Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుమా పరిహారం సంగతేంది?

మా పరిహారం సంగతేంది?

- Advertisement -

మా నేతలను అరెస్టు చేసి సర్వేకు వస్తారా?
అడ్డగించి వెనక్కి పంపిన నిర్వాసితులు
పోలీసు బందోబస్తుతో కానుకుర్తిలో
సర్వేకు వెళ్లిన అధికారులు
తెల్లవారుజామునే నాయకుల నిర్బంధం
నిర్వాసిత గ్రామాల్లో నిరసనలు
పేరపల్ల ఆర్డీవో కార్యాలయం ముట్టడి
ఊట్కూరు మండల కేంద్రంలో ఆర్డీఓ అడ్డగింత
నవతెలంగాణ- నారాయణపేట /దామరగిద్ద

మక్తల్‌, నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ సర్వే నేపథ్యంలో భూనిర్వాసితులపై ప్రభుత్వం పోలీసు నిర్బంధం ప్రయోగించింది. భూనిర్వాసితుల సంఘం ముఖ్య నాయకులను శుక్రవారం తెల్లవారుజామునే హౌస్‌ అరెస్టు చేసి ఆ తర్వాత ధన్వాడ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులు, బలవంతపు భూసేకరణతో గ్రామాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పేరపల్ల ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్వాసితులు ముట్టడించారు. ఊట్కూరులో ఆర్డీఓను అడ్డగించారు. నాయకుల నిర్బంధం అనంతరం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామానికి ఉదయం పోలీస్‌ బందోబస్తుతో సర్వేకు వెళ్లిన అధికారులకు భూనిర్వాసితుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైంది.ఉదయం 4 గంటలకే భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామి రెడ్డి, నాయకులు ఉడుమల్‌ గిద్ద గోపాల్‌, బండమీది బలరాం, అంజిలయ్య గౌడ్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌, జోషి, రామకృష్ణను హౌస్‌ అరెస్టు చేసి ధన్వాడ పోలీస్టేషన్‌కు తరలించారు. నాయకులను అరెస్టు చేశాక..

దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో అధికారులు భూసర్వేకు వెళ్లారు. అక్కడ నిర్వాసితుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. మా నేతలను పోలీస్‌ స్టేషన్లో నిర్బంధించి, పోలీస్‌ బందోబస్తుతో సర్వేకు రావడం ఏంటి అని గ్రామ శివారులోనే భీమ్‌రెడ్డి, బసిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, చంద్రశేఖర్‌, అన్వర్‌ ఆధ్వర్యంలో స్థానికులు రోడ్డుపై బైటాయించారు. నిర్వాసితుల డిమాండ్‌ న్యాయమైనదేనని, తగిన పరిహారం అందిస్తామని మాట ఇస్తూనే.. మరోవైపు నిర్బంధంతో, బలవంతంగా భూసేకరణకు పూనుకోవడం దారుణమని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వకుండా సెంటు భూమి కూడా సర్వే చేసేందుకు ఒప్పుకోబోమని భీష్మించి కూర్చున్నారు. అదే సమయంలో పేరపల్ల గ్రామ భూ నిర్వాసితులు అంజి, అంజప్ప ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఊట్కూరు మండల కేంద్రంలో ఆర్డీవో రామచందర్‌ను నాయకులు గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో భూనిర్వాసితులు అడ్డగించారు. న్యాయమైన పరిహారం 35 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రతిపాదిత ప్రాజెక్ట్‌ పొడవునా కాట్రపల్లి నుంచి కానుకుర్తి వరకు భూనిర్వాసిత గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. నారాయణపేట మండలం కోటకొండ, బొమ్మనపాడు గ్రామాల్లోనూ నిరసనలు జరిగాయి. భూనిర్వాసితుల న్యాయమైన డిమాండ్‌ నెరవేర్చాలని సీపీఐ(ఎం) నీయకులు దస్తప్ప, బొమ్మన్‌పాడ్‌ బల్‌రామ్‌ డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం భూ నిర్వాసితుల సంఘం నాయకులను ధన్వాడ పోలీస్‌ స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చేందర్‌ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మరాజు గౌడ్‌ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగింది.

కుట్రపూరితంగా భూసేకరణ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు జి.వెంకట్రామిరెడ్డి
ప్రభుత్వం మోసపూరితంగా భూ సేకరణకు యత్నిస్తోంది. నాయకులను నిర్బంధంలో ఉంచి కుట్రపూరితంగా భూసేకరణకు ప్రయత్నించడం దారుణం. సరైన పరిహారం ఇస్తామంటూనే భూనిర్వాసితులతో చెలగాటమాడుతున్నది. ఇంతకాలం ప్రభుత్వ పెద్దల మాట నమ్మాం.. ఉద్యమ కార్యాచరణను వాయిదా వేసుకున్నాం.. ఇప్పుడు పోలీసు నిర్బంధం.. పహారాలో భూసర్వేకు వచ్చారు. నమ్మించి మోసపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానంపై భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తాం.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad