రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరిన హైకోర్టు
చర్యలు తెలుసుకోకుండా ఉత్తర్వుల జారీకి నిరాకరణ
విచారణ నేటికి వాయిదా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లనుందో చెప్పాలని హైకోర్టు వివరణ కోరింది. నివేదికపై చర్యలు తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారా లేక తీసుకుంటారా, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదా.. ఏదో ఒకటి స్పష్టం చేయాలంది. మంగళవారం జరిగే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశించింది. అప్పటి వరకు కమిషన్ నివేదికపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ వ్యవస్థాపకుడు కేసీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి హరీష్ రావు తరఫు లాయర్లు చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. అసెంబ్లీలో కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టాక చర్చ చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా స్టే ఆదేశాలు ఇవ్వాలంటూ వారిద్దరూ మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి ఎం మొహియుద్దీన్‌ల ధర్మాసనం ఎదుట వారిద్దరి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు ఆర్యమ సుందరం, దామా శేషాద్రినాయుడు వాదించారు. పిటిషన్ గురించి అత్యవసరంగా విచారణ చేయాలని కోరారు. కమిషన్ నివేదికపై అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ అర్ధరాత్రి వరకూ జరిగిందన్నారు. నివేదికపై చర్యల గురించి అసెంబ్లీ తీర్మానం చేయకుండానే ముగించిందన్నారు. అయితే, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు నిర్ణయం తీసుకుంటున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలోనే ప్రకటించారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సోమవారం మధ్యాహ్నం విచారణ చేపట్టాలని కోరారు. పోలీసు చట్టం సెక్షన్ 62 కింద దర్యాప్త నిమిత్తం ప్రభుత్వం జీవో చేసేలోగానే విచారణ పూర్తి చేసి స్టే ఇవ్వాలని కోరారు. జీవో వచ్చాక పిటిషన్లు దాఖలు చేసి చేస్తున్న న్యాయపోరాటానికి ఫలితం ఉండదన్నారు.
అసెంబ్లీలో చర్చిస్తామని ప్రభుత్వం చెప్పిందనీ, చర్యలు తీసుకోబోమని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందనడానికి భిన్నంగా చర్యలు ఉన్నాయన్నారు. దీనిపై హైకోర్టు ఆందోళన కనబడుతోందని వ్యాఖ్య చేసింది. దీనిపై అడ్వకేట్లు స్పందిస్తూ, ప్రతిపక్ష సభ్యులు సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చనీ, ఇవ్వకపోయినా నివేదికపై చర్యలుంటాయని సీఎం అసెంబ్లీలోనే ప్రకటించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపరులను వదిలిపెట్టబోమని కూడా హెచ్చరించారని చెప్పారు. విచారణను ఒకటి రెండు రోజులు వాయిదా వేయాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంపై స్పందిస్తూ, అప్పటి వరకు స్టే ఇవ్వాలని వారు కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వివరణ వచ్చాక పరిశీలిస్తామని ప్రకటించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజన విధానం చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు
జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై వివరణ ఇవ్వాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సలీమ్, మరొకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, న్యాయమూర్తి జిఎం మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. 1996లో జారీ చేసిన 570 జీవో ప్రకారం జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన జరగాల్సి ఉందని పిటిషనర్ న్యాయవాది బర్కత్ అలీ ఖాన్ వాదించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వార్డు విభజన విధానం రాజ్యాంగం ఆర్టికల్ 243 డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 8లకు వ్యతిరేకమన్నారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టంలోని సెక్షన్ 6లో జనాభా స్థానంలో ఓటర్ల సంఖ్య అని ఉండటం చెల్లదన్నారు. ఢిల్లీ, ఎంపీ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో మున్సిపల్ చట్టాల ప్రకారం జనాభా ఆధారంగా వార్డుల పునర్విభజన ఉంటుందన్నారు. ఇక్కడ మాత్రం అందుకు వ్యతిరేకంగా ఉందన్నారు. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 వార్డులున్నాయనీ, వాటిలో 117 వార్డులు అశాస్త్రీయంగా ఉన్నాయని చెప్పారు. కొన్ని వార్డుల్లో 78 వేల ఓటర్లు ఉండగా, మరికొన్నింటిలో 28 వేలే ఉన్నాయన్నారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల గడువు కోరింది. అందుకు హైకోర్టు అనుమతిచ్చింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
మున్సిపల్ ఎన్నికలెప్పుడు? : ప్రభుత్వ వివరణ ఇవ్వాలన్న హైకోర్టు
రాష్ట్రంలోని పాలకవర్గాల గడువు పూర్తయిన మున్సిపాల్టీలకు ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చెప్పింది. అయితే ఎన్నికలకు ముందుకు ప్రభుత్వం నుంచి అన్ని రకాల అనుమతులు లభిస్తే తాము ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 195 ప్రకారం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే, ఎన్నికల నిర్వహణకు అవసరమైన తగిన సమయాన్ని తీసుకుని ఎన్నికలు జరపగలమని ఎస్‌ఈసీ లాయర్ సోమవారం హైకోర్టుకు చెప్పారు. మున్సిపాల్టీల్లోని వార్డుల విభజన, మున్సిపాల్టీల ఏర్పాటు వంటివి ప్రభుత్వం చేసి తుది జాబితా ఎస్‌ఈసీకి ఇవ్వాల్సి ఉందని వివరించారు. నిర్మల్ మున్సిపాల్టీ పాలకవర్గం గడువు ఈ ఏడాది మార్చి 25తో ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం జస్టిస్ బి విజరుసేన్ రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. రాజ్యాంగంలోని 243యు, 243జెడ్ ఎ అధికరణాల ప్రకారం పాలకవర్గాల గడువు ముగిసేలోగా ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ వాదన. దీనిపై ఎస్‌ఈసీ లాయర్ స్పందిస్తూ, నిర్మల్ మాత్రమే కాదనీ, రాష్ట్రంలో పాలకవర్గాల గడువు అయ్యాక ఎన్నికలు జరపాల్సిన అన్ని మున్సిపాల్టీలకూ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే, ఎస్‌ఈసీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనిపై ప్రభుత్వ వైఖరిపై మంగళవారం విచారణ చేస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలేంటీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES