Saturday, July 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబీసీ రిజర్వేషన్ల సంగతేంటి?

బీసీ రిజర్వేషన్ల సంగతేంటి?

- Advertisement -

కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పెదవి విప్పాలి
రెండు నెలలపాటు స్థానిక సమస్యలపై పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి పార్లమెంటులో చట్టం చేసే విషయం లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పెదవి విప్పడం లేదని, వారు తమ పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. గురువారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో వీరపనేని రామదాసు, వెంకటసుబ్బమ్మ ఐదవ వర్ధంతి సందర్భంగా జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడారు. కృష్ణా జిల్లాలోని గన్నవరంలో పుట్టి ఆ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేసి డివిజన్‌ కార్యదర్శిగా పనిచేసిన రామదాసు గోవిందరావుపేటకు తన స్థిర నివాసాన్ని మార్చుకొని స్థానికంగా పార్టీ నిర్మాణంలో కృషి చేశారన్నారు. ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లి అక్కడే కమ్యూనిస్టుగా మారి బయటకు వచ్చారని గుర్తుచేశారు. అప్పటినుంచి కమ్యూనిస్టు ఉద్యమంలో కీలకంగా పనిచేశారని, అటువంటి నిబద్ధత కలిగిన రామదాసు స్ఫూర్తితో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు. బీజేపీ దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల మధ్య అసమానతలను సృష్టిస్తున్నదని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని, లౌకికవా దం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీకి నిధులు పెంచాలి
దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిపోతుందని, అక్కడ ప్రధాని మోడీ, ఇక్కడ సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని జాన్‌వెస్లీ విమర్శించారు. దేశ బడ్జెట్‌లో ఉపాధి చట్టానికి రూ.2 లక్షల కోట్ల బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం, ఏటా 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

వచ్చే రెండు నెలలు.. స్థానిక సమస్యలపై పోరాటాలు
రానున్న ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పార్టీ కార్యకర్తలంతా ప్రజల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారానికి పోరాటాలు చేయాలని జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాల ద్వారానే కమ్యూనిస్టులు ఎదుగుతారని,ఓట్లతో, సీట్లతో కాదని తెలిపారు.

స్థానిక సంస్ధలకు సిద్ధం
స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. బలమున్న ప్రాంతాల్లో పోటీ చేసి గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, వాజేడు, వెంకటాపురంలోని 4 జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయనున్నామని తెలిపారు. తొలుత గోవిందరావుపేట మండలకేంద్రంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రదర్శన నిర్వహించారు. వీరపనేని రామదాసు ఇంటి ముందు పతాకావిష్కరణ చేసి రామదాసుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్‌, రాష్ట్ర సీనియర్‌ నాయకులు డీజీ నర్సింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సూడి కృష్ణారెడ్డి, జిల్లా కార్యదర్శి బీరెడ్డి సాంబశివ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వెంకట్‌రెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు, ఎండీ దావూద్‌, కొప్పుల రఘుపతి, ధ్యానం వాసు, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -