Wednesday, April 1, 2026
E-PAPER
Homeఆటలుఎఫ్‌1కు పశ్చిమాసియా బ్రేక్‌

ఎఫ్‌1కు పశ్చిమాసియా బ్రేక్‌

- Advertisement -

సీజన్‌కు ఐదు వారాల విరామం
రేేసు లేకుండానే సాగనున్న ఏప్రిల్‌


ఫార్ములా 1 సీజన్‌కు అనూహ్య విరామం. మార్చిలో ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రీతో మొదలైన సీజన్‌ 77.. నెలరోజుల్లోనే ఊహించని బ్రేక్‌ తీసుకుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో ఏప్రిల్‌లో ఎఫ్‌1 రేసు నిర్వహించటం లేదు. మయామి ఓపెన్‌తో మే 4న సీజన్‌ పున ప్రారంభం కానుంది.

నవతెలంగాణ క్రీడావిభాగం
2026 ఎఫ్‌1 సీజన్‌కు గట్టి ఎదురుదెబ్బ. ఈ ఏడాది మార్చి 8న ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రీతో ఆరంభమైన సీజన్‌ 77.. చైనీస్‌ గ్రాండ్‌ప్రీ, జపనీస్‌ గ్రాండ్‌ ప్రీ రేసులను విజయవంతంగా ముగించుకుంది. ఆసియాలో జరిగిన రెండు రేసుల్లో 19 ఏండ్ల యువ రేసర్‌ కిమి ఆంటోనెలి విజేతగా నిలిచి.. ప్రపంచ రికార్డులపై కన్నేయగా ఎఫ్‌1 సీజన్‌కు అనూహ్యకేక్‌ పడింది. మార్చి 29న జపనీస్‌ గ్రాండ్‌ ప్రీ ముగియగా.. ఆ తర్వాత ఏకంగా ఐదు వారాల పాటు విరామం వచ్చింది. ఈ మేరకు ఎఫ్‌1 నిర్వాహకులు ఇదివరకే ప్రకటించారు. 2020 కోవిడ్‌ మహమ్మారి సమయంలో ఎఫ్‌1 సీజన్‌ ఆలస్యంగా జులైలో ఆరంభమైంది. అది మినహాయిస్తే.. ఇప్పటివరకు ఎఫ్‌1 సీజన్‌లో ఒక్క రేసు లేకుండా ఏప్రిల్‌ షెడ్యూల్‌ ఖాళీగా ఉండలేదు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం ఎఫ్‌1పై పడింది. దీంతో ఏప్రిల్‌లో ఒక్క రేసు కూడా షెడ్యూల్‌ చేయలేదు. కొత్త రూల్స్‌తో ఆరంభమైన 77వ సీజన్‌లో మెర్సిడెస్‌ ముందంజలో దూసుకెళ్తోంది.

ఎందుకీ విరామం
ఎఫ్‌ఐఏ (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ఆటోమొబైల్‌) వాస్తవానికి ఏప్రిల్‌లో రెండు రేసులు షెడ్యూల్‌ చేసింది. ఆసియాలో చైనా, జపాన్‌ రేసులు ముగియగా.. పశ్చిమాసియాలో తర్వాతి రెండు రేసులు జరగాల్సి ఉంది. ఏప్రిల్‌ 12న బహ్రెయిన్‌ గ్రాండ్‌ ప్రీ, ఏప్రిల్‌ 19న సౌదీ అరేబియన్‌ గ్రాండ్‌ ప్రీ జరగాలి. కానీ, ఎఫ్‌ఐఏ ఏప్రిల్‌లో జరగాల్సిన రెండు రేసులు పశ్చిమాసియా యుద్ధం కారణంగా జరగటం లేదని వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌ మాసంలో ఎఫ్‌1 సీజన్‌కు ఊహించని విరామం వచ్చింది.

రద్దు చేసినట్టేనా?
బహ్రెయిన్‌, సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రీలను ఏప్రిల్‌లో నిర్వహించటం లేదని మాత్రమే ఎఫ్‌ఐఏ వెల్లడించింది. కానీ ఈ రెండు రేసులను ఈ సీజన్‌లో రద్దు చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. దీంతో రేసుల రీ షెడ్యూల్‌కు ద్వారాలు తెరిచే ఉన్నాయి. సాధారణంగా ఎఫ్‌1 సీజన్‌లో 24 రేసులు ఉంటాయి. బహ్రెయిన్‌, సౌదీ అరేబియా రేసులు రద్దుగా ముగిస్తే.. 22 రేసులు మాత్రమే ఉంటాయి. ఓవరాల్‌ చాంపియన్‌, టీమ్‌ చాంపియన్‌ను సైతం 22 రేసుల్లోనే తేల్చాల్సి ఉంటుంది. ఎఫ్‌1 సీజన్‌కు హంగేరియన్‌, డచ్‌ గ్రాండ్‌ ప్రీ మధ్య 28 రోజుల వేసవి విరామం ఉంటుంది. పశ్చిమాసియా ప్రభావంతో వచ్చిన విరామం అంతకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

77వ ఎఫ్‌1 సీజన్‌ ఐదు వారాల విరామం అనంతరం మే 4న పున ప్రారంభం కానుంది. ఈ రేసుతో ఎఫ్‌1 సీజన్‌ దక్షిణ అమెరికాకు చేరుకుంటుంది. జూన్‌ 7 నుంచి ఎఫ్‌1 రేసులు యూరప్‌లో జరుగుతాయి. తాజా సీజన్‌లో మూడు రేసులు ముగియగా.. రెండు రేసులు జరుగటం లేదు. బహ్రెయిన్‌, సౌదీ అరేబియా గ్రాండ్‌ ప్రీలను మినహాయిస్తే ఈ సీజన్‌లో మరో 19 రేసులు జరగాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -