Saturday, February 7, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఏం చేశారని ఓట్లడుగుతున్నారు?

ఏం చేశారని ఓట్లడుగుతున్నారు?

- Advertisement -

బీజేపీ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్న
మోడీ మూడుసార్లు ప్రధాని అయినా స్మార్ట్‌సిటీ కాలేదు
గల్లీలో మోరీ తీసేందుకు ఢిల్లీ నుంచి మోడీ రావాలా..!
బీజేపీ, బీఆర్‌ఎస్‌కు ఓట్లేస్తే మూసీలో వేసినట్టే..
కేసీఆర్‌ను అరెస్టు నుంచి కాపాడుతుంది కిషన్‌రెడ్డే
రేవంత్‌రెడ్డి మాదిగ.. రేవంతుద్దీన్‌ అన్నా స్వీకరిస్తా
నిజామాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
‘బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి. మూడుసార్లు మోడీ ప్రధాని అయినా నిజామాబాద్‌ను స్మార్ట్‌ సిటీ చేయలేకపోయారు. రాష్ట్రంలో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా మెట్రో విస్తరణకు, ఔటర్‌ రింగురోడ్డు విస్తరణకు, మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి నిధులు తీసుకు రాకుండా అడ్డుకుంటున్నారు. ఏం తెచ్చారని, ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారు.’ అని కేంద్ర మంత్రులను, బీజేపీ ఎంపీలను, బీజేపీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నిం చారు. ‘మున్సిపల్‌ మంత్రిగా నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాల్టీల అభివృద్ధికి రూ.1045 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం.

పదేండ్లు బీఆర్‌ఎస్‌కు, పన్నెండేండ్లు బీజేపీకి అధికారం ఇచ్చినా.. మున్సిపాల్టీలు మురికి కూపంగానే ఉన్నాయి. గల్లీల్లో మోరీలు తీయాలంటే ఢిల్లీ నుంచి మోడీని పిలవాలా..? ‘గాడిదకు గడ్డి వేసి ఆవు నుంచి పాలు పిండటం సబబా? బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఓట్లు వేసి అభివృద్ధి పనులు కాంగ్రెస్‌ చేయాలంటే సాధ్యమా..? ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. స్థానికంగా మనోడే ఉండాలే. నిజామాబాద్‌ కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాల్టీల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మోడీ వద్ద పరపతి ఉందని చెప్పుకునే ఎంపీ అరవింద్‌ నిజామాబాద్‌ను ఎందుకు స్మార్ట్‌ సిటీగా ఎంపిక చేయలేదని ప్రశ్నించారు. ఆయన వద్ద పరపతి లేదని అర్థమవుతోందని అన్నారు. నిజామాబాద్‌ ఔటర్‌రింగ్‌ రోడ్డుకు నిధులిస్తే తాము వద్దన్నామా..? అని ప్రశ్నించారు.

నిజామాబాద్‌ జిల్లాకు మంజూరైన మూడు ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లకు, తెలంగాణ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి.. మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బర్దిపూర్‌ శివారులో రూరల్‌ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ‘ప్రజాపాలన- ప్రగతిబాట’ బహిరంగసభలో ప్రసంగించారు. నిజామాబాద్‌ జిల్లాకు గొప్ప చరిత్ర ఉందని.. ఖిల్లా జైలు గోడల మీద దాశరథి ‘నా తెలంగాణ కోట రతనాల వీణ’ అని నినదించారని, ఇక్కడి రైతులు పోరాట పటిమ గలిగిన వారని, చైతన్యవంతులని, జిల్లా రైతుల వ్యవసాయం దేశానికే ఆదర్శమని అన్నారు. ఇక్కడి రైతుల పక్షాన పోరాటం చేయడంతో కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిలో పడి సీఎం అయ్యానని, తన మనుసులో నిజామాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్టు వెల్లడించారు. నిజామాబాద్‌ జిల్లాకు అత్యధిక నిధులు మంజూరు చేయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపారు.

కిషన్‌రెడ్డి ఎక్కడా..?
కాంగ్రెస్‌ హయాంలో కట్టిన ఎస్సారెస్పీ ఇప్పటికీ ధృడంగా ఉండి పంటలకు నీరందిస్తోందని, కానీ గోదావరి జలాల పేరుతో తెలంగాణను కొల్లగొట్టారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘కేసీఆర్‌, హరీశ్‌రావును జైలులో పెట్టి చిప్పకూడు తినిపించాలని ధర్మపురి అర్వింద్‌ అంటుంటా రని, కాళేశ్వరం బీఆర్‌ఎస్‌ పార్టీకి ఏటీఎంగా మారిందని, సీబీఐకి కేసు అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను అరెస్టు చేస్తామని పలికిన కిషన్‌రెడ్డి ఎక్కడ దాక్కున్నారని ముఖ్య మంత్రి ప్రశ్నించారు. సీబీఐకి ఇచ్చి ఆరు నెలలవుతున్నా అరెస్టు చేయనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. ఈ విషయంలో ధర్మపురి అర్వింద్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. శాసనసభలో చర్చ పెట్టి కాళేశ్వరాన్ని సీబీఐకి ఇచ్చాం…ఇప్పటి వరకు సీబీఐ పట్టించుకోలేదన్నారు. కిషన్‌రెడ్డి కేసీఆర్‌ను ఏ రకంగా కాపాడుతున్నాడో తెలియడం లేదా..? అని అన్నారు.

కేసీఆర్‌ దత్తపుత్రుడు.. కిషన్‌రావు
‘నీ పక్కన కూసున్న కిషన్‌రెడ్డి కేసీఆర్‌ను కాపాడుతున్నాడు. అసలు ఎందుకు కాపాడుతున్నాడో అడుగు. కల్వకుంట్ల కిషన్‌రావు అయ్యాడు. కేసీఆర్‌కు దొంగపుత్రుడు కేటీఆర్‌ ఉంటే.. దత్తపుత్రుడు ‘కిషన్‌రావు’ అని ఆయనను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలి’ అని సీఎం రామచంద్రారావుకు సూచించారు. 70 వేల ఉద్యోగాలు కల్పించామని, ఎల్‌బీ స్టేడియానికి వస్తే 70 వేల తలలు లెక్కపెట్టుకోవచ్చని హితవు పలికారు. గ్రూప్‌-1పై హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌కు చెంపపెట్టని అన్నారు. 562 మందికి నియామకపత్రాలు అందజేస్తామని తెలిపారు. మున్సిపాల్టీ ల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేద్దామని అన్నారు. 2029లో సీఎంగా నేను, పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రేవంత్‌రెడ్డి మాదిగ.. రేవంతుద్దీన్‌.. అన్నా స్వీకరిస్తా
‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నన్ను రేవంతుద్దీన్‌ అని సంభోదించారు. సంతోషమే. బ్రిటీష్‌ కాలం పరిపాలన అనంతరం వందేండ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా కులగణన చేపట్టి బీసీ జనాభా లెక్కలు తీస్తే టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నన్ను రేవంత్‌గౌడ్‌గా అభివర్ణిస్తే స్వీకరించా. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 100 రోజుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేపట్టి 40 ఏండ్ల సమస్యను పరిష్కరిస్తే.. మంత్రి దామోదర రాజనర్సింహ రేవంత్‌ మాదిగ అని పిలిస్తే సంతోషమనిపించింది.

30 ఏండ్లుగా కార్యకర్తగా పనిచేసిన వాకటి శ్రీహరికి ఎమ్మెల్యే, మంత్రి పదవి అప్పగిస్తే రేవంత్‌ ముదిరాజ్‌ అన్నారు. అనిల్‌కుమార్‌ యాదవ్‌ను రాజ్యసభకు పంపితే నన్ను రేవంత్‌ యాదవ్‌ అంటూ అక్కున చేర్చుకున్నారు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మిస్తానన్నందుకు నన్ను సర్దార్‌ రేవంత్‌సింగ్‌ అని సిక్కు సోదరులు పిలిచారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌లు కల్పించాం. సీటు త్యాగం చేసి ఓడి పోయిన షబ్బీర్‌అలీకి పదవి ఇచ్చా. అజారుద్దీన్‌ను మంత్రిని చేశా. కాబట్టి రేవంతుద్దీన్‌ అని పిలిచినా పర్వాలేదు. కులాలను, మతాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నా’ అని సీఎం వ్యాఖ్యానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -