తెలంగాణ ప్రభుత్వం 14-15 ఏళ్ల బాలికలకు Human Papilloma virus (హెచ్‌పీవీ) ఉచిత టీకా ఇవ్వడానికి సిద్ధమవుతోంది. లక్షల డోసులు కొనుగోలు చేసి ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా అందించనుంది. సర్వికల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉన్నాయని చెబుతూ ఈ కార్యక్రమాన్ని ఆరోగ్యశాఖ అవసరమైన చర్యగా చెబుతోంది. ఉద్దేశం మంచిదే. కానీ, ప్రజారోగ్యంలో మంచి ఉద్దేశం సరిపోదు. స్పష్టత, నిజాయితీ, ఖర్చు లెక్కలు ఇవి కూడా అవసరం. ముందుగా ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. సర్వికల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ వైరస్. ముఖ్యంగా 16,18 రకాలు ఎక్కువ కేసులకు కారణమవుతాయి. ఈ వైరస్ ప్రబలిన వెంటనే క్యాన్సర్ రాదు. చాలా మందిలో వైరస్ తగ్గిపోతుంది.
కానీ, కొందరిలో అది ఏళ్ల పాటు ఉండి కణాల్లో మార్పులు కలిగిస్తుంది. ఆ మార్పులు 10-20 ఏళ్లలో క్యాన్సర్‌గా మారవచ్చు. ఈ మధ్య దశలో పరీక్షల ద్వారా గుర్తిస్తే పూర్తిగా నివారించవచ్చు. అందుకే స్క్రీనింగ్ చాలా ముఖ్యం. హెచ్‌పీవీ టీకా వైరస్ ముఖ్య రకాలపై రక్షణ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనాలు ప్రీ-క్యాన్సర్ దశలు తగ్గుతున్నాయని చూపించాయి. కానీ, ఒక ముఖ్యమైన విషయం ఈ టీకా వంద శాతం హామీ ఇవ్వదు. అన్ని రకాల వైరస్‌పై రక్షణ లేదు. టీకా తీసుకున్నా భవిష్యత్తులో స్క్రీనింగ్ అవసరం అలాగే ఉంటుంది. ”టీకా వేసుకున్నాం కాబట్టి ఇక క్యాన్సర్ రాదు” అని చెప్పడం సరైన సందేశం కాదు.
ఇప్పుడు మరో ప్రశ్న-ఏ టీకా ఇస్తున్నారు? హెచ్‌పీవీకి చాలా రకాలున్నాయి. బైవాలెంట్, క్వాడ్రివాలెంట్, నోనావాలెంట్ అనే రకాల టీకాలు ఉన్నాయి. కొన్ని రెండు రకాలపై, కొన్ని నాలుగు రకాలపై, మరికొన్ని తొమ్మిది రకాలపై రక్షణ ఇస్తాయి. ఖర్చు కూడా వాటి ప్రకారం మారుతుంది. ప్రభుత్వం ఏ టీకా ఎంపిక చేసింది? ఎందుకు ఆ ఎంపిక ఖర్చు పయోజన లెక్కలు ఏమిటి? ప్రజలకు వివరాలు చెప్పాలి. ప్రయివేటులో ఒక్క డోసు ధర వేల రూపాయలు ఉంటుంది. ప్రభుత్వం బల్క్‌గా కొనుగోలు చేస్తే ధర తగ్గొచ్చు.. అయినప్పటికీ ఇది చిన్న ఖర్చు కాదు. డోసులు కొనడం మాత్రమే కాదు, నిల్వ, రవాణా, సిబ్బంది శిక్షణ, పర్యవేక్షణ కలిపి ఇది పెద్ద ప్రాజెక్ట్. ప్రతి సంవత్సరం అదే వయసున్న బాలికలకు ఇవ్వాలి. ఇది ఒకసారి చేసే కార్యక్రమం కాదు. దీర్ఘకాలిక ఖర్చు.ఇదే సమయంలో మహిళలలో అనీమియా ఇంకా ఎక్కువగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సదుపాయాలు పరిమితంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం కావాలి. ఈ పరిస్థితుల్లో ఖర్చు ప్రాధాన్యతలు ఎలా నిర్ణయించబడ్డాయి? టీకా, స్క్రీనింగ్ రెండూ కలిసి నడుస్తాయా? అనే ప్రశ్న సహజమే. ఇక్కడ గత చరిత్ర కూడా గుర్తు పెట్టుకోవాలి. 2009లో గిరిజన ప్రాంతాల్లో హెచ్‌పీవీ టీకా అమలు చేసినప్పుడు వివాదాస్పదమైంది. కొంత మంది బాలికల మరణాలు సంభవించడంతో ఆ ప్రాజెక్ట్ నిలిపివేశారు. తర్వాత దర్యాప్తుల్లో టీకాతో ప్రత్యక్ష సంబంధం నిర్ధారించలేదని చెప్పారు. కానీ, అనుమతి ప్రక్రియ, సమాచారం ఇవ్వడంలో లోపాలు ఉన్నాయని పార్లమెంటరీ నివేదిక పేర్కొంది. మహిళా సంఘాలు అప్పట్లో ”పూర్తి అవగాహన లేకుండా వెనుకబడిన వర్గాలపై ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయకూడదు” అని అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ సంఘటన ప్రజల్లో అనుమానం పెంచింది. ఇప్పుడు మళ్లీ పెద్ద స్థాయిలో కార్యక్రమం చేపడుతున్నప్పుడు, గత అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలేమిటి? తల్లిదండ్రులకు పూర్తి సమాచారం ఇస్తున్నారా? సమ్మతి నిజంగా అవగాహనతో తీసుకుంటున్నారా?
టీకా అనంతర దుష్ప్రభావాలను పర్యవేక్షించే వ్యవస్థ ఎంత బలంగా ఉంది? నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉంటాయా? ఇది టీకాను వ్యతిరేకించడం కాదు. అపోహలు వ్యాప్తి చేయడం సరైంది కాదు. హెచ్‌పీవీ టీకా వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని నిర్ధారిత ఆధారాలు లేవు. కానీ ఖర్చు, ఎంపిక, అమలు విధానం గురించి ప్రశ్నించడం సహజమే.ప్రజారోగ్య కార్యక్రమం విజయ వంతం కావాలంటే మూడు విషయాలు అవసరం – నిజమైన సమాచారం, పారదర్శక ఖర్చు లెక్కలు, బలమైన పర్యవేక్షణ. టీకా ఒక సాధనం మాత్రమే. స్క్రీనింగ్, అవగాహన, ప్రాథమిక ఆరోగ్య సేవల బలోపేతం, అన్నీ కలిసి నడిస్తేనే సర్వికల్ క్యాన్సర్‌ను తగ్గించగలం. ప్రశ్నించడం వ్యతిరేకత కాదు, అది బాధ్యత. సమాధానం ఇవ్వడం బలహీనత కాదు, అది ప్రజల విశ్వాసానికి పునాది. హెచ్‌పీవీ టీకా కార్యక్రమం కూడా ఈ ప్రమాణాలకు లోబడి అమలైతేనే దీర్ఘకాలంలో నిజమైన విజయంగా నిలుస్తుంది.
డాక్టర్ రమాదేవి
9490300863



