Thursday, July 3, 2025
E-PAPER
Homeజాతీయంతిలా పాపం తలా పిడికెడు!

తిలా పాపం తలా పిడికెడు!

- Advertisement -

మేము సైతం అంటున్న
మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబేట్‌, అమెజాన్‌
ఇజ్రాయిల్‌ మారణహోమానికి కార్పొరేట్‌ దిగ్గజాల చేయూత

అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించి పాలస్తీనాలో మారణహోమం సాగిస్తున్న ఇజ్రాయిల్‌కు వెన్నుదన్నుగా నిలుస్తున్న అనేక కార్పొరేట్‌ సంస్థల గుట్టును ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పాత్రికేయుడు ఫ్రాన్సిస్కా అల్బనేస్‌ రట్టు చేశారు. జెనీవాలో గురువారం జరిగే విలేకరుల సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన నివేదికను బయటపెట్టనున్నారు. ఇజ్రాయిల్‌కు మద్దతు ఇస్తున్న 48 కార్పొరేట్‌ సంస్థల్లో అమెరికా టెక్‌ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబేట్‌, అమెజాన్‌ కూడా ఉండడం గమనార్హం. విచారణలో భాగంగా వెయ్యికి పైగా కార్పొరేట్‌ సంస్థల డేటాను విశ్లేషించారు.
న్యూఢిల్లీ : ‘ఇజ్రాయిల్‌ శాశ్వత ఆక్రమణలు, ఆయుధ తయారీదారులు, బడా కార్పొరేట్‌ సంస్థలకు అనువైన స్థలాలుగా మారాయి. వీటిపై పర్యవేక్షణ ఉండదు. వాటిలో జవాబు దారీతనం కూడా కన్పించదు. పెట్టుబడిదారులు, ప్రైవేటు-ప్రభుత్వ సంస్థలు ఎలాంటి ఆటంకాలు లేకుండా లాభపడతాయి’ అని నివేదిక తెలియ జేసింది. కంపెనీలు కేవలం ఆక్రమణలకే పరిమితం కాలేదని, ఇజ్రాయిల్‌ ఆర్థిక వ్యవస్థలో కూడా వేళ్లూనుకుపోయాయని చెప్పింది. ఇజ్రాయిల్‌ మారణహోమం ఇప్పటికీ కొనసాగ డానికి కారణాలను నివేదిక వివరించింది.


ఆయుధ సేకరణ కార్యక్రమంలో…
ప్రపంచంలోని అతి పెద్ద ఆయుధ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇజ్రాయిల్‌ ఎఫ్‌-35 జెట్లను కొనుగోలు చేసింది. ఈ కార్యక్రమం కనీసం ఎనిమిది దేశాలకు చెందిన 1,600 కంపెనీలపై ఆధారపడింది. దీనికి అమెరికాకు చెందిన లాక్‌హీడ్‌ మార్టిన్‌ నేతృత్వం వహిస్తోంది. అయితే ఎఫ్‌-35 జెట్‌ విమానాల విడిభాగాలు వివిధ దేశాల్లో తయారవుతాయి. సైనిక రంగంలో ఇటలీకి చెందిన తయారీ సంస్థ లియోనార్డో ఎస్‌పీఏ ప్రధాన భాగస్వామి కాగా ఆయుధ ఉత్పత్తికి అవసరమైన రోబోటిక్‌ యంత్రాలను జపాన్‌ సంస్థ ఫనుక్‌ కార్పొరేషన్‌ సమకూరుస్తోంది. సాంకేతిక రంగంలోని కార్పొరేట్‌ దిగ్గజాలు కూడా ఓ చేయి వేస్తూ పాలస్తీనియన్ల బయోమెట్రిక్‌ డేటాను సేకరించడం, వాటిని నిల్వ చేయడం, ప్రభుత్వ పరంగా ఉపయోగించడం వంటి పనులు చేస్తున్నాయి. తద్వారా వివక్షాపూరితమైన ఇజ్రాయిల్‌ పాలనకు మద్దతు ఇస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌ సంస్థలు తమ క్లౌడ్‌, ఏఐ టెక్నాలజీలలో ఇజ్రాయిల్‌ ప్రవేశానికి అనుమతిస్తున్నాయి. దీని వల్ల ఇజ్రాయిల్‌ ప్రభుత్వ డేటా ప్రాసెసింగ్‌, నిఘా సామర్థ్యం పెరుగుతుంది.


సాయపడుతున్న కంపెనీలు ఇవే
ఇక అమెరికాకు చెందిక టెక్‌ కంపెనీ ఐబీఎం సైనిక, నిఘా సిబ్బందికి శిక్షణ ఇస్తోంది. దానితో పాటు ఇజ్రాయిల్‌ జనాభా, ఇమ్మిగ్రేషన్‌, బోర్డర్స్‌ అథారిటీ (పీఐబీఏ) కేంద్ర డేటాబేస్‌ను నిర్వహిస్తోంది. పీఐబీఏ పాలస్తీనియన్ల బయోమెట్రిక్‌ డేటాను భద్రపరుస్తుంది. 2023 అక్టోబరులో గాజాపై యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సాఫ్ట్‌వేర్‌ వేదిక అయిన పలాంటిర్‌ టెక్నాలజీస్‌ ఇజ్రాయిల్‌ సైన్యానికి మద్దతు పెంచింది. యుద్ధభూమిలో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి, డేటాను ప్రాసెస్‌ చేయడానికి, లక్ష్యాల జాబితాను రూపొందించడానికి ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ కంపెనీ అందిస్తోంది. ఇజ్రాయిల్‌కు ప్రధానంగా సైనిక పరంగా లాక్‌హీడ్‌ మార్టిన్‌ (అమెరికా), లియొనార్డో (ఇటలీ), ఫనుక్‌ (జపాన్‌), సాంకేతికపరంగా ఐబీఎం, మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, అమెజాన్‌, పలంటిర్‌ (అమెరికా), విద్యుత్‌ పరంగా చెవ్రాన్‌ (అమెరికా), గ్లెన్‌కోర్‌ (స్విట్జర్లాండ్‌), బీపీ (బ్రిటన్‌) మద్దతు ఇస్తున్నాయి. వీటితో పాటు క్యాట్‌, బుకింగ్‌.కామ్‌, రాడా, ఎయిర్‌మబన్మ్‌ (అమెరికా), హెడ్‌డీ (దక్షిణ కొరియా), వోల్వో (స్వీడన్‌), ఆర్బియా (మెక్సికో), బీఎన్‌బీ పరిబాస్‌ (ఫ్రాన్స్‌), బార్‌క్లేస్‌ (బ్రిటన్‌) కూడా ఇజ్రాయిల్‌కు సాయపడుతున్నాయి.


పౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ…
పాలస్తీనా ఆక్రమణ కోసం ఇజ్రాయిల్‌కు అవసరమైన పౌర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్న కంపెనీలను కూడా ఐరాస విలేకరి తన నివేదికలో చేర్చారు. వీటిలో క్యాటర్‌పిల్లర్‌, లియొనార్డో యాజమాన్యంలోని రాడా ఎలక్ట్రానిక్‌ ఇండిస్టీస్‌, దక్షిణ కొరియాకు చెందిన హెచ్‌డీ హ్యూండారు, స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్‌ ఉన్నాయి. ఇవి పాలస్తీనియన్ల ఆవాసాలను ధ్వంసం చేయడానికి, అలాగే వెస్ట్‌బ్యాంక్‌లో అక్రమ స్థావరాల అభివృద్ధికి భారీ యంత్రాలను సమకూరుస్తున్నాయి. అద్దె వేదికలైన బుకింగ్‌, ఎయిర్‌బన్మ్‌ కూడా ఇజ్రాయిల్‌ ఆక్రమిత ప్రాంతంలో ఆస్తులు, హోటల్‌ గదుల వివరాలను సేకరించి అక్రమ స్థావరాల ఏర్పాటుకు సాయపడుతున్నాయి.
అమెరికాకు చెందిన డ్రమ్మండ్‌ కంపెనీ, స్విట్జర్లాండ్‌కు చెందిన గ్లెన్‌కోర్‌ కంపెనీ ఇజ్రాయిల్‌లో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే ఇజ్రాయిల్‌ అక్రమ ఔట్‌పోస్టులలో పాలస్తీనీయుల నుంచి స్వాధీనం చేసుకున్న భూముల నుంచి చైనాకు చెందిన బ్రైట్‌ డెయిరీ అండ్‌ ఫుడ్‌ సంస్థ ప్రయోజనం పొందుతోంది. నెటాఫిమ్‌ అనే కంపెనీ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జల వనరుల దోపిడీకి సాయపడుతోంది. గాజాపై జరుగుతున్న యుద్ధానికి నిధుల సమీకరణ కోసం ట్రెజరీ బాండ్లు కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. వడ్డీ రేటు ప్రీమియంను అదుపులో ఉంచడానికి ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకులు ఇజ్రాయిల్‌ను అనుమతిస్తున్నాయి.


తెర వెనుక ఉన్నది ఈ కంపెనీలే
ఇజ్రాయిల్‌కు చేయూత అందిస్తున్న కంపెనీల వెనుక అమెరికాకు చెందిన బహుళజాతి పెట్టుబడి సంస్థలైన బ్లాక్‌రాక్‌, వాన్‌గార్డ్‌ ఉన్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచంలో అత్యధిక ఆస్తులున్న బ్లాక్‌రాక్‌ కంపెనీకి పలు కంపెనీలలో వాటాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ఆస్తులను కలిగి ఉన్న రెండో అతి పెద్ద సంస్థ వాన్‌గార్డ్‌ కూడా అనేక కంపెనీలలో సంస్థాగత ఇన్వెస్టర్‌గా కొనసాగుతోంది. అనేక విదేశీ ఆయుధ కంపెనీలకు యుద్ధం ఓ లాభదాయకమైన వెంచర్‌గా మారింది. ఇజ్రాయిల్‌ సైనిక వ్యయం 2023, 2024 మధ్య 65 శాతం పెరిగి 46.5 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఆయుధాలు, సాంకేతికత, మౌలిక సదుపాయాలకు సంబంధించిన రంగాలలో ఉన్న అనేక కంపెనీల లాభాలు 2023 అక్టోబర్‌ నుండి బాగా పెరగడం గమనార్హం. టెల్‌ అవీవ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ కూడా అసాధారణ రీతిలో 179 శాతం మేర లాభపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -