బీహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, ఎన్డీయే కూటమి అసాధారణ ఆధిక్యతతో అధికారం నిలబెట్టుకుంది. 2020 ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా దరిదాపులకు చేరడమే గాక 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆధిక్యత కూడా పట్టు చూపిన ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్షాల మహా ఘట్‌బంధన్ (ఎంజీబీ)కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే విజయం గురించి అంచనాలు చెప్పిన ఏ ఎగ్జిట్ పోల్ కూడా ఊహించని స్థాయిలో అధికంగా సీట్లు వస్తే, ఎంజీబీకి ఏ ఒక్కరు చెప్పిన దానికన్నా తక్కువగా సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యమైన రీతిలో అయిదోసారి విజయం సాధించి పదోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. నితీష్ ఈ ఇరవై ఏండ్లలో అయిదుసార్లు అటూ ఇటూ మారిన మాట అటుంచి తిరుగులేని నాయకుడుగా వచ్చాడని ఆవిర్భవిం చాడనే ప్రచారం ఒకటైతే, నిమో విజయంగా బీజేపీ ప్రచారం మరోవైపు నడుస్తున్నది(నిమో అంటే నితిష్ మోడీ. అదే ఏపీలో నమో అంటే నారామోడీ.)నితీష్ కుమార్ తన ‘ఎక్స్’లో మోడీకి సాష్టాంగ ప్రణామం చేస్తున్నట్టు ట్వీట్ చేయడం కొసమెరుపు.
గతంలోనూ మోడీకి పాదాభివందనాలు చేసిన నితీష్ ఈ విధంగా ఎక్స్‌లోనూ సంచలనం సృష్టించారన్నమాట. ప్రధాని మోడీ కేంద్రంలో విజయోత్సవ ప్రసంగం చేస్తూ తమ తదుపరి టార్గెట్ బెంగాల్ కైవసం అని ప్రకటించారు. వ్యక్తిగతంగానూ, పార్టీ పరంగానూ అగ్రస్థానాన ఉన్నాడని చెప్పుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) నాయకుడు తేజస్వియాదవ్ ఓట్ల పరంగా తన ప్రథమ స్థానాన్ని నిలబెట్టుకున్నా సీట్లలో గతంలో వచ్చిన దాంట్లో సగంకన్నా పడిపోయింది. ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ అగ్రనేత లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఎన్నడూ లేనంత తక్కువ స్థానాలు తెచ్చుకున్నారు. అందరినీ గెలిపించే ఎన్నికల వ్యూహకర్త బీహారీయుడు ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జనసురాజ్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది. లౌకిక వామపక్ష శక్తులకు ఈ ఫలితాలు నిరుత్సాహం కలిగించడం ఒకటైతే కాంగ్రెస్‌ను నిర్ఘాంతపరచాయి. ఎన్నికల కమిషన్ ‘సర్’కు తొలి రంగస్థలంగా మారిన బీహార్ ఆ విషయమై కేసు సుప్రీంలో తుది పరిష్కారం కాకుండానే పోరాటం ముగిసి పోయింది. ఎన్నికల ప్రకటనకు ఆరునెలల ముందే ఆపరేషన్ సిందూర్‌పై తొలి ప్రకటన బీహార్‌లో వెలువడగా తుదిదశ పోలింగ్‌కు ముందురోజే ఎర్రకోట ముందు కారు విస్పోటనం కలవరం సృష్టించింది.
‘ఎంవై’ జపం.. మత రాజకీయం
సమీక్షలు, విశ్లేషణలు ఏమైనప్పటికీ ఎన్నికల తీర్పును స్వీకరించి తగు పాఠాలు నేర్చుకోవడమే రాజకీయ పార్టీల ప్రజల కర్తవ్యం. ఎన్నికల ప్రకటన ఇప్పుడో అప్పుడో అంటుండగా నితీష్ మహిళలకు పది వేల రూపాయల సహాయం అందించడం చాలా ప్రభావంగా చూపించడం సహజమే. దానికి ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం కూడా విశేషమే, (ఎందుకంటే తమిళనాడులో లోగడ డిఎంకె కొన్ని పథ కాలు చేయబోతే అనుమతి నిరాకరించిన ఉదాహరణ ఉంది.) మద్య నిషేదం కారణంగానూ ఆయనపై మహిళా ఓటర్లలో సదభిప్రాయం పొందినట్టు కనిపిస్తుంది. నితీష్‌కు మహిళలు, తేజస్వికి యువత ఓట్లు వేస్తారని భావించారు. ముస్లిం యాదవ్ (ఎంవై) అనే ఫార్ములా మహిళ యువగా మార్చి చూపారు.నిజానికి నిరుద్యోగం వలస బతుకులు రెండు తరగతులపైనా తీవ్రంగానే ప్రభావం చూపుతాయి.కానీ, బీహార్ రాజకీయ కథనం అలా నడుస్తూ వచ్చింది.
ఓట్ల పరంగా సర్, పథకాల పరంగా పదివేల వ్యవహారం రెండూ ఎన్నికల నేపథ్యంలోనే జరిగాయి.పాకిస్థాన్‌తో ఘర్షణ, మతవాద ప్రచారం భారీ ఎత్తున సాగింది. అందులోనూ స్వయంగా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షా అందుకు బాధ్యత తీసుకున్నారు. వలసల నివారణ, పేదరికం, భూ సమ స్యలు, లైంగికదాడులతో సహా ప్రజా సమస్యలపై ఎంజీబీ చేసిన ప్రచారం వీటి చాటున కొట్టుకుపోయింది. కేంద్రంలో మోడీ, పక్కనే యూపీలో యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉండగా ఉత్తరాదిన క్రమేణా హిందూత్వ రాజకీయాల పట్టు పెరుగుతున్నదనే నిజం కూడా బీహార్ ఫలితంలో ప్రతిబింబించింది.దానికి మరింత ఆజ్యం పోసేందుకు మజ్లిస్ రంగంలోకి దిగి ఆ ఓట్లు ఎంజీబీకి రాకుండా చేసింది. తనూ నాలుగు స్థానాలు పొందింది, రెండు కూటములలోనూ చేరని పార్టీలు ఈ విధంగా పదిశాతం వరకూ ఓట్లు తెచ్చుకోవడం ఫలితాన్ని చాలా ప్రభావితం చేసింది. వీటిలో కొన్ని పరోక్షంగా బీజేపీతో చేతులు కలిపాయి.
ఎంజిబి పొరబాట్లు
ఎంజీబీ వైపు నుంచి చూస్తే సీట్ల సర్దుబాటుకు తుది ప్రకటనకు అంతులేని ఆలస్యం జరిగింది. ఇందుకు మూడు పార్టీలు బాధ్యత వహించవలసి ఉంటుంది. నిజానికి 2020లో కాంగ్రెస్ డెబ్బయి స్థానాలు తీసుకుని ఇరవైకూడా తెచ్చుకోక పోవడం పరిస్థితి తలకిందులు చేసింది. ఈ సారి కూడా 60 వరకూ కావాలని ఆఖరు వరకూ పట్టుపట్ట డమే గాక తేజస్విని కూటమి నాయ కుడుగా ప్రకటించకుండా జాప్యం చేసింది. పూర్తి ఏకాభిప్రాయంతో ఎన్నికల ప్రచారం ఊపుగా సాగించ డానికి కూడా ఇది ఆటంక మైంది. ఇదంతా రాహుల్‌గాంధీ నాయకత్వం లో జరిగిందని చెప్పడం కాంగ్రెస్ ఏకైక వ్యూహం.రాహుల్ క్రియాశీలంగా మారడం మంచిదే అయినా ఆయన నినాదాలు, పద్ధతులు కొన్నిసార్లు ఇబ్బందిగానూ మారుతూ వచ్చాయి. ఒట్ చోరీ అంటూ మొదలుపెట్టిన ఆయన పోలింగ్ సమయంలోనే హర్యానా ఓటర్ల జాబితాతో సర్కార్ చోరీ నినాదం ఇచ్చారు. ఇది ముందే ఓటమిని ఒప్పుకోవడంగా బీజేపీ ప్రచారం ఎత్తుకుంది. కాంగ్రెస్ వైఖరి కారణంగా ఇతర లౌకిక పార్టీలేవీ ఎంజీబీ తరపున రంగంలోకి దిగి ప్రచారం చేసేం దుకు సిద్ధం కాకపోవడానికి కూడా ఇది కారణమైంది. సీపీఐ(ఎంఎల్) కూడా తన స్థానాలపై ఆంగీకరించ డానికి చాలా సమయం పట్టింది. మొత్తం మీద ఎంజీబీ మరింత ఏకోన్ముఖంగా సమర్థంగా, సమిష్టిగా పోరాటంలోకి దిగాల్సి ఉండింది.
అవకాశవాదంతో సుశాసనం
ఇక చివరగా మోడీ, అమిత్‌షాలు బీహార్ ఎన్నికలను తీవ్ర సవాలుగా తీసుకుని అన్ని రకాల మతతత్వ పాచికలు ప్రయోగించారు. అభ్యంతరకరమైన అంశాలతో రెచ్చగొట్టేం దుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం ఏ దశలోనూ వాటిని ఆపడానికి ప్రయత్నించనే లేదు. నితీష్ కుమార్ కూడా పరోక్షంగా వాటికి వంతపాడుతూ వచ్చారు.2024 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి దూరం జరిగినట్టు కనిపించిన నితీష్ తర్వాత పూర్తిగా వారినే ఆశ్రయించు కున్నారు. దాంతో కార్పొరేట్ మీడియా ఆయనకు వంతపాడటం ప్రారంభించింది. ఆయన వయసునే సమస్యగా భావిస్తున్నట్టు చెబుతూ రాజకీయ లోపాలు కప్పిపుచ్చింది. సహజంగా అభిమానించే మహిళలు ఇతర ఓటర్లు దాన్ని పెద్ద సమస్యగా పరిగణించకపోయి ఉండొచ్చు. నిజానికి సుశాసన్ బాబుగా టముకు వేసుకున్న నితీశ్ అంత సుశానుడేమీ కాదు. ఆయన హయాంలో వరుసగా పద్దెనిమిది వంతెనలే కోట్టుకుపోయాయి.
రాజకీయంగా సుస్థిర విధానం,లౌకిక ప్రజాస్వామ్య విధానాల పట్ల నిబద్దత లేని ఒక నాయకుడు పాలనా పరంగా గొప్ప సమర్థత చూపడం సాధ్యమయ్యేది కాదు. మత రాజీకయాలు, కార్పొరేట్ దోపిడీ, సమాఖ్యపై దాడి వంటి ఏ అంశంలోనూ నితీష్ నిలబడింది లేదు. ఇన్నేండ్లు ముఖ్యమంత్రిగా ఉండటమే గొప్పగా చెప్పడం తప్ప అందుకోసం ఎటుబడితే అటు దూకిన ఆయన అవకాశ వాదాన్ని విస్మరించడం ఏం రాజకీయం? మోడీ పట్టులో వున్న కార్పొరేట్ మీడియా వాటిని పొరబాటున కూడా మాట్లాడలేదు. అందుకు బదులు ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది లాలూ ప్రసాద్‌యాదవ్ జంగిల్ రాజ్, నితీష్ మంగళ్ రాజ్ అంటూ కొత్త పల్లవినే పతాక శీర్షికల్లో ఇస్తూ వచ్చింది.లాలూ హయాంలో తప్పులు ఆరోపణలు ఎవరూ కాదనరు గాని ఇరవ య్యేండ్ల ఎన్డీయే పాలన తర్వాత వాటినే చెప్పడం దేనికి? అప్పుడు జరిగినవన్నీ సరైనవని కాదు గానీ, ఆ పేరుతో ఇప్పటి వ్యవహారాలనూ అవకాశవాదాలను కప్పిపుచ్చడం మాత్రం సంఘపరివార్ వ్యూహంలో భాగం.
కూటముల తేడా
2020తో పోలిస్తే 2025లో బీహార్ ఎన్నికల గణాంకాలు అనేక సత్యాలు చెబుతున్నాయి. అప్పట్లో ఎన్డీయే, ఎంజీబీలకు 37.6,36.58 శాతం ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 0.03 శాతం ఓట్ల తేడాతో మూడు సీట్ల ఆధిక్యతతో అధికారానికి రాగలిగింది. అప్పుడు ఆర్జేడీ, ఎంజీబీ 110 స్థానాలు తెచ్చుకుంది. 75 స్థానాలతో ఆర్జెడి ఏకైక పెద్దపార్టీగా రాగా 74 సీట్లతో బీజేపీ రెండోస్థానం పొందింది. ఈ సారి ఎన్డీయే 46.6 శాతం ఓట్లు తెచ్చుకుంటే ఎంజీబీ 37.9 శాతం ఓట్లు పొందింది, అంటే తేడా పదిశాతంపైనే ఉంది. కానీ సీట్ల తేడా చాలా పెరిగింది.202 సీట్లు ఎన్డీయేకు వస్తే ఎంజీబీకి 35 మాత్రమే వచ్చాయి. గతసారి ఒంటరిగా 30 చోట్ల పోటీ చేసి 5.7శాతం ఓట్లతెచ్చుకుని జేడీయూకు నష్టం కలిగించిన ఎల్‌జేపీ మళ్లీ అటే చేరింది. గతంలో మజ్లిస్‌తో కలసి పోటీ చేసిన ఉపేంద్ర కుశ్వారా రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) రాం మాంజీ హెచ్‌ఎఎం కూడా ఇటే కలిశాయి.
అటు నుంచి ఇటు వచ్చిన వికాశ్ శీల్ పార్టీకి సంబంధించిన 1.5శాతం ఓట్లు తగ్గినా పై కారణాల వల్ల ఎన్డీయే ఓట్లు పెరిగాయి. మొత్తంపైన 2020లో ఎంజీబీ వ్యతిరేక ఓట్లు ఎక్కువగా చీలిపోతే ఇప్పుడు అవే కలిశాయి. 2020లో 65 సీట్లలో ప్రత్యర్థుల ఓట్ల చీలిక వల్ల ఎంజీబీ గెలిచింది. ఇది ఎక్కువగా ఆర్జేడికి నష్టం చేసింది. 2020లో 61 సీట్లలో ఆ రెండు ప్రదాన పార్టీలు పోటీ పడితే ఆర్జేడి 40, జేడీయూ 21 గెలిచాయి. ఇప్పుడు 59 చోట్ల ఈ రెండు తలపడితే 50 జేడీయూ 9 మాత్రమే ఆర్జేడీ గెలిచాయి. ఈ కారణం గానే ఆర్జేడి ఓట్లశాతం ఎక్కువ వచ్చినా సీట్లలో దారుణంగా పడిపో యింది. దాని ఓటింగు పునాదిని మాత్రం నిలబెట్టు కుంది. కాంగ్రెస్ అతిగా అంచనా వేసుకుని రెండంకెలను అసలు చేరుకోలేక పోయింది. కనుకనే బీజేపీని ఓడించేం దుకు ప్రతిపక్షాలు మరింత కలసికట్టుగా పనిచేయవలసిన అవసరాన్ని బీహార్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకు భిన్నంగా బీజేపీనే సామదాన భేద దండోపాయాలతో చిన్న పార్టీలను కూడా వదలకుండా కలుపుకోవడం దానికి రాజకీయంగా ఎంత మేలు చేస్తున్నదీ ఈ వివరాలు చెబుతాయి.ఈ ఫలితాల తర్వాత బీమార్‌లో నిమో, ఏపీలో నమో అంటున్నారంటే కారణమదే.
పోరాడాల్సిందే
సహజంగానే ఈ ఫలితాల తర్వాత సర్‌పై పోరాటం వృథా కావడమే గాక తప్పుగా తేలిపోయిందని కొందరు వాదిస్తున్నారు. కానీ సక్రమమైన ఎన్నికల నిర్వహణ, నిష్పాక్షి కత ప్రజాస్వామ్యంలో మూలసూత్రం. సుప్రీంకోర్టు లోనూ రాజకీయంగానూ ఆపోరాటం తీవ్రం చేయడం అవసరం, స్రస్తుతం అది తెలుగు రాష్ట్రాల్లోనూ సర్ సన్నాహాలు మొదలైనాయి. జూబ్లీహిల్స్‌తో సహా ఉప ఎన్నికలను చూస్తే బీజేపీ ఏకపక్షంగా గెలిచిందేమీ లేదు. పైగా అక్కడ డిపాజిట్ కూడా కోల్పోయింది. కనుక లౌకిక వ్యవస్థ పరిరక్షణకోసం ప్రతిపక్షాల రాజ్యాంగ సంస్థలను, వ్యవస్థలనూ దుర్వినియో గం చేస్తున్న తీరుపై తప్పక సమైక్యంగా పోరాడవలసిందే. నిజానికి బీహార్ ఫలితం ఆ అవసరాన్ని మరింత పెంచడమే గాక మరింతగా హెచ్చరిక చేస్తుంది.
తెలకపల్లి రవి



