Sunday, October 5, 2025
E-PAPER
Homeకవర్ స్టోరీసినిమాలు సమాజానికి ఏమి అందిస్తున్నాయి? వినోదమా? ఉన్మాదమా?

సినిమాలు సమాజానికి ఏమి అందిస్తున్నాయి? వినోదమా? ఉన్మాదమా?

- Advertisement -

ఈ సంవత్సరం కూడా వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ నిర్దేచించిన ‘సేవల లభ్యత – విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో మానసిక ఆరోగ్యం (Access to service – mental health in catastrophes and emergencies) అన్న థీమ్‌తో అక్టోబర్‌ 10 ‘ప్రపంచ మానసిక ఆరోగ్య దినం’ మన ముందుకు వస్తోంది. ప్రతి ఒక్కరూ మంచి మానసిక ఆరోగ్యానికి అర్హులు కాబట్టి సమస్యలను ఎదుర్కొనే సమయంలో వారు తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతని ఈ థీమ్‌ హైలెట్‌ చేస్తోంది.

డబ్ల్యుహెచ్‌ఒ ఇచ్చిన నిర్వచనాన్ని అనుసరించి ‘మానసిక ఆరోగ్యం’ అన్న పదానికి అర్థాన్ని పరిశీలించినట్టయితే ‘మానసిక ఆరోగ్యం అనేది మానసిక రుగ్మతలు లేదా వైకల్యాలు లేకపోవడం మాత్రమేకాదు. వ్యక్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సుకు ఎలాంటి భంగం కల్పించనటువంటి స్థితి, అంతకన్నా ఎక్కువ’. మానసిక ఆరోగ్యం అనగానే మనకి గుర్తొచ్చేది యాంగ్జయిటీ, డిప్రెషన్‌, బైపోలార్‌, అల్జీమర్స్‌, స్క్రిజోఫ్రేనియా వంటి మానసిక రుగ్మతలు, సమస్యలు మాత్రమే. వీటివల్ల సమాజం బలహీన పడడం మినహా ప్రత్యేకమైన హాని ఏమీ వుండదు. కానీ రోజురోజుకీ సమాజంలో ప్రబలిపోతున్న ‘మానసిక ఉన్మాదం’ గురించి ఈ సందర్భంలో చర్చించాల్సిన అవసరం ఎంతో వుంది.

మానసిక ఉన్మాదం సమాజ శ్రేయస్సుకు భంగం కలిగించడమే కాక ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తుంది. వాళ్లు చేసే పనులు విచక్షణా రహితంగా, ప్రమాదరకంగా వుంటాయి. ఈ మధ్య కాలంలోనే రాజధాని నగరమైన హైద్రాబాద్‌లో జరుగుతున్న భయంకరమైన హత్యలే అందుకు నిదర్శనం.

ఒక్కసారి మనం అటువైపు దృష్టి సారిస్తే…
-రెండు వారాల వ్యవధిలో కూకట్‌పల్లిలో జరిగిన సహస్ర, రేణుకా అగర్వాల్‌ల హత్యలు
-అనుమానంతో భార్య గొంతుకోసి చంపిన భర్త
-కిస్మత్‌నగర్‌ వంతెన కింద పోలీసులు గుర్తించిన యువతి మృతదేశం.
-గర్భిణి అయిన భార్యను చంపి శరీర భాగాలు నదిలో పారేసిన భర్త.
-డ్రగ్స్‌కి బానిసైన యువకుడు తండ్రి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో నడిరోడ్డుపైనే పెట్రోల్‌ పోసి సజీవదహనం చేసిన ఉదంతం.
-ప్రియుడి కోసం కన్న బిడ్డల్ని హతమార్చిన తల్లి.
-భార్యని హత్య చేసి శరీరభాగాలు ఉడకబెట్టి, నీళ్లల్లో పారేసిన మాజీ సైనికుడు.
-రెండు సంవత్సరాలుగా కూతురిపై కన్నతండ్రి లైంగికదాడి.

ఇవన్నీ మనం ప్రింట్‌ మీడియా, సోషల్‌ మీడియాల్లో చదివిన, చూసిన వార్తలే. నేరానికి పాల్పడిన వాళ్లెవరూ శత్రువులు, బయటివాళ్లు కాదు. పరిచయస్తులు, కుటుంబ సభ్యులే. అంతేకాదు, హతులెవరూ అర్థరాత్రి శరీరం కనబడేలా బట్టలు వేసుకుని బయట తిరిగినవాళ్లు కాదు. వీటన్నింటినీ చూస్తుంటే ప్రస్తుత సమాజంలో మనిషి భద్రత పెద్ద ప్రశ్నార్ధకంగా మారుతోంది. కొన్ని సందర్భాల్లో హత్యలు చేయడంలో కూడా హంతుకులు ప్రదర్శిస్తున్న పైశాచికత్వం, కిరాతకం సమాజాన్ని వణికిస్తోంది. దీన్నిబట్టి మనుషుల్లో ఉన్మాదం ఏ స్థాయికి వెళ్తోందో స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క హైద్రాబాద్‌ నగరంలోనే ఈ మధ్య కాలంలోనే ఇన్ని హత్యలు బయటికి వచ్చాయంటే దేశవ్యాప్తంగా ఇంకా ఎన్ని వందల, వేల హత్యలు జరుగుతున్నాయో, అందులో ఎన్ని వెలుగులోకి వస్తున్నాయో అన్న ఆలోచన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అసలు మనుషుల్లో ఉన్మాదం ఎందుకింత వెర్రితలలు వేస్తోంది?

విషయంలోకి వెళ్లినట్టయితే…
ఒక మెసేజ్‌ని ప్రజల వద్దకి ప్రభావవంతంగా చేర్చడానికి ఉపయోగపడే అతి శక్తివంతమైన సాధనాలు సినిమా, సోషల్‌ మీడియా. ఎటువంటి పక్షపాత వైఖరి, వివక్ష లేకుండా ప్రజలందరూ ఆదరించేది ఈ రంగాలనే. అందువల్లే వీటి పరిథి కూడా చాలా విస్తృతంగా వుంటుంది. ప్రజలకి వినోదం, విజ్ఞానం అందించడంతో పాటు వ్యక్తి, సమాజ శ్రేయస్సుకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించడమే ప్రధాన వుద్దేశ్యంగా సినిమా రంగం రూపుదిద్దుకుంది. ఇప్పటికీ సిబిఎఫ్‌సి లో పొందుపరచబడ్డ నిబంధనలు కూడా ఇందుకు అనుగుణంగానే వున్నాయి. దురదృష్టవశాత్తు గతకొద్ది సంవత్సరాలుగా సినిమాల్లో ఇటువంటి అంశాలు ఏవీ మచ్చుకైనా కనిపించటం లేదు. ఆ స్థానంలో మితిమీరిన హింస, నేరప్రవృత్తిని హీరోయిజంలా చూపించడం జరుగుతోంది. దీనికి తోడు ఒటిటి ప్లాట్‌ఫామ్స్‌ వచ్చాక అశ్లీలతకి కూడా అడ్డుకట్ట లేకుండా పోయింది.

ఒకప్పటి సినిమా, ఇప్పటి సినిమా మధ్య వ్యత్యాసాన్ని చూసినట్టయితే :
అప్పటి సినిమాల్లో మాఫియా, స్మగ్లింగ్‌, హత్యలు, గూండాయిజం, ఆల్కహాల్‌ ఇంకా ధూమపానం వంటి వ్యసనాలు అన్నీ ప్రతినాయకుడిలో వుండే లక్షణాలు. సినిమా ముగింపులో పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేయడంతో సినిమా అయిపోయేది. కథానాయకుడి పాత్ర ఇందుకు పూర్తి భిన్నంగా వుండేది. ప్రతినాయకుడు చేసే చర్యల నుంచి వ్యక్తుల్ని, సమాజాన్ని కాపాడడం కోసం అతను పాకులాడేవాడు. ఆ ప్రాసెస్‌లో ఫైటింగ్స్‌ చేయడం తప్ప హత్యలు చేసినట్టు ఎక్కడా చూపించేవాళ్లు కాదు. అది శిక్షార్హమైన చర్య అన్న మినిమమ్‌ కామన్‌సెన్స్‌ వాళ్లకి వుండేది. వాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా ఇటువంటి అంశాలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు.

ఇప్పుడు వస్తున్న సినిమాలని గమనిస్తే విలన్‌ చేసే నేరాలన్నీ అంతకన్నా శక్తివంతంగా, మరింత నైపుణ్యంతో హీరోలు చేసేస్తున్నారు. స్మగ్లింగ్‌, గూండాయిజం, మాఫియా యాక్టివిటీస్‌ ఎంత స్థాయిలో చేయగలిగితే అంత హీరోయిజం చూపించినట్టు. ఈ ప్రాసెస్‌లో సినిమా మొదలయిన పది నిమిషాల నుండి సినిమా అయిపోయేదాకా వందలమందిని ఊచకోత కోయడం, చివరికి పోలీసు శాఖని కూడా హేళన చేస్తూ వాళ్ల ముఖాన ‘సుస్సు’ చేయడం (చిత్రం ఏంటంటే ఇంత అవమానకర సంఘటన గురించి పోలీసుశాఖ గానీ, ప్రభుత్వాలు గానీ ఎక్కడా ఖండించకపోవడం), అలా చేసేటప్పుడు ముఖంలో, బాడీ లాంగ్వేజ్‌లో తీవ్రమైన ఉన్మాదాన్ని, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తూ దాన్నే హీరోయిజంలా ప్రేక్షకులకి పరిచయం చేయడం ప్రస్తుతం సినిమా ట్రెండ్‌ అయిపోయింది. ఇన్ని వికృత చేష్టలు చేశాక చివరికి కాలర్‌ ఎగరేస్తూ, రెండు స్టెప్స్‌ వేస్తుండగానే స్క్రీన్‌ మీద ‘ది ఎండ్‌’ అని వస్తుంది. సినిమాని బట్టి ఇతివృత్తం మారుతోందే కానీ తీసే శైలిలో మాత్రం మార్పు వుండడం లేదు.

సమాజంలో పెరిగిపోతున్న ఉన్మాదానికి సినిమాల్లో చూపించే హింస కూడా ఒక ప్రధాన కారణమని మానసిక నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. వాళ్ల మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
ఇప్పటికే చాలామంది యువతలో ఆ పోకడలు కనిపిస్తున్నాయి. సినిమాలు ఇస్తున్న ప్రేరణ, ప్రోత్సాహంతో యువత అడ్డమైన నేరాలకి పాల్పడుతోంది. ధూమపానం, ఆల్కహాల్‌, డ్రగ్స్‌ ఆధునికతకు ప్రతీకలుగా మారాయి. విశృంఖలత్వం వ్యక్తిగత అంశం అయింది. ఉన్మాదం, పశుత్వాన్ని వీరోచితంగా భావిస్తున్నారు. వీటివల్ల ఎంత మంది అమాయకులు బలౌతున్నారు అన్న కనీస ఇంగితం వాళ్లకి లేకుండా పోతోంది. చివరికి సొంత కుటుంబ సభ్యుల మీదకే దాడులకి తెగబడుతున్నారు. దీనిపై ప్రముఖ మానసిక వేత్త ఆల్బర్ట్‌ బందూరా ఒక సుదీర్ఘ అధ్యయనం చేశారు.

అధ్యయనం అనంతరం ఆయన వెల్లడి చేసిన అంశాల్ని పరిశీలించినట్టయితే ‘భావోద్వేగాలు, ప్రవర్తన, ప్రేరణ వంటి లక్షణాల్ని అదుపులో వుంచుకోగల పరిపక్వత లేని వయసు చిన్నపిల్లలు, యువతది. వారు తమ సొంత అనుభవాల నుంచి కాకుండా ఇతరులను చూడడం, అనుకరించడం ద్వారా నేర్చుకునే అంశాలే ఎక్కువగా వుంటాయి. దీనినే సామాజిక అధ్యయనం అంటారు. దానివల్ల స్క్రీన్‌పై చూసే హింస ద్వారా వీళ్లు సులభంగా ప్రభావితులు అవుతారు. చూసినదాన్ని అనుకరించాలనే తీవ్రమైన ఆలోచన వారిలో వుంటుందని, ఆ సమయంలో వారు తీసుకునే నిర్ణయాలు కూడా ఎంతో ప్రమాదకరంగా వుంటాయి. అంతేకాదు, పిల్లలు యువత తరచుగా హింసాత్మక దృశ్యాలు చూస్తుంటే ఈ ప్రపంచాన్ని వాళ్లొక హింసాత్మక ప్రదేశంగా భావిస్తారు.

వారిలో భావోద్వేగాల సున్నితత్వం పూర్తిగా నశించిపోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారు. దానికి కారణం స్క్రీన్‌పై చూసే హింసని వీరు వీరోచితంగా భావించడమే. దానివల్ల సమాజానికి ఎంతో ముప్పు కలుగుతుందని కూడా ఆల్బర్ట్‌ హెచ్చరిస్తున్నారు. హింసకు పాల్పడే పిల్లల, యువత మానసిక స్థితి ఎంత ప్రమాదకరమైందో హింసకు గురయ్యే పిల్లలు, యువత మానసిక స్థితి కూడా అంతే ప్రమాదకరంగా మారే అవకాశాలు వుంటాయి. వారు కూడా పగ, ప్రతీకారంతో సంఘవిద్రోహులుగా మారతారని మానసిక నిపుణులు చెప్తున్నారు. యువతలో ఇంత హింసని, ఉన్మాదాన్ని ప్రేరేపిస్తున్న సినిమాలు, ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌ పై చట్టపరమైన నిబంధనలు లేవా అంటే – వాటికి కూడా రెక్కలు విరిచి పక్కన పెట్టేశారు.

అసలు ఆ చట్టంలో ఏముందో చూద్దాం :
భారతదేశం సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబిఎఫ్‌సి) ‘సినిమాటోగ్రాఫ్‌ చట్టం 1952’ కింద సినిమాలని ప్రదర్శనకు దృవీకరించడానికి బాధ్యత వహించే ఒక చట్టబద్దమైన సంస్థ.
ఈ చట్టం కేవలం థియేటర్లలో, దూరదర్శన్‌లో ప్రదర్శించబడే సినిమాలకి మాత్రమే వర్తిస్తుంది. ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌కి వర్తించదు. కాబట్టి విషయాన్ని రెండుగా విభజించి మాట్లాడుకోవాలి.
ఇక్కడ మన చర్చ మనుషుల్లో పెరుగుతున్న ఉన్మాదం గురించి కాబట్టి అందుకు సంబంధించిన అంశాన్ని మాత్రమే పరిశీలిద్దాం.

సిబిఎఫ్‌సిలో పొందుపరిచిన నిబంధనలు :
-చలనచిత్ర మాధ్యమం సమాజ విలువలు, ప్రమాణాలకు బాధ్యతాయుతంగా సున్నితంగా వుండాలి.
-హింస వంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కీర్తించడం, సమర్థించడం చేయబడవు.
-నేరస్థుల కార్యనిర్వాహణ విధానం, ఇతర దృశ్యాలు, ఏదైనా నేరం చేయడానికి ప్రేరేపించే పదార్థాలు వర్ణించబడవు.
-మాదక ద్రవ్య వ్యసనాన్ని ప్రోత్సహించడానికి, సమర్థించడానికి, గ్లామరైజ్‌ చేయడానికి టెండర్‌ వేసే దృశ్యాలు చూపబడవు.
-హింస, కౄరత్వం, భయానక దృశ్యాలు, ప్రధానంగా అమానవీయంగా మార్చే ప్రభావాన్ని చూపే దృశ్యాలు చూపబడవు.

-మహిళలపై లైంగిక హింసకు సంబంధించిన దృశ్యాలు, అత్యాచారం, వేధింపులు, సంబంధించిన దృశ్యాలు నివారించబడతాయి. అలాంటి సంఘటన ఏదైనా ఇతివృత్తానికి సంబంధించినది అయితే వాటిని కనిష్టస్థాయికి తగ్గించాలి. ఎటువంటి వివరాలు చూపబడవు.
-లైంగిక వ్యక్తీకరణలను చూపించే దృశ్యాలను నివారించాలి.
-హింసలో పిల్లలు బాధితులుగా, నేరస్థులుగా, హింసకు బలవంతపు సాక్షులుగా పాల్గొనటాన్ని చూపించడం, పిల్లలు ఏ విధమైన దుర్వినియోగానికి గురైనట్లు చూపించడం చేయబడవు.
బోర్డు సినిమాలు శీర్షికలని జాగ్రత్తగా పరిశీలించి, అవి రెచ్చగొట్టేలా, అసభ్యకరంగా, అభ్యంతరకరంగా, పైన పేర్కొన్న మార్గదర్శకాలను ఉల్లంఘించేలా లేవని నిర్థారించుకోవాలి. అప్పుడే ఆ సినిమాలు విడుదలకి అనుమతి లభిస్తుంది.

