‘పుర్రెకోబుద్ధి, నాలుకకో టేస్టు’ అన్నారు కదా! ఈ బుద్ధీ, టేస్టూ మనుషుల పొజిషన్ను బట్టి కదా ఉండేవి. మామూలు మనుషులు పుర్రెకూ రాజ్యాలేలే వారి బుర్రకూ తేడా ఉంటుంది కదా!
రాజా వారు చిన్నప్పట్నించీ రాజా వారే అయిన కారణంగా తనకంటూ ఓ ప్రత్యేక మైన బుర్ర దానికోబుద్ధీ కలిగి ఉండినారు. వాడికంటూ ఓ పేరు ఉండాలి కనుక వారిని చండిపచండుడు అనుకుందాం. వారి ప్రత్యేకమైన పుర్రెలో చిన్ననాటి నుంచీ ఉన్న కోరిక ఒక్కటే. అదేమిటనగా దేవలోకంలో అందగత్తెలను భూమ్మీదకు తీసుకురావడమే.
పైలోకంలో రంభ, ఊర్వశి, తిలోత్తమ అనే పేర్లతో అప్సరసలు ఉంటారని వారు అతిలోక సుందరులని చిన్నప్పుడే ఎవరో చెప్పింది బుర్రలో ఫుల్లుగా నింపేసుకుని ఎలాగైనా సరే ఆ సుందరీమణులను భూమ్మీదకి బతిమాలో బామాలో బలవంతంగానో తీసుకువచ్చి తన కోరిక తీర్చుకోవాలనుకున్నాడు చండిపచండుడు.
రాజు తల్చుకుంటే సుందరీ మణులకు కరువా! చండుడను ప్రచండుడను నేనొక రాజ్యానికి రారాజుండను కదా. ఎలాగ నా కోరిక తీర్చుకొనుట అని చాలా మధనపడి, పండితులను, ఆస్తాన ఉద్యోగులను, మంత్రులను, రాజ గురువులను ప్రశ్నించి, వారితో సుదీర్ఘంగా చర్చించి చివరకు హిమాలయాల్లో పవర్ఫుల్ బైరాగులు, సన్యాసులు, ఋషులు, మునులు వంటి మహానుభావులుంటారని తెల్సుకుని ఆవైపు రేసుగుర్రం ఎక్కి బయలు దేరేడు. కనిపించిన ప్రతి గడ్డాన్నీ నిమిరేడు. తన కోరిక తీరే దారి చెప్పండని ‘రిక్వెస్టు’ చేసేడు.
చండిపచండుడి కోరిక తీర్చడానికి ఓ సాధూమహారాజ్ గడ్డం దువ్వేడు. కళ్ళు మూసేడు. ఓంఫట్ అన్నాడు. చండిపచండుడి ముందు ఓ విచిత్రమైన వాహనం ప్రత్యక్షం అయింది. దీన్ని ఏమందురుస్వామీ? దీనివల్ల ప్రయోజనమేమీ? అనడిగాడు చండుడు. ఆమాయకుడా! ఇది ‘హెవెన్ కాప్టర్’ నా తపస్సంతా ఖర్చయింది. అయితే అయింది. దీని మీద నువ్వు ఆ ‘హెవెన్ అపార్ట్మెంట్సు’ అదే దేవలోకం వెళ్ళి చిన్నప్పట్నించీ నీ పుర్రెను కిర్రెక్కించిన కోరిక తీర్చుకో. ఆ అస్పరసలని ఈ వాహనంలో ఎక్కించుకు వచ్చెయ్యి అన్నాడు.
ప్రచండుడు ఆనంద సంతోష సంబర వీరంగం చేస్తూ అర్థరాత్రి పూట ‘హెవెన్ కాప్టర్’లో దేవలోకంలో లాండయ్యేడు. ఈరోజు ‘పర్ఫార్మెన్స్’ చేసొచ్చి అలసి సొలసి నిద్రిస్తున్న ముగ్గురు దేవలోకపు సందరీమణులు ఒక్కచోటే చిక్కారు. వాళ్ళకి నిద్రాభంగం కలిగించి తన వెంట భూలోకానికి రమ్మని ‘ఇన్వైట్’ చేశాడు చండుడు. పగలయితే దేవుళ్లరాజు వెయ్యి కళ్ళతో చూస్తాడని, వజ్రాయుధంతో తనను ‘కైమా’ కింద కొడ్తాడని అంచేత ‘మిడ్నైట్’ జర్నీయే బెటరని బ్రతిమాలాడు.
దేవలోకపు అప్సరసలు ‘ఎగ్జయిట్’ అయ్యారు. ‘అందాలలో అహౌ మహౌదయం.. భూలోకమే నవోదయం’ అని పాటందుకున్నారు. భూలోకం చూడాలని తమ పుర్రెలోనూ బుద్ధిపుట్టిందని వస్తామని ఒప్పుకున్నారు. అయితే తమను బాగా గౌరవించాలని, తాము కోరినదివ్వాలని, ఎప్పుడు కోరితే అప్పుడు తిరిగి పంపించాలని షరతులు పెట్టారు భూలోకం వచ్చి సందడి చెయ్యడానికి ఒప్పుకున్న సుందరీమణులు.
