు వినిపిస్తూనే ఉంటాయి కదా? మీడియాలో చర్చలు కనిపిస్తూనే ఉంటాయి కదా? పైగా ఆ విషయాల మీద రచయితలు రాసిన, రాస్తున్న పుస్తకాలు మారెట్లో, ఇంటర్నెట్‌, గ్రంథాలయాల్లో ఎదురౌతూనే ఉంటాయి కదా? దౌర్జన్య పూరితంగా ప్రచారం చేసే అబద్దాలు సమాజం మీద దుష్ప్రభావం చూపుతాయి నిజమే! కాని, అవి ఎల్లకాలమూ కొనసాగలేవు.

నిజాలు నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించినా, అవి గర్జిస్తూనే ఉంటాయి. కొద్దిమందైనా సరే సత్యప్రేమికులు, సత్యశోధకులు వాటిని దివిటీల్లా పట్టుకొస్తారు. ఉన్నత పాఠశాలకు చేరిన 11-12 తరగతుల విద్యార్థులకు అలబద్దాలు చెప్పి మభ్యపెట్టాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ముస్లిం రాజులు, ముఖ్యంగా మొఘలులు దోపిడిదారులని, క్రూరులనీ, వారు హిందూ ధర్మస్థలాల్ని, దేవాలయాల్ని ధ్వంసం చేశారని మార్చిన సిలబస్‌ ప్రకారం హైస్కూలు పాఠ్యాంశాల్లో చేర్చారు. అందులో ఎంతనిజం ఉందో చూద్దాం! ధర్మ స్థలాల విధ్వంసం ముస్లిం రాజులు మాత్రమే చేశారా? లేక రాజులయిన వారందరూ చేశారా? అలా అయితే, ఎవరెవరు ఎప్పుడెప్పుడు చేశారు? చరిత్ర పుటల్ని తిరగేసి నిజాల్ని తోడుకుందాం –

ధర్మ స్థలాల విధ్వంసం
సాధారణ శకానికి పూర్వం 185వ సంవత్సరంలో చివరి మౌర్యవంశపు రాజైన బ్రహద్రత మౌర్యను అతని బ్రాహ్మణ సేనాపతి పుష్ప మిత్ర శృంగుడు హత్య చేసి, తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. శృంగవంశపు రాజ్యాన్ని సాపించుకున్నాడు. యుద్ధం లేకుండా నగరాన్ని స్వాధీనం చేసుకున్నానని – అంతకు ముందున్న సాకేత్‌ అనే పేరు మార్చి ‘ఆయుద్ధ’ అని పెట్టాడు. కాల క్రమంలో అదే అయోధ్య అయ్యింది. సాకేత పురవాసా అనే పదం వైదికుల భజనల్లో, కీర్తనల్లో మనకు ఇంకా వినిపిస్తూనే ఉంది. అదే అయుద్ధకు (అయోధ్యకు) పాతపేరు.
పుష్యమిత్ర శృంగుడు సాధారణ శకానికి ముందు 185-149 కాలంవాడు. బౌద్ధ ధర్మ విధ్యంసంలో అతి క్రూరమైన విధానాలు పాటించాడు. ఎన్నో బౌద్ధారామాల్ని, బౌద్ధ స్థూపాల్ని కూల్చేయించాడు. సాంచీ వంటి ముఖ్యమైన బౌద్ధ స్థలాల్ని ధ్వంసం చేయించాడు.

ఆశోక చక్రవర్తి పెట్టించిన స్థూపాలు, కట్టించిన విహారాల మూలంగా ఆ ప్రాంతాన్ని ‘విహార్‌’ అని అన్నారు అదే ఇప్పుడు బీహార్‌ అయింది. పుష్య మిత్రుడు, ఇంకా ఇతరులూ బౌద్ధ విహారాల్ని ధ్వంసం చేస్తూ రావడంవల్ల-బీహార్‌లో మనకు బౌద్ధ అవశేషాలు తక్కువగా కనిపిస్తాయి. అయితే దేశవ్యాప్తంగా అవి విస్తృతంగానే ఉన్నాయి. పుష్యమిత్ర శృంగుడు అంతటితో ఆగలేదు. బౌద్ధ భిక్కుల మీద లైంగికదాడులు చేయించాడు. హత్యలు చేయించాడు. బౌద్ధభిక్కు తల తెగ్గోసి, తెచ్చి చూపినవారికి వంద బంగారు నాణాలిస్తానని ప్రకటించాడు. సులభంగా దొరికే బంగారు నాణాల కోసం సామాన్య పౌరులు కూడా బౌద్ధ బిక్కుల్ని హత్య చేస్తుండేవారు. జనంలో ఆశ పెరిగి, ఒకే తల పలుమార్లు చూపించి నాణాలు తీసుకుపోయేవారు. ఆ విషయం రాజుకు తెలిసి, దాన్ని మాన్పించడం కోసం ఒక పథకం ప్రవేశపెట్టాడు. వచ్చిన తలల్ని సేకరించి, వాటిని గాగ్రానది ఒడ్డున బండమీద కొట్టి ముఖ కవళికలు చిదిమేయించేవాడు. తర్వాత వాటిని నదిలో వదిలేయించేవాడు. ఆ నది ఆ విధంగా ‘సర్‌ యుక్త నది’ అయింది. అంటే తలలతో కూడిన నది- అని అర్ధం! వాడుకలో అదే సర్‌యూ/ సరయూ నది అయ్యింది!

బౌద్ధ భిక్కుల ముఖాలు బండకేసి కొట్టి ఛిద్రం చేసే ఆ ప్రక్రియకు కొనసాగింపుగా వైదిక మతస్తులు పూజలో కొబ్బరికాయ కొట్టడాన్ని ప్రవేశపెట్టారు. అది ఇప్పటికీ ఆచారంగా కొనసాగుతూ ఉంది. ఇక బౌద్ధ భిక్కుల తలనరికి, రాజు దగ్గర బంగారు నాణాలు తెచ్చుకోవడం అనేది ఒక ఘనకార్యంగా భావించబడుతూ ఉండేది. అదే విషయం సమాజంలో అందరికీ తెలియజేసుకోవడానికి తల ఆకారంలో ఉండే గుమ్మడికాయను ఇంటి గుమ్మం పైన కట్టుకునేవారు. ఈ ఆచారం కూడా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అసలు కారణాన్ని కప్పిపుచ్చే విధంగా వైదికులు ‘దిష్టి’ని ప్రచారంలో పెట్టారు.

వీధి గుమ్మానికి అలా కట్టుకుంటే – ఆ ఇంట్లో ఉన్న వారికి దిష్టి తగలదు- అంతా శుభం చేకూరుతుంది అని చెపుతూ వచ్చారు. ఇప్పటికీ జనం దాన్నే నమ్ముతున్నారు. బౌద్ధాన్ని నిరాక్షిణ్యంగా నాశనం చేసింది వాళ్లే! మళ్లీ జనానికి తప్పుడు కథనాలు అల్లి చెప్పిందీ వాళ్లే!! నిజాలు తెలుసుకోలేని అధిక సంఖ్యాకులు తమది ఒక గొప్ప సంస్కృతి అని విర్రవీగుతుంటారు. అంతటి అరాచకాన్ని సృష్టించిన ఆ శృంగవంశ చరిత్రను ఇప్పుడు పిల్లల పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. అందులో ఇలాంటి వాస్తవాలు చెపుతారా? అంటే అదే నమ్మకం లేదు. అబద్ధాలు ప్రచారం చేయడం ఒకప్పటి వైదిక మతానికే కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలకు కూడా అలవాటే కదా!

సాధారణ శకం 7వ శతాబ్దంలో గౌడ రాజ్యానికి రాజైన శశాంకుడు బౌద్ధాన్ని నాశనం చేయడానికి చాలా కృషి చేశాడు. ఈయన శివ భక్తుడు ఈయన రాజ్యం ప్రస్తుత బెంగాల్‌ ప్రాంతంలో ఉండేది. నలంద మొదలైనచోట్ల దాడులు చేయించి బౌద్ధారామాల్ని ధ్వంసం చేయించాడు. ఈయన చేసిన మరో దుర్మార్గం ఏమిటంటే- బుద్దగయలో ఏ బోధి వృక్షం కిందైతే బుద్ధుడికి జ్ఞానోదయమైందో, ఆ వృక్షాన్ని నరికించి ముక్కలు చేయించి, వేళ్లతో సహా కాల్చేయించాడు. కారణం ఓర్వలేనితనం! ఆబోధి వృక్ష సందర్శనం కోసం జనం తండోప తండాలుగా తరలి రావడం ఆయనకు నచ్చలేదు. బౌద్ధ ప్రచారానికి ఆ వృక్షం సహకరిస్తోందన్న అక్కసుతో రాజు శశాంకుడు దాన్ని నాశనం చేయించాడు.

ధర్మ స్థలాల విధ్వంసమంతా మొఘలులూ, ముస్లిం రాజులు మాత్రమే చేశారని పాఠాలు ఎలా చెప్పగలరూ? మొదటి రాజేంద్ర చోళుడు (సా.శ 1014-1044) శ్రీలంక, మాల్దీవులు, తూర్పున ఉన్న దక్షిణఆసియాలోని పలు ప్రాంతాలు ఆక్రమించుకున్నాడు. ఆయన గెల్చుకుని స్థాపించుకున్నది – శ్రీవిజయ సామ్రాజ్యం! దానినే మనం ఇప్పుడు ఇండోనేషియా అని పిలుచుకుంటున్నాం. ఆయన చేసిన యుద్ధాల్లో వేలమంది చనిపోయారు. అందులో మరి క్రూరత్వం లేదా? ఆ రోజుల్లో ప్రజాస్వామ్యం లేదు. రాజ్యాంగం లేదు. రాజు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు శిరసా వహించాల్సిందే! ఈ ఆధునిక ప్రజాస్వామ్యయుగంలో రాజ్యాంగాన్నీ, ప్రజాభీష్టాన్ని పక్కకునెట్టి – అక్రమంగా అధికారంలోకి వచ్చినవారు వారికి తోచిన నిర్ణయాలు తీసుకోవచ్చా? ఆలోచించాల్సిన విషయం కదా?
కర్నాటకలో హొయసల వంశపురాజు విష్ణువర్ధన్‌ (సా.శ 1108-1152) జైన మతాన్ని వదిలేసి వైష్ణవమతం స్వీకరించాడు.

ఫలితంగా జైన మందిరాలను వైష్ణవాలయాలుగా మార్పించాడు. ఉదాహరణకు బేలూరు, హళైబీడు వంటి వాటిని చూడొచ్చు. మొదట అవి జైన మంది రాలుగా నిర్మించబడ్డాయి. ఇక కవి కల్హణుడి సంస్కృత గ్రంథం ‘రాజతరంగిణి’ ప్రకారం కశ్మీర్‌ ప్రాంతపు రాజు రాజా హర్షదేవ్‌ (సా.శ 1089 -1101) హిందూ దేవీ దేవతా విగ్రహాల నుండి వెండి, బంగారం, ఆభరణాలు, ఇతర దేవాలయ ఆస్తులు స్వాధీనం చేసుకునేవాడు. అందుకు ప్రత్యేకంగా ఒక అధికారినే నియమించాడు. అతణ్ణి ‘దేవోత్పతన్‌ నాయక్‌’ అని వ్యవహరించేవారు. దేవతా విగ్రహాల్ని పతనం చేసే వాడు పడగొట్టేవాడు అని అర్థం! అతను అధికారికంగా మందిరాలను నాశనం చేసి, ఆలయ నిధులను ప్రభుత్వ ఖజానాకు తరలించేవాడు. మొఘ లులు ఇలాంటి అధికారిని నియమించి నట్టు చరిత్రలో లేదు. ఇక సా.శ. పదకొండో శతాబ్దంలో రాజు కులోత్తుంగ చోళుడు వైష్ణవ మత ప్రభావంలో పడి, అంతకు ముందున్న జైన – బౌద్ధ మందిరాలను వైష్ణవాలయాలుగా మార్పించాడు.

మార్పించడానికి అనువుగా లేని వాటిని పూర్తిగా ధ్వంంసం చేశాడు. చరిత్రలో ఇంత బలంగా ఉన్న వైదిక-హిందూ రాజుల అఘాయిత్యాలను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చలేదు? చేర్చనంత మాత్రాన జనానికి తెలియదనుకోవడం పొరపాటు ఇక్కడ మనం చెప్పుకున్న రాజులంతా బయటి నుంచి వలస వచ్చినవారు కాదు. ఈ దేశపు వారే. వారిలో వారికి ఐకమత్యం లేక నిరంతరం యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. వీరు చేసిన యుద్ధాల్లో కూడా వేల మంది మరణించారు. గెలిచిన హిందూరాజు ఓడిన వాణ్ణి దోచుకునేవాడు. సంపదనే కాదు, స్త్రీలను కూడా ఆస్తి కింద జమకట్టి జప్తు చేసుకుపోయేవాడు. వీళ్లలో కూడా తండ్రుల్ని, సోదరుల్ని చంపి రాజాని కొచ్చిన వారున్నారు.

మరి వీళ్లది క్రూరత్వం కాదా? మరి వీళ్లది దోపిడీ కాదా? ముస్లిం – హిందూ రాజుల మధ్య జరిగిన యుద్ధాలలో కూడా మతం కేంద్ర బిందువు కాదు. ఇద్దరు రాజుల మధ్య రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాల్లాగానే చూడాలి. దేశంలో ముస్లింల మీద ద్వేషభావం పెంచడానికి మొఘల్‌ పాలకుల్ని టార్గెట్‌ చేస్తారా? వారిని విలన్లుగా చిత్రీకరిస్తారా, కాస్తంత సమభావం – సమాదరణ ఉండాలి కదా? చెడు లక్షణాలన్నింటిని మొఘల్‌ పాలకులకు, ముస్లింలకు అంటగట్టడం వెనుక ఉద్దేశమేమిటో ఈదేశ ప్రజలకు పూర్తిగా అర్థమైంది! ఒకవేళ గతంలో ఎవరి వల్లనైనా పొరపాట్లు జరిగి ఉంటే – అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడుతూ హుందాగా ప్రవర్తించాలి. అంతే!! ఏద మరి? మన పాలకులకూ వారి కనుసన్నల్లో మెదిలే వ్యవస్థలకు, సంస్థలకు ఆ ఆలోచనే ఉన్నట్టు లేదు.

విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్‌,
కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు విజేత.

డాక్టర్‌ దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -