నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రధాని మోడీ ఫొటో వినియోగం
జీఎస్టీ మార్పుల తర్వాత పలు పత్రికల్లో వాణిజ్య ప్రకటనలు
ప్రధాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు యాడ్స్
ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతీ లేదు
అయినా ఆ ప్రయివేటు సంస్థలపై ఎలాంటి పెనాల్టీలు లేని వైనం
ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకి సమాచారం
చట్టం అమలులో కేంద్రం విఫలం
సామాజిక కార్యకర్తల ఆందోళన
ఒక దేశ ప్రధాని.. ఆ దేశానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. రాజ్యాంగబద్ధమైన పదవిలో సదరు వ్యక్తి ఫొటో వినియోగంపై ఆంక్షలు, చట్టంలో నిబంధనలు ఉంటాయి. భారత్‌లోనూ ఇలాంటి చట్టం ఒకటి ఉన్నది. అయితే దాని అమలే చాలా పేలవంగా ఉన్నది. దీంతో దేశంలోని పలు ప్రయివేటు కంపెనీలు ఈ చట్టంలోని నిబంధనలను పాటించటం లేదు. అలాంటి కంపెనీలు, సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలూ ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నాయి. ఫలితంగా ప్రధాని ఫొటోను సదరు కంపెనీలు తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ దరఖాస్తుకు కేంద్రం నుంచి వచ్చిన సమాధానమే ఈ విషయాన్ని తెలియజేస్తున్నది. ఈ పరిణామంపై దేశంలోని మేధావుల, సామాజికవేత్తలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఫొటోను పలు కంపెనీలు తమ వాణిజ్య ప్రకటనల్లో వాడుకుంటున్నాయి. చట్టం ప్రకారం ప్రధాని స్థాయి వంటివారు, గాంధీ వంటి స్వాతంత్య్ర సమర యోధులు, కొందరు ప్రముఖుల ఫొటోలను వాడుకోవడం కుదరదు. ఇందుకు సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. కానీ ఈ ప్రక్రియ అసలు జరుగుతున్నట్టే కనిపించటం లేదు. ఇటీవల జీఎస్టీ మార్పుల విషయంలో స్వాతంత్య్ర దినోత్సవం వేడుకగా ప్రధాని మోడీ చేసిన ప్రకటన అనంతరం ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని ప్రయివేటు కంపెనీలు వాణిజ్య ప్రకటనలను ఇచ్చాయి. ఇందులో మోడీ ఫొటోను వాడాయి. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా కూడా ఇలాంటి ప్రకటనలే వచ్చాయి. బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు పత్రికల్లో వచ్చిన దాదాపు 220కి పైగా అడ్వర్టయిజ్‌మెంట్లలో మోడీ ఫొటో కనిపించడం గమనార్హం.
అయితే చిహ్నాలు, పేర్లు (అనుచిత వినియోగ నివారణ) చట్టం, 1950 ప్రకారం ఇది నిషిద్ధం. చట్టంలోని సెక్షన్ 3 ఇదే విషయాన్ని చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎవరూ కొన్ని చిహ్నాలు, పేర్లను వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించకూడదు. ఈ జాబితాలో ప్రధానితో పాటు మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, శివాజీ మహారాజ్ వంటి పేర్లు ఉన్నాయి. ఒక నిర్దిష్ట చట్టం ఉన్నప్పటికీ ఫార్మా, సాఫ్ట్ డ్రింక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్షర్, గృహౌపకరణాలు వంటి అనేక కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే తమ వాణిజ్య ప్రకటనల్లో ప్రధాని ఫొటోను వాడుకున్నాయి. కొన్ని వార్తపత్రికలు కూడా పీఎం ఫొటోతో మోడీ జన్మదిన యాడ్స్‌ను పబ్లిష్ చేయడం గమనార్హం.
ఈ విధంగా ప్రధాని ఫొటోను వినియోగించిన కంపెనీలు, సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ సంబంధిత ప్రభుత్వం విభాగం ఆ విధంగా వ్యవహరించలేదు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలైన ఓ ప్రశ్నకు వినియోగదారులు వ్యవహారాల విభాగం ఇచ్చిన సమాధానమే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నది. 2016 నుంచి 2025 మధ్య ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రధాని ఫొటోను వినియోగించినవారికి ఎలాంటి నోటీసులూ జారీ చేయలేదని స్పష్టం చేసింది. కాగా పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోడీ ఫొటోను తమ వాణిజ్య ప్రకటనల్లో వాడుకున్నందుకు పేటీఎం, రియలన్స్ జియోలను 2017లో సంబంధిత మంత్రిత్వ శాఖ వివరణ కోరగా.. ఆ రెండు కంపెనీలు తమ చర్యకు క్షమాపణలు చెప్పాయి.
అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘనలకు గురైనా ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి చర్యలూ ఉండకపోవడాన్ని ఆర్టీఐ సమాధానంతో పాటు తాజా ఘటనలు తెలియజేస్తున్నాయి. ప్రకటనల్లో ప్రధాని ఫొటో వినియోగానికి సంబంధించి ఏ కంపెనీ కూడా ముందస్తు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోలేదన్న విషయం ఆర్టీఐ సమాధానంలో తేలింది. ఇలాంటి ప్రకటనలను పబ్లిష్ చేసే ముందు అనుమతులు తీసుకోవాలని 2017లో ప్రెస్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ సూచనలు ఉన్నాయి. అయినప్పటి ఆ సూచనలను విస్మరిస్తూ ఇలాంటి వాణిజ్య ప్రకటనలు రావటం గమనార్హం.
అలాగే అనుమతులు కోరినవాటికి సంబంధించి, ఉల్లంఘనలు చేసిన సంస్థలు, వ్యక్తులపై పెనాల్టీ విధింపులకు సంబంధించి ఎలాంటి రికార్డులూ ప్రభుత్వం వద్ద లేవు. అయితే సంస్థాగతంగా చట్టం అమలు తీరు ఎంత పేలవంగా ఉన్నదో ఆర్టీఐ సమాధానం తేటతెల్లం చేస్తున్నదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. చట్టం ఉన్నప్పటికీ.. అమలు సరిగ్గా లేదనీ, దీంతో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధాని ఫొటోను పలు ప్రయివేటు కంపెనీలు తమ వాణిజ్య ప్రకటనల్లో వాడుకుంటూ దుర్వినియోగం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టం అమలులో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తున్నారు.