చండిపచండుడు దేదటవలోకపు సుందరీమణులను, ‘డన్సింగ్ గర్ల్స్’ను తన రాజ్యానికి తీసుకరానే వచ్చాడు. వారు కోరినట్టుగా రాజ్యంలో అనవసరంగా అరిచీ, పిక్కలు పట్టుకునే కుక్కల్ని కనపడకుండా మాయం చేయించేడు. మనుషుల కడుపుల్లో ప్రేగుల్లా వేలాడే కేబుల్ వైర్లను, గాల్లో అల్లల్లాడే అనేక రకరకాల తీగలను కత్తిరింపించేడు. ఊడ్పించి, తుడ్పించి రోడ్లను టారుతో అలంకరింపించేడు. బిచ్చగాళ్లను తన్ని తరిమేసేడు.
తన కోరిక తీర్చడానికి భూలోకం వచ్చిన అప్సరోశిరోభామనుల పాదాలను బంగారు పళ్లేలలో పెట్టించి ‘గోల్డు చెంబుల’నిండా నీళ్లతో కడిగించి, పట్టు తువ్వాళ్లతో తుడిపించేడు. దేవకన్యలను వీధుల్లో ఊరేగించేడు. ప్యాలెస్లో రకరకాల భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం అంటే మరేం లేదు, స్వీటూ హాటూ నమిలేవీ, మింగేవీ, తాగేవీ నాకేవీ పదార్థాలతో విందులు చేశేడు. విందులతో సరిపుచ్చక వారిని విహారయాత్రలకు తీసుకు వెళ్ళేడు. రాజభోగాలతో ముంచెత్తేడు.
దేవలోకపు సుందరీమణులు సొర్గం కన్నా భూలోకం మిన్నా అనుకునేట్టుచేసేడు. చండుడు వారిని దేవతలను కొలుచుకున్నట్టే కొలుచుకున్నాడు. కాలు కిందపెట్టనివ్వలేదు. గుళ్ళకూ గోపురాలకూ తీసుకువెళ్ళేడు. అసలే డాన్సింగ్ గర్ల్స్ కదా కాలాడించకపోతే రోజుగడవదని వాళ్ళ చేత కోలాటాలు వేయించేడు. బతకమ్మ పాటలకు డాన్సులు చేయించేడు.
దేవలోకం నించి దిగివచ్చిన సుందరాంగులను చూసి భరించి తరించడానికి జనం రోడ్ల మీద పడ్డారు. కొందరు నోళ్ళు వెళ్ళబెడితే మరి కొందరు కార్చిన’చొంగ’ ఏరైపారింది. ‘అ హాహ వ హావా’ అనుకున్నారు.
దేవకన్యలకు తమ చీని చీనాంబరాలు బోరుకొట్టినవంటే పట్టుచీరల షాపుల్ని దోపిడీ చేసుకోండి అన్నాడు చండుడు. వారు తమ నగలు పాత ఫ్యాషన్వని వాపోతే తులాల లెక్కన కాక కిలోల లెక్కన బంగారాన్ని బహుమతిగా ఇచ్చేడు.
చండుడికీ, రాజ్యంలో పెద్ద పదవుల్లో ఉన్నోళ్లకి, ప్రముఖులకి ఇదొక పెద్ద పండుగగా, సరదావేడుకగా ఉంటే సామాన్యులకు మాత్రం సంకటమయింది. ఉద్యోగులు జీత భత్యాలకు ఆక్రోశించారు, అంగలార్చారు. మింగమెతుకు కావాలి కాని మీసాలకు నవరత్న తైలం అక్కర్లేదున్నారు. సమస్యలు పరిష్కరించండి ప్రభో అన్న వారందరికీ మొండిచెయ్యి ఎత్తేడు ప్రచండుడు. జేబులు దులిపి చూపించేడు. పొట్ట కోసినా తన దగ్గర అణా కాణీ కాదు చిల్లి గవ్వ కూడా లేదు లేదన్నాడు. ప్రజలు కోప్పడ్డారు. ఈ సుందరీమణుల కవాతు దేనికన్నారు. కడుపునిండునా కాలునిండునా అన్నారు.
చండుడప్పుడు వారికి జ్ఞానబోధ చేశాడు. ఇది తన కోసం చేస్తున్న వేడుకకాదన్నాడు. సుందరీమణుల వల్ల రాజ్యం విశ్వవిఖ్యాతం అవుతుందన్నాడు. తమ నగరం విశ్వనగరం అవుతుందని ఢంకా బజాయించాడు. తిండీ, తిప్పలూ ముఖ్యం కాదు కీర్తి ప్రతిష్టలే లక్ష్యం అన్నాడు.
జనం లబోదిబోమన్నారు. ఈ సంబరాలు ముగిసి దేవకన్యలు ‘హెవెన్ కాప్టర్’లో తమలోకాలకు తిరిగి వెళ్తేతప్ప చండిపచండుడు మామూలు లోకంలోకి రాడని అప్పటి దాకా వేచి వేసారక తప్పదని ఎదురుచూడ సాగారు.
– చింతపట్ల సుదర్శన్
9299809212