గ్రీన్‌లాండ్ వివాదంపై రష్యా
మాస్కో : గ్రీన్‌లాండ్ స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలతో తమకేమీ సంబంధం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. గ్రీన్‌లాండ్ వ్యవహారం తమకు సంబంధించింది కాదని అన్నారు. గ్రీన్‌లాండ్‌కు ఏం జరుగుతుందో తమకెందుకని రష్యా జాతీయ భద్రతా మండలి సమావేశం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే గ్రీన్‌లాండ్ పట్ల డెన్మార్క్ అవలంబించిన కఠిన వైఖరిని పుతిన్ ప్రశ్నించారు. ‘వాస్తవానికి గ్రీన్‌లాండ్‌ను ఓ కాలనీగా డెన్మార్క్ పరిగణించింది. అమానుషంగా కాకపోయినా కఠినంగా వ్యవహరించింది. కానీ అది వేరే సంగతి. దానిపై ఎవరికైనా ఆసక్తి ఉన్నదా అని నా అనుమానం. గ్రీన్‌లాండ్‌తో మాకేమీ సంబంధం లేదు. సమస్యను వారిలో వారే పరిష్కరించుకుంటారని అనుకుంటున్నాను’ అని చెప్పారు.
1867లో అమెరికాకు అలాస్కాను కేవలం 7.2 మిలియన్ డాలర్లకు విక్రయించామని, ఇప్పుడు దాని విలువ 158 మిలియన్ డాలర్లు అని పుతిన్ చెప్పారు. అలస్కాతో పోలిస్తే గ్రీన్‌లాండ్ విస్తీర్ణం కొంత ఎక్కువ ఉండవచ్చునని, అలస్కాను అమెరికా కొనుగోలు చేసిన సమయంలో గ్రీన్‌లాండ్ ధర 200 మిలియన్ డాలర్ల నుంచి 250 మిలియన్ డాలర్లు ఉండవచ్చునని తెలిపారు. కాగా గ్రీన్‌లాండ్ వ్యవహారంతో తమకేమీ సంబంధం లేదని పుతిన్ చెబుతుండగా ట్రంప్ వాదన మరోలా ఉంది. ఒకవేళ తాను గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోకపోతే చైనా, రష్యాల నుంచి దానికి ముప్పు ఉంటుందని ఆయన హెచ్చరించారు.



