హీరో శ్రీ రామ్ నటిస్తున్న సినిమా ‘యంగ్ అండ్ డైనమిక్’. మిథున ప్రియ హీరోయిన్. పి.రత్నమ్మ సమర్పణలో శ్రీరామ్ ప్రొడక్షన్ బ్యానర్ పై శ్రీరామరాజు, లక్ష్మణరావు నిర్మిస్తున్నారు. కిషోర్ శ్రీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై, ట్రైలర్‌ను ఆవిష్కరించచి, చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ అందించారు. దర్శకుడు కిషోర్ శ్రీ కృష్ణ మాట్లాడుతూ,’నా మొదటి సినిమా ‘మైండ్ గేమ్’. ఆ సినిమా హీరో శ్రీరామ్‌తోనే చేశాను. ఇప్పుడు దీన్ని ఆయనతోనే రూపొందిస్తున్నాను. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఒక రౌడీ ఊరిని ఎలా నియంత్రిస్తాడు. ఆ రౌడీ మంచివాడుగా మారితే ఊరికి కలిగే లాభమేంటి అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అని తెలిపారు. ‘మా సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ లాగే సినిమా కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది’ అని నిర్మాత శ్రీరామరాజు చెప్పారు. మరో నిర్మాత లక్ష్మణరావు మాట్లాడుతూ, ‘సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా నిర్మించాం. ఈ చిత్ర నిర్మాణంలో శ్రీరామ రాజుతో కలిసి భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది. హీరో శ్రీరామ్ ఆల్ రౌండ్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. ఇది కాకుండా మరో నాలుగు చిత్రాలు నిర్మిస్తున్నాం. శ్రీరామ్ హీరోగా నేను నిర్మించిన ‘మా రాముడు అందరివాడు’ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది’ అని తెలిపారు.