మెస్, డైట్ చార్జీలు పెంచారా?
కొత్త భవనాలు నిర్మించారా?
బీఆర్‌ఎస్‌ది బురదచల్లే రాజకీయం : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ గురుకులాలకు చేసిందేంటి? మెస్, డైట్ చార్జీలు పెంచారా? మౌలిక వసతులు కల్పించారా? కొత్త భవనాలను నిర్మించారా? అని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్‌ఎస్ నేత ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదచల్లే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌తో సహా నాటి మంత్రు లెవరైనా గురుకులాలను సందర్శించారా? సంక్షేమ గురుకులాల్లో చదివే పిల్లలతో కలిసి భోజనం చేశారా? అని నిలదీశారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తామే రాజులం, మంత్రులం అన్నట్టు వ్యవహరించి గురుకులాలను, విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. గురుకులాలకు బీఆర్‌ఎస్ చేసిందేమి లేదని తెలిపారు. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేసే ముందు గురుకులాలకు బీఆర్‌ఎస్ చేసిందేమైనా ఉంటే చెప్పాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్థులు రోజుల తరబడి నిరసన తెలిపినా పట్టించుకోలేదని గుర్తుచేశారు.
ప్రగతిభవన్, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయంలో, జిల్లాల్లో కలెక్టరేట్ల సముదాయాల నిర్మాణాలకు ప్రాధాన్యమిచ్చారే గానీ గురుకులాల వైపు చూడలేదని తెలిపారు. గత ప్రభుత్వం సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ మంత్రులిద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉన్నా ఆ జిల్లాల్లో ఒక్క కొత్త భవనం నిర్మాణం చేయలేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గురుకులాలను సందర్శించారనీ, భోజనం చేశారనీ, సంక్షేమ విద్యార్థుల తక్షణ అవసరాలను తీర్చడానికి వీలుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.60 కోట్లు విడుదల చేశారని మంత్రి ధన్యవాదాలు తెలిపారు. నిధులు విడుదల చేయడం సీఎంకు సంక్షేమంపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మొటిక్ ఛార్జీలు పెంచి అదనంగా రూ.48,438.84 లక్షల భారం భరిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాచుపల్లి, గొల్లపల్లి (జగిత్యాల) ప్రాంతాల్లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. తమ పాలనలో ఇచ్చిన ప్రత్యేక శిక్షణతో 186 విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర సర్వీసులకు ఎంపికయ్యారని తెలిపారు.
స్పీడ్ రెస్పాన్స్-ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు
ప్రతి సొసైటీ సెక్రెటరీకి నిధుల వినియోగంపై పూర్తి అధికారం ఇచ్చినట్టు మంత్రి తెలిపారు. ”ఫాస్ట్ యాక్షన్ మెకానిజం” ఏర్పాటు చేసి, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకునే విధానం అమల్లోకి వస్తోందని చెప్పారు. హాస్టళ్లలో ఆహార నాణ్యత, మెడికల్ చెక్‌ప్‌లు, సానిటేషన్‌పై ప్రత్యేక పర్యవేక్షణ. ప్రతి వారం ఇన్‌స్పెక్షన్‌లు నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదికలు పంపేవిధంగా చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్య స్థితిని డిజిటల్‌గా మానిటర్ చేసే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటవుతోందన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి సొసైటీ స్థాయిలో పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ల సమన్వయంతో సొసైటీ స్థాయిలో చర్యలు తీసుకునే వీలు కలుగుతుందన్నారు.
సమిసిన వివాదం
కాంగ్రెస్ పార్టీ వందేళ్లు నిండిన పార్టీ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పార్టీలో అందరం అన్నదమ్ములమని ఆయన తెలిపారు. మంత్రుల మధ్య వివాదమేమి లేదనీ, అంతా సమిసిపోయిందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
బెస్ట్ అవైలబుల్ స్కీం అమలవుతున్న ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మానవత్వంతో ఆలోచించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకెళ్లి మొదటి దఫాలో ఈ నెల 20లోపు, మిగిలిన బిల్లులను ఈ నెల చివరిలోగా క్లియర్ చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.