Sunday, March 22, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంభీతిల్లుతున్న పశ్చిమాసియా

భీతిల్లుతున్న పశ్చిమాసియా

- Advertisement -

దాడులు-ప్రతిదాడులతో తీవ్రమైన పోరు
ఇరాన్‌ అణు కేంద్రంపై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడి
హిందూ మహా సముద్రంలోని యూఎస్‌-బ్రిటన్‌ సైనిక స్థావరంపై బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన ఇరాన్‌
అయోమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌
అదనపు దళాలను తరలిస్తున్న యూఎస్‌
ఇంతటితో ఆగం : మొజ్తాబా ఖమేనీ

నవ తెలంగాణ – సెంట్రల్‌ డెస్క్‌
మధ్యప్రాచ్యంలో పోరు రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. అమెరికా-ఇజ్రాయిల్‌ సేనలు శనివారం ఇరాన్‌లోని నతంజ్‌ అణు కేంద్రంపై దాడి చేశాయి. అయితే ఈ దాడి కారణంగా ఎలాంటి రేడియో ధార్మిక పదార్థాలూ వ్యాపించలేదనీ, ప్రజల ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని ఇరాన్‌ వార్తా సంస్థ తస్నిమ్‌ వెల్లడించింది. నతంజ్‌లోని షాహిద్‌ అహ్మదీ రోషన్‌ అణు శుద్ధి కేంద్రంపై జరిగిన దాడిని క్రిమినల్‌ చర్యగా ఇరాన్‌ అణు ఇంధన సంస్థ అభివర్ణించింది. ఈ దాడి అణ్వాయుధాల వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్‌పీటీ) సహా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. యుద్ధం మొదలైన తర్వాత మొదటి వారంలో కూడా ఇదే కేంద్రంపై జరిగిన దాడిలో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. గతేడాది జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో సైతం ఈ కేంద్రంపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు జరిపింది. మరోవైపు హిందూ మహా సముద్రంలోని డియగో గార్సియా ద్వీపంలో ఉన్న అమెరికా-బ్రిటన్‌ సైనిక స్థావరంపై ఇరాన్‌ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించింది.

తద్వారా మధ్య పాచ్యానికి ఆవల కూడా దాడులు చేసే సామర్ధ్యం తనకు ఉన్నదని టెహ్రాన్‌ నిరూపించుకుంది. అయితే ఈ క్షిపణులు గురి తప్పాయని తెలిసింది. ఇరాన్‌కు నాలుగు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక స్థావరంపై ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణులలో ఒకటి మధ్యలోనే కూలిపోగా రెండో దానిని అమెరికా యుద్ధ నౌక నుంచి ఎస్‌ఎం-3 ఇంటర్‌సెప్టర్‌ అడ్డుకుంది. అయితే అది విజయవంతమైందా లేదా అనేది తెలియరాలేదు. సైనిక స్థావరంపై దాడి జరిగిన మాట నిజమేనని అమెరికా ధృవీకరించింది. ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలో తన వైమానిక, నౌకా కార్యకలాపాల కోసం అమెరికా ఈ స్థావరాన్ని ఉపయోగించుకుంటోంది. ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై గతంలో అమెరికా జరిపిన దాడులలో ఈ స్థావరం కీలక పాత్ర పోషించింది. దూర శ్రేణి బాంబర్లను ఈ స్థావరం నుంచి ప్రయోగించవచ్చు. అలాగే జలాంతర్గాములు, నిఘా కార్యకలాపాలు సహా యుద్ధ నౌకల మోహరింపునకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

క్షిపణులు, డ్రోన్లతో హోరెత్తిస్తున్న ఇరాన్‌ బహిరంగ ప్రదేశాలపైనా దాడులు చేస్తామని హెచ్చరిక
ఇజ్రాయిల్‌ పైన, పొరుగున ఉన్న గల్ఫ్‌ అరబ్‌ దేశాలలోని ఇంధన మౌలిక సదుపాయాల పైన ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంపై డ్రోన్‌ దాడి జరిగిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ తెలిపింది. బాగ్దాద్‌ పొరుగున ఉన్న నివాస ప్రాంతంపై కూడా డ్రోన్‌ పడిందని సమాచారం. బాగ్దాద్‌లో ఉన్న అమెరికా సైనిక కాంప్లెక్స్‌ సమీపంలో జరిగిన డ్రోన్‌ దాడి కారణంగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇరాన్‌ వైపు నుంచి క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఇజ్రాయిల్‌ సైన్యం సహాయక బృందాలను వివిధ ప్రాంతాలకు పంపింది. టెల్‌ అవీవ్‌ సమీపంలోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయం వద్ద ఉన్న ఇంధన ట్యాంకులు, రీఫ్యూయలింగ్‌ జెట్లపై జరిగిన డ్రోన్‌ దాడుల కారణంగా ఇజ్రాయిల్‌ సైనిక విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇరాన్‌ ప్రయోగించిన తొమ్మిది క్షిపణులను అడ్డుకునే క్రమంలో పడిన శకలాలు, క్లస్టర్‌ ఆయుధాల కారణంగా మధ్య, ఉత్తర ప్రాంతాలలో పెద్ద ఎత్తున నష్టం జరిగిందని ఇజ్రాయిల్‌ అధికారులు తెలిపారు. ‘ట్రూ ప్రామిస్‌-4’ పేరిట జరుపుతున్న ప్రతీకార దాడులలో భాగంగా యాభై ఐదు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) తెలిపింది. సౌదీ అరేబియాలోని అల్‌-ఖర్జ్‌, యూఏఈలోని అల్‌-దఫ్రా, కువైట్‌లోని అలీ అల్‌-సలేం, కుర్దిస్థాన్‌లలోని ఎర్బిల్‌ లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల పైన, బహ్‌రైన్‌లోని అమెరికా ఫిఫ్త్‌ ఫ్ల్రీట్‌ ప్రధాన కార్యాలయం పైన దాడులు జరిపామని చెప్పింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే తూర్పు ప్రాంతంపై ఇరాన్‌ ప్రయోగించిన ఇరవై డ్రోన్లను అడ్డుకొని కూల్చేశామని సౌదీ అరేబియా తెలిపింది. ఇరాన్‌కు చెందిన మూడు బాలిస్టిక్‌ క్షిపణులు, ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ చెప్పింది. భారీ సంఖ్యలో క్షిపణులను నిర్మించే సామర్ధ్యం తనకు ఉన్నదని అంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్కులు, పర్యాటక ప్రాంతాలు వంటి బహిరంగ ప్రదేశాలపై దాడి చేస్తానని ఇరాన్‌ హెచ్చరించింది.

నూతన సంవత్సరం వేళ ఇజ్రాయిల్‌ దాడులు
అటు ఇజ్రాయిల్‌ కూడా టెహ్రాన్‌పై పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిపింది. పర్షియన్‌ నూతన సంవత్సర మైన నౌరజ్‌ను ఇరాన్‌ ప్రజలు జరుపుకుంటున్న వేళ ఈ దాడులు జరిగాయి. హెజ్బొల్లా లక్ష్యంగా లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయిల్‌ వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌లోని రమ్సార్‌ నగరంపై అమెరికా- ఇజ్రాయిల్‌ జరిపిన దాడిలో ఓ ఇల్లు ధ్వంసం కాగా అందులో నివసిస్తున్న దంపతులు, వారి చిన్నారి మరణించారు.

కాల్పుల విరమణను కోరుకోవడం లేదు : ట్రంప్‌
ఇరాన్‌తో కాల్పుల విరమణను తాను కోరుకోవడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. హార్ముజ్‌ జలసంధి ఏదో ఒక సమయంలో ‘తనంతతానుగా’ తెరుచుకుంటుందని అంటూ తమ ప్రయత్నంలో చైనా భాగస్వామి అయితే సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. మూడు వారాలు గడిచినా యుద్ధం ముగిసే సూచనలు కన్పించకపోవడంతో మధ్యప్రాచ్యానికి అమెరికా మూడు అదనపు యుద్ధ నౌకలను, రెండున్నర వేల మంది ప్రత్యేక సాయుధ దళ సిబ్బందిని పంపుతోంది. ఇదిలావుండగా హార్ముజ్‌ మీదుగా జపాన్‌ నౌకలను అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ తెలిపింది. ఈ విషయంపై టోక్యోతో చర్చలు ప్రారంభించామని చెప్పింది.

ఇంతటితో ఆగం : మొజ్తాబా
ఇజ్రాయిల్‌-అమెరికాపై దాడులు క్షిపణులు, డ్రోన్లు, టార్పెడోలు, యుద్ధభూమికే పరిమితం కావని ఇరాన్‌ సుప్రీం నేత అయతొల్లా మొజ్తాబా ఖమేనీ తెలిపారు. ఈద్‌, నౌరజ్‌ వేడుకల సందర్భంగా ఆయన ఓ సందేశాన్ని ఇస్తూ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. అంతర్జాతీయ సమాజ దురహంకార ధోరణిని అవిశ్రాంతంగా ప్రతిఘటిస్తున్న దేశ ప్రజానీకానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇస్లామిక్‌ దేశాలన్నీ ఐక్యంగా ఉండాలని ఈద్‌ సందర్భంగా ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ పిలుపునిచ్చారు. కాగా నౌరజ్‌ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఇరాన్‌ నాయకత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

దారీతెన్నూ తెలియక..: యుద్ధంపై అయోమయంలో ట్రంప్‌
ఇరాన్‌పై గత నెల 28న మొదలు పెట్టిన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’ని ఎటు వైపు తీసుకుపోవాలో తెలియక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అయోమయంలో పడిపోయారు. యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌నకు దానిని ఎలా ముగించాలో తెలియడం లేదని గతంలో రిపబ్లికన్‌, డెమొక్రాట్‌ ప్రభుత్వాల తరఫున మధ్యప్రాచ్యంలో చర్చలు జరిపిన ఆరన్‌ డేవిడ్‌ మిల్లర్‌ వ్యాఖ్యానించారు. ట్రంప్‌ తీవ్ర అసహనానికి గురవుతున్నారని ఆయన చెప్పారు.

యుద్ధానికి ఇరాన్‌ ఎలా స్పందిస్తుందనే విషయంలో ట్రంప్‌ తప్పుడు అంచనాలు వేసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్‌పై మొదలు పెట్టిన యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అమెరికా ప్రభుత్వం తెలుసుకోలేక పోయిందని, దాని ప్రణాళికలు బెడిసికొట్టాయని గతంలో ఆఫ్ఘనిస్తాన్‌, తుర్కియోలలో అమెరికా రాయబారిగా పనిచేసిన జాన్‌ బాస్‌ అన్నారు. దారీతెన్నూ తెలీక ట్రంప్‌ ఇబ్బంది పడుతున్నారని వాషింగ్టన్‌లోని గ్లోబల్‌ సిట్యుయేషన్‌ రూమ్‌ అధిపతి బ్రెట్‌ బుయాన్‌ చెప్పారు.

మారిన బ్రిటన్‌ వైఖరి
ఇరాన్‌ యుద్ధంపై బ్రిటన్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ఇరాన్‌ క్షిపణి కేంద్రాలపై దాడులు చేయడానికి తన స్థావరాలను ఉపయోగించుకునేందుకు అమెరికాకు బ్రిటన్‌ అనుమతి ఇచ్చింది. యుద్ధ తీవ్రతపై శుక్రవారం సమావేశమైన బ్రిటన్‌ మంత్రులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా తన స్థావరాలను ఉపయోగించుకోవడానికి అమెరికాను అనుమతించేందుకు బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ కొద్ది రోజుల క్రితం నిరాకరించిన విషయం విదితమే. యుద్ధంలో బ్రిటన్‌ నేరుగా పాలు పంచుకోదని ఆయన స్పష్టం చేశారు. అయితే మధ్యప్రాచ్యంలోని బ్రిటన్‌ మిత్రదేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తుండడంతో స్టార్మర్‌ తన వైఖరిని మార్చుకున్నారు.

ఇరాన్‌లో ఈద్‌ ప్రార్థనలు
పవిత్ర రంజాన్‌ మాసం ముగింపు సందర్భంగా ఇరాన్‌లోని వివిధ ప్రాంతాలలో శనివారం వేలాది మంది ముస్లింలు ఈద్‌ ప్రార్థనలు జరిపారు. రాజధాని టెహ్రాన్‌లోని ఇమామ్‌ ఖొమేనీ గ్రాండ్‌ మసీదు వద్ద పెద్ద ఎత్తున ప్రజలు సమావేశమయ్యారు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా మసీదు వెలుపలే ప్రార్థనలు చేశారు. ఒక వైపు దాడులు జరుగుతున్నప్పటికీ ప్రజలు ఏ మాత్రం వెరవకుండా ప్రార్థనలకు హాజరయ్యారు.

ఇరాన్‌ చమురు కొనుగోలుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా.. ఉత్తిదేనన్న టెహ్రాన్‌
సముద్రంలో ఉన్న ఇరాన్‌ చమురు కొనుగోలుపై విధించిన ఆంక్షలను 30 రోజుల పాటు ఎత్తివేస్తున్నామని ట్రంప్‌ ప్రభుత్వం ప్రకటించింది. చమురు ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఆంక్షల ఎత్తివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లకు 140 మిలియన్‌ బ్యారల్స్‌ చమురు చేరుతుందని, ఇంధన సరఫరాలపై నెలకొన్న ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని వివరించింది. అయితే ఆంక్షల ఎత్తివేత వార్తలను ఇరాన్‌ తోసిపుచ్చింది. అందులో నిజం లేదని చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -