శిథిలావస్థలో మల్లారం పశువైద్యాశాల
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతులకు ప్రధానంగా వ్యవసాయంతో పాటు పాడిపశువుల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తారు.పశువుల పెంపకంతో ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో రైతుల ఆర్థికాభివృద్ధి చెందుతారు. కానీ రైతులు పెంపకం చేసే పశువులకు వ్యాధులు సోకితే చికిత్స అందించే పశువైద్యశాలలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో వైద్యం అందడం లేదు. ఉప కేంద్రాల్లో సిబ్బంది లేక పశువులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. మల్లారం పశువైద్యాశాల శిథిలావస్థకు చేరింది.తలుపులు,కిటికీలు విరిగిపోయాయి. సగం తలుపుకే సిబ్బంది తాళం వేస్తున్నారు. వర్షానికి కూలేందుకు సిద్ధంగా ఉంది. దీంతో సిబ్బంది భయం భయంగా విధులు నిర్వర్తిస్తున్నారు. వర్షా నికి ఉరుస్తూ.. మందులు తడిసిపోతున్నాయి. భవనం స్థానంలో మరొక భవనం నిర్మించాలని పశు పోశకులు కోరుతున్నారు. తాడిచెర్ల వైద్యశాల 2011లో నిర్మాణం చేయగా ఈ భవనం సైతం తలుపులు,కిటికీలు అస్తవ్యస్తంగా మారాయి.
పాడి పశువుల పెంపకం..
రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువుల పెం పకంపై దృష్టిసారిస్తున్నారు. గెదేలు, ఆవులు, మేక లు, గొర్రెల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తారు. తాడిచెర్ల ప్రాథమిక పశువైద్యశాల పరిధిలో మల్లారం,వళ్లెంకుంట గ్రామాల్లో ఉపకేంద్రాలు ఉన్నాయి. వళ్లెంకుంట గ్రామ రైతులు పశువులకు వ్యాధులు సోకితే అక్కడే వైద్యం పొందుతుంటే మల్లారం రైతులు ఉప కేంద్రానికి వెళ్లకుండా తాడిచెర్ల పశువైద్యశాలకు తీసుకు వచ్చి చికిత్స అందిస్తారు. కారణం ఉపకేంద్రం అస్తవ్యస్తంగా ఉండడంతో అక్కడ మందులు అంటుబాటులో లేకపోవడమే. ఇప్పటికైనా ఉన్నతాధి కారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మల్లారం ఉప పశువైద్యశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైతులు కోరుతున్నారు.
15 శాతం గాలికుంటు టీకా పూర్తి: అభిలాస్..మండల పశువైద్యాధికారి
మండలంలో మొత్తం 9,900 పశువులు ఉండగా ఇందులో తెల్ల పశువులు 2,900 ఉన్నాయి.బుధవారం నాటికి 1,490 పశువులకు,15 శాతం టీకా వేశాం. గొర్రెలు,మేకలు 38 వేలు ఉన్నాయి.మండల వ్యాప్తంగా ఒక జూనియర్ పశు వైద్యాధికారి, ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్స్,ఒక అటెండర్ పోస్టులు ఖాళీగా ఉండడంతో వైద్య సేవలు అందించడం ఇబ్బంది ఉందీ. ప్రస్తుతం ఒక అటెండర్,ఒక లైవ్ స్టాక్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. అయిన తుది గడువు వరకు 100 శాతం పశువులకు గాలికుంటు నివారణ టీకా వేస్తాం.
