Monday, May 5, 2025
Homeట్రెండింగ్ న్యూస్తడిచి ముద్దయిన ధాన్యం

తడిచి ముద్దయిన ధాన్యం

- Advertisement -

– ఈదురుగాలులతో భారీ వడగండ్ల వర్షం
– కొనుగోలు కేంద్రాల్లో పట్టాలు కప్పేలోపే తీవ్ర నష్టం
– పలు చోట్ల నేలరాలిన మామిడి
– ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతుల డిమాండ్‌
నవతెలంగాణ-విలేకరులు

అసలే మండువేసవి కాలం.. ఏ సమయంలోనైనా వడగండ్లతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి తరలించాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కూలీలు, లారీల కొరత పేరుతో తూకం నిలిపివేయడంతో ఎక్కడికుప్పలు అక్కడే ఉండిపోతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో కురిసిన వడగండ్ల వానకు వరి ధాన్యం, జొన్నలు, మక్కలు తదితర పంటలు వర్షానికి తడిసి ముద్దయ్యాయి. వర్షం ఆకస్మాత్తుగా కురవడంతో పట్టాలు కప్పుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఆరుగాలం చెమటోడ్చి చీడపీడలు, ప్రకృతి ప్రకోపాల ధాటి నుంచి పంటలు పండించడం ఒక ఎత్తయితే.. వాటిని సకాలంలో తూకం వేయించడం మరో ఎత్తు అవుతుందని రైతులు వాపోతున్నారు. మ్యాచర్‌ వచ్చినా.. మళ్లీ వర్షం కురవడంతో ధాన్యం తడిచిందని జిల్లా యంత్రాంగం తీరుతో తాము పూర్తిగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంట వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా ఈదురుగాలులతో పలు చోట్ల మామిడి నేలరాలింది. గాంధారి, లింగపేట్‌, సదాశివనగర్‌ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం తడిసి ముద్దయింది. 20 నిమిషాల పాటు వడగండ్ల వాన కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాల్లో వడగండ్ల వాన కారణంగా మక్కలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు మామిడికాయలు నేలరాలాయి, వరి పంట నేలకొరిగింది. బీబీపేట్‌ మండలంలోని మాదాపూర్‌ గ్రామంలోని కోమటికుంట వద్ద పంట పొలాల్లోని విద్యుత్‌ స్తంభం నెలకొరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -