ఇంధన కొరతతో ప్రేక్షకులకు ఎంట్రీ నిరాకరణ
రెండు వేదికల్లోనే టోర్నమెంట్ నిర్వహణ
నవతెలంగాణ-న్యూఢిల్లీ
పశ్చిమాసియా యుద్ధవాతావరణం పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)పై ప్రభావం చూపిస్తోంది. హార్మూజ్ జలసంధి మూసివేతతో పలు దేశాలు ఇంధన కొరత ఎదుర్కొంటుండగా.. పాకిస్తాన్‌లో ఆ పరిస్థితి తారాస్థాయికి చేరింది. ఇంధన కొరతతో రంజాన్ సెలవులు పొడగింపు సహా స్కూల్స్ మూసివేత, వర్క్ ఫ్రమ్ హౌమ్ సదుపాయాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 26 నుంచి పీఎస్‌ఎల్ ఆరంభం కానుండగా.. తొలుత ఆరు వేదికల్లో షెడ్యూల్‌ను ప్రకటించారు. తాజాగా రెండు వేదికల్లోనే టోర్నమెంట్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించారు. కరాచీ, లాహౌర్‌లోనే మ్యాచ్‌లన్నీ నిర్వహించేందుకు పీసీబీ (పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు పీసీబీ చీఫ్ మోషిన్ నక్వీ ఆదివారం వెల్లడించారు.
ఆరంభ వేడుకలు రద్దు
ఈ నెల 26న లాహౌర్‌లో పీఎస్‌ఎల్ ఆరంభ వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. వాటిని రద్దు చేసినట్టు నక్వీ తెలిపారు. ‘ఇంధన కొరత ఎక్కువగా ఉంది. ప్రజలు అనవసరంగా ప్రయాణాలు చేయకుండా ప్రభుత్వం సూచనలు జారీ చేస్తోంది. ఈ సమయంలో పీఎస్‌ఎల్ మ్యాచ్‌లకు అభిమానులు రాకపోవటమే మంచిది. అభిమానులు లేకుండా జరుగుతున్న పీఎస్‌ఎల్‌ను ఆరు వేదికల్లో నిర్వహించటం అర్థ రహితం. అందుకే లాజిస్టికల్ ఇబ్బందులు లేకుండా రెండు స్టేడియాల్లోనే షెడ్యూల్ చేశాం. మరో 10-15 రోజుల్లో పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఇంధన సరఫరా సాధారణ స్థాయికి చేరుకుంటే.. పీఎస్‌ఎల్ షెడ్యూల్ మార్పుపై ఆలోచన చేస్తామని’ నక్వీ తెలిపారు. అభిమానులకు ప్రవేశం నిరాకరణతో ప్రాంఛైజీలు టికెట్ల అమ్మకాల ఆదాయం కోల్పోతున్నాయి. టికెట్ల అమ్మకం ద్వారా లభించే ఆదాయాన్ని ప్రాంఛైజీలకు పీసీబీ పరిహారంగా చెల్లిస్తుందని నక్వీ తెలిపారు.
ఆ క్రికెటర్లపై కఠిన చర్యలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) కాంట్రాక్టు రద్దు చేసుకున్న క్రికెటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పీసీబీ చీఫ్ నక్వీ అన్నారు. ఆటగాళ్ల కాంట్రాక్టు నిబంధనలు, న్యాయ పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో కార్బిన్ బాష్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. జింబాబ్వే క్రికెటర్ బ్లెస్సింగ్ ముజరబాని కోల్‌కతా నైట్‌రైడర్స్, దసున్ శనక రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడేందుకు పీఎస్‌ఎల్ ఒప్పందం వదులుకున్న సంగతి తెలిసిందే. మోటీ, మెక్‌గుర్క్, బార్ట్‌మన్, స్పెన్సర్ జాన్సన్‌లు సైతం పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్నా.. వ్యక్తిగత కారణాలను చూపించారు. పీఎస్‌ఎల్ ఈ నెల 26 నుంచి ఆరంభం కానుండ గా, 28 నుంచి ఐపీఎల్ షురూ కానుంది.