దీన్ని బట్టి చలనచిత్ర పరిశ్రమ ఈ నిబంధనలన్నింటినీ ఏనాడో తోసిరాజేసింది. ఎలాంటి కంటెట్స్‌ పైన అయితే నిబంధనలు విధించబడ్డాయో అవే కంటెంట్స్‌ని ప్రధాన ఇతివృత్తాలుగా తీసుకుని ప్రస్తుత సినిమాలన్నీ నిర్మించబడుతున్నాయి. కానీ వాటికి బోర్డు అనుమతి లభించడం, థియేటర్లలో యథేచ్చగా ప్రదర్శింపబడడం మనం చూస్తూనే వున్నాం. కొసమెరుపు ఏంటంటే బాక్సాఫీస్‌ బద్దలు కొడుతున్నది కూడా ఈ తరహా చిత్రాలే. దీన్ని బట్టి మన దేశంలో చట్టాలు ఎంత బలంగా వున్నాయో, ఎంత చిత్తశుద్ధితో అమలుపరచబడుతున్నాయో చెప్పడానికి ఇది కూడా మరొక నిదర్శనమే.
ఇవన్నీ చూస్తూ కూడా ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌పై నిబంధనా చట్టాలు లేవని వాపోవడం కేవలం మన అమాయకత్వమే.

మనం ఇంకో అడుగు ముందుకు వేసి మాట్లాడుకున్నట్లయితే హింస, నేరప్రవృత్తిని ప్రమోట్‌ చేయటంతో పాటు డ్రగ్స్‌, మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాలకి కూడా సినిమాలు, ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా మారాయి. సినిమా ఆధ్యంతం చేతిలో ఆల్కహాల్‌, సిగరెట్‌ లేకుండా ఏ మేల్‌ క్యారెక్టర్‌ కనిపించవు. వీటన్నిటినీ చిన్నపిల్లలు, యువత ఆధునిక జీవన శైలి అనుకుని వాటినే అనుకరిస్తున్నారు. అఖిల భారత వైద్య విజ్ఞానసంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాతీయ చికిత్సాకేంద్రం నిర్వహించిన సర్వే ప్రకారం భారతదేశంలో పది నుంచి డెబ్బైఐదు ఏళ్ల వయసు వారిలో కోటిన్నర మందికి పైగా గంజాయిని వివిధ రూపాల్లో వినియోగిస్తున్నారని వెల్లడయింది. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రసార మాధ్యమాలు, ఒటిటిల వంటి వాటిలో ఆల్కహాల్‌, గుట్కా, సిగరెట్‌, జర్దా తదితర సంబంధిత ప్రకటనలను పూర్తిగా నిషేధించాలని సూచించింది.

ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌పై దృష్టి సారించినట్టయితే…
ప్రస్తుతం ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌లో థిల్లర్‌ సినిమాలు, సిరీస్‌లకి ఒక రేంజ్‌లో క్రేజ్‌ పెరిగింది. సస్పెన్స్‌, క్రైమ్‌, ట్విస్ట్‌లు వుంటే చాలు ఆడియన్స్‌ కనెక్ట్‌ అవుతున్నారు. సినిమాలు థియేటర్లలో హిట్‌ అయినా అవకపోయినా ఒటిటిల్లో మాత్రం దూసుకెల్తున్నాయి. మితిమీరిన శృంగారం కూడా ఇక్కడ యధేచ్ఛగా ప్రదర్శింపబడుతోంది. అందుక్కారణం మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వీటిపై అధికారిక సెన్సార్‌షిప్‌ పరిమితులు లేకపోవడమే. అధికారిక సెన్సార్‌షిప్‌ బోర్డు ఏర్పాటు చేయబడితే భావప్రకటనా స్వేచ్ఛ, దాని అతిక్రమణకు సంబంధించిన సంభావ్యత గురించి ఆందోళన వుంది. అధికారిక సెన్సార్‌షిప్‌ పరిమితులు లేకపోతే కేవలం ప్రేక్షకుల ప్రాధాన్యత (వారిని ఆకట్టుకునే విధంగా), మార్కెట్‌ డిమాండ్లకు అనుగుణంగా కంటెంట్‌ని రూపొందించవచ్చని వీరి వాదన.

అందువల్లే అనేక ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌ వాటి సొంత కంటెంట్‌ మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా స్వీయ నియంత్రణలను ఎంచుకున్నాయి. వీరి వాదనలో మరొక అంశం ‘కఠినమైన నిబంధనలు సృజనాత్మకతను అణచివేయగలవు’ అని. ఇది ఎంతో హాస్యాస్పదమైన స్టేట్‌మెంట్‌. హింస, అశ్లీలతల్ని కూడా సృజనాత్మకంగా చూపడం ఊహకి అందని ప్రశ్న. ఒటిటి స్ట్రీమింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, సోషల్‌మీడియాలో అభ్యంతరకరమైన, అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను నిషేధించటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కోరుతూ గతంలో పిటీషన్‌ కూడా దాఖలయింది. సుప్రీంకోర్టు దానికి స్పందిస్తూ కేంద్రం, సంబంధిత అధికారులకి నోటీసులు కూడా జారీ చేసినట్టు సమాచారం కూడా ఉంది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు.

పరిష్కారం వుందా?
సమస్య చాలా తీవ్రమైంది. దానికి పరిష్కారం సూచించటం అంత సులభం కాదు. అయితే ఒక సమస్య చర్చకు తెచ్చినప్పుడు పరిష్కారం కూడా సూచించాల్సి వుంటుంది. ఏదేమైనా సమిష్టి కృషితోనే అది సాధ్యపడుతుంది.

నా ఆలోచనా పరిథిలో వున్న కొన్ని అంశాల్ని మాత్రం ప్రస్తావిస్తాను…
-చట్టంలోని ఏ ఒక్క నిబంధన కూడా పాటించని సినిమాలని థియేటర్లలో ప్రదర్శనకి ఎందుకు అంగీకరించవలసి వస్తోంది అన్న దానిపై బోర్డు సభ్యులు ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వాలి. నిబంధనల్ని ఉల్లంఘించటం అంటే సమాజ భద్రతకి భంగం కలిగించటమే అవుతుంది. దానిని ప్రోత్సహించటం కూడా నేరమే. ఇక నుంచైనా బోర్డు సభ్యులు తమ బాధ్యతని తెలుసుకుని చిత్తశుద్ధితో పనిచేయాలి.
-చట్టాల పనితీరుని కూడా పర్యవేక్షించే పరిస్థితిలో లేవు మన ప్రభుత్వాలు. ఎవరో పిల్‌ వేసి, సుప్రీం కోర్డు నోటీసులు జారీ చేసేదాకా కళ్లుమూసుకుని కూర్చున్నాయంటే ఎంత సిగ్గుచేటో ఆలోచించాలి. ‘నేర రహిత సమాజం, డ్రగ్స్‌ రహిత సమాజం’ అంటూ నినాదాలైతే చేస్తున్నాయి కానీ తరాలు దాటిపోతున్నా కనీసం వాటి గురించి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. ప్రజలకి ప్రభుత్వాలపై నమ్మకం ఏనాడో పోయింది. ఇప్పటికైనా నినాదాలు కట్టిపెట్టి పటిష్టమైన చర్యలు చేపట్టకపోతే ఉన్మాదానికి, నేరప్రవృత్తికి, డ్రగ్స్‌కి బానిసలై మరెందరో బలైపోతారు. తక్షణమే నిపుణుల సలహాలు తీసుకుని తగిన చట్టాన్ని రూపొందించాలి.

-సమస్య ఎక్కడ మొదలయిందో పరిష్కారం కూడా అక్కడ నుంచే రావాలి. అసాంఘిక చర్యలు, ఉన్మాదం వంటి అంశాల్ని ప్రమోట్‌ చేయడం ద్వారా సినిమారంగం సమాజానికి ఏం మెసేజ్‌ అందించాలనుకుంటుందో ప్రజలకి సహేతుకంగా వివరించాలి .కేవలం డబ్బు సంపాదనే ధ్యేయం కాకుండా సమాజ శ్రేయస్సుని దృష్టిలో వుంచుకుని సినిమాలు నిర్మించాలి. చట్టంలో వున్న నిబంధనల్ని తప్పకుండా పాటించగలిగితే కొంతైనా ప్రయోజనం వుంటుంది. సమాజానికి ఉన్మాదాన్ని పరిచయం చేసినంత తేలిక కాదు ప్రక్షాళన చేయటం. దానికోసం ఎన్నో వదులుకోవాలి. దానికి వాళ్లు సిద్ధపడతారా అన్నదే ప్రధాన అంశం.
-‘తిలాపాపం తలా కొంచెం’ అన్నట్టు ఉన్మాదాన్ని పెంచి పోషించడంలో సోషల్‌ మీడియా పాత్ర కూడా తక్కువేం కాదు. ఒక సంఘటన జరగగానే రేటింగుల కోసం పోటీపడుతూ జరిగిన సంఘటనకి తమ క్రియేటివిటీని జోడించి వికృత స్వరంతో విశ్లేషిస్తూ స్క్రీన్‌ మీద అదే సంఘటనని పదేపదే చూపిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో వాళ్లకి తెలీని విషయం ఏంటంటే ఆడియన్స్‌లో సెన్సేషనల్‌ సీకర్స్‌ వుంటారని. అది కూడా చిన్నపిల్లలు, యువత. స్క్రీన్‌పై రిపీటెడ్‌గా చూసే దృశ్యాలు, ప్రేక్షకుల్లో ఉత్కంఠత రేపే యాంకర్‌ కంఠస్వరం ఈ సెన్సేషనల్‌ సీకర్స్‌ మెదడుని ప్రభావితం చేసి, వారిని నేరప్రవృత్తి వైపుకి నెట్టివేస్తుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా అర్థం చేసుకోవాలి.

చేసేది వ్యాపారమే అయినా అది మనుషుల జీవితాలతో కాకూడదు అన్న కనీస ఎథిక్స్‌, మోరల్స్‌ వాళ్లకుండాలి. ఒటిటిల్లో వచ్చేస్తున్నాయి కదా అని టీవీల ముందు కూర్చుని ‘ఆ… కాలక్షేపం కోసమేగా’ అనుకుంటూ మూడు గంటలు ఆ చెత్త చూడడం ప్రేక్షకులు కూడా మానేయాలి. మూడేళ్ల చిన్నపిల్లల నుంచి ఎనభైయేళ్ల ముసలివాళ్ల దాకా ఒక వ్యసనంలా చూస్తున్నారు కాబట్టే ఒటిటి ఫ్లాట్‌ఫామ్స్‌ అంత లాభాల్ని గడిస్తున్నాయి. కనీసం పెద్దవాళ్లయినా అలాంటి కంటెంట్స్‌ని చూసేప్పుడు కనీస నైతికతని పాటిస్తే వాటి రేటింగ్స్‌ పడిపోయే అవకాశం వుంది. అంతేకాని వచ్చిన ప్రతి సినిమా చూసేస్తూ తర్వాత విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఇవి కేవలం కొన్ని పరిమితమైన ఆలోచనలు మాత్రమే. ఇంతకన్నా విలువైన ఆలోచనలు, పరిష్కార మార్గాలు మరెన్నో వుంటాయి. అందుకే చర్చలు జరపాలి.


ముగింపుగా : సమాజంలోని వ్యవస్థలన్నింటి పనితీరు ఈ విధంగా వుంటే వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ నిర్దేశించిన థీమ్‌ ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందన్నదే పెద్ద క్వశ్చన్‌ మార్క్‌. అదే పెద్ద పారడాక్స్‌ కూడా.

గోపాలుని అమ్మాజి, 7989695883
హ్యూమన్‌ సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సిలర్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -