గొంతులోని స్వరమే తేలుస్తది
అబద్ధమా నిబద్ధమా,బలమా భయమా!
మాటల్లోని శబ్దాలు డిజిటల్ సంకేతాలు
పట్టుకుంటే ఆ భాషణం ఒక ఫోనోగ్రాఫ్
పెదవులపై పదాల తడబాట్లు
కన్నుల్లోనూ అగుపించే అసత్య దశ్యం
గలగల గంభీర గొంతు
నిలువెత్తు మనిషి నిజాయితీ
మాటలోని మార్ధవం ఓ దిక్కారం
పలుకులోని కరకు ఒకానొక బెరుకు
పదం ఒక్కటే పలికే శబ్దంలో బేధం
పద పదాల్లోను స్పర్శించే దర్పం
మాట్లాడితే చాలు ఆ గొంతే చెప్పుతది
మనిషి లోపల దాగున్న మర్మ ధర్మం
నంగి నంగిన ధ్వనులే తెలిసిపోతయి
నరుడు కిందికి జారి పోయిండని
వంకర వంకర జవాబులే చెప్తయి
జర పెడసరం పెయ్యికి ఎక్కిందన
తీయ్యని ముచ్చట్లే తేలుస్తయి
హదయమెంత విశాల పావురమోనని
కొందరు కొస నాలిక నుంచే
తింటవా! తినే వచ్చినవా! అంటరు
మరి కొందరు గుండె లోపలి నుంచి
తిని పొమ్మని , తినే దాకా వదలరు
జ్వరం గొంతును ఎరుక పట్టొచ్చు
పడిశం గొంతునూ పశనతు పట్టొచ్చు
బాధాతప్త గొంతునూ గుర్తించవచ్చ
మాట్లాడితే చాలు మనసు తెలుస్తది
నోటి వాక్యాల వ్యాకరణం ఒకే తీరు
గొంతులోని స్వరాల మర్మం వేరు వేరు
- అన్నవరం దేవేందర్, 9440763479



