Tuesday, April 29, 2025
Navatelangana
Homeట్రెండింగ్ న్యూస్అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం

అకాల వర్షాలతో తడుస్తున్న ధాన్యం

- Advertisement -
  • గన్నీ బ్యాగులు కరువు
    – మిల్లుల వద్ద ట్రాక్టర్ల బారులు
    నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
    రైతులకు గన్నీ బ్యాగుల కొరత వేధిస్తోంది. అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్న రైతులు నేరుగా మిల్లులకు ధాన్యం తీసుకుపోతే.. పక్షం రోజులైనా మిల్లు యాజమాన్యాలు దించుకోవడం లేదు. వారం పది రోజులు ఎండబెట్టి మరో 10 రోజులకు పైగా కొనుగోళ్ల కోసం రైతులు కల్లంలోనే పడిగాపులు కాస్తున్నారు. ఒక వైపు ఖరీఫ్‌కు సమయం ఆసన్నమైతుండగా.. మరోవైపు యాసంగి పంట కొనుగోళ్లు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో సుమారు 2.50 లక్షల ఎకరాలు వరి సాగుచేశారు. కొన్నిచోట్ల యాసంగి పంట సాగు ఆలస్యమైంది. దీంతో దిగుబడి కూడా ఆలస్యమవడం.. ఆకాల వర్షాలు పడుతుండటంతో ఇబ్బందులేర్పడుతున్నాయి. కొల్లాపూర్‌, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలో ఇప్పటికే వర్షాలకు వరి ఒరిగిపోయింది. వనపర్తి పరిధిలోని జూరాల, సప్తసమద్రాల పరిధిలో 2 లక్షల ఎకరాలు సాగవుతోంది. అందులో చివరి ఆయకట్టుకు నీరు లేక వందల ఎకరాలు ఎండిపోయింది. కోత కోసిన ధాన్యం కల్లాలకు చేరుకుంది. కానీ గన్నీ బ్యాగుల కొరత కారణంతోపాటు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడం లేదు. గద్వాల పరిధిలోనూ జూరాల ఆయకట్టు కింద 1.40 లక్షల ఎకరాలు సాగయింది. ధరూరు, గద్వాల, ఇటిక్యాల, మానవపాడు మండలాల పరిధిలో వరి సాగు ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. అయితే, కొనుగోలు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ధాన్యం కల్లాలను వీడటం లేదని రైతులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ పరిధిలో కోయిల్‌సాగర్‌, నారాయణపేట పరిధిలో 1.20 లక్షల ఎకరాలు సాగయింది. పంట దిగుబడి చేతికి వచ్చే సమయంలో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వనపర్తి జిల్లాలో సన్నాలు 153,993 ఎకరాలు సాగవుతోంది. పోటెత్తిన ధాన్యంవనపర్తి జిల్లాలో 82 రైస్‌ మిల్లులు, నారాయణపేటలో 38, మహబూబ్‌నగర్‌లో 84, నాగర్‌కర్నూల్‌లో 82, గద్వాలలో 55 రైస్‌ మిల్లులున్నాయి. ప్రభుత్వ అనుమతులు పొందిన రైస్‌మిల్లుల దగ్గర ట్రాక్టర్లు వందల సంఖ్యలో కిలోమీటర్ల మేర బారులు తీరాయి. కల్లాలు, మిల్లుల దగ్గర ఒక్కో ట్రాక్టరు కోసం 10 నుంచి 15 రోజులు పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ట్రాక్టర్‌ కిరాయి కూడా రోజు రోజుకు పెరిగిపోతూ భారమవుతోందని రైతులు తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా లాల్‌కోట వద్ద ఓ రైస్‌మిల్లు దగ్గర రెండు కిలోమీటర్ల మేర ధాన్య ట్రాక్టర్లు ఉన్నాయి. గన్నీ బ్యాగులు లేక, ట్రాక్టర్లు దొరక్క, కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు కాక రైతులు కల్లాల్లో వరి ఆరబెట్టుకొని కాపాలా ఉంటున్నారు.
    10రోజుల నుంచి నిరీక్షణ : లక్ష్మయ్య, లాల్‌కోట, మహబూబ్‌నగర్‌వరిధాన్యం తీసుకొని వచ్చాం. 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. మిల్లు యాజమానులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తేమ పేరుతో ఇక్కడి నుంచి తిప్పి పంపుతున్నారు. ఇక్కడే ఎన్ని రోజులు ఉండేది తెలియడం లేదు.
    ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి : లక్ష్యయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, మహబూబ్‌నగర్‌ ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనగోలు చేయాలి. ఆలస్యం అయితే అకాల వర్షానికి దాన్యం దెబ్బతింటుంది. ఇప్పటికే కోతకు రాని వరి పైరు నేలకు ఒరిగింది. కల్లాలకు వచ్చిన దాన్యం కొనుగోలు లేక తడిసిపోతోంది. మిల్లులకు వచ్చినా యాజమాన్యాలు దించుకోవడం లేదు. ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు