Friday, February 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఇరాన్‌పై అమెరికా దాడిచేస్తే..?

ఇరాన్‌పై అమెరికా దాడిచేస్తే..?

- Advertisement -

అమెరికా- ఇరాన్‌ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు రోజురోజుకూ జఠిలమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసన అణిచివేత, ఇరాన్‌ అణుకార్యక్రమాన్ని తగ్గించాలని ట్రంప్‌ ఇరాన్‌పై ఒత్తిడి పెంచారు. స్పందించకపోతే దాడి చేస్తామని కూడా హెచ్చరించారు. అయితే, ఇటీవల ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరఘ్చి మాట్లాడుతూ.. న్యాయపరమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ట్రంప్‌ డిమాండ్లను మాత్రం తాము ఒప్పుకోబోమని ప్రకటించారు. రక్షణ వ్యూహాలు, క్షిపణి వ్యవస్థలు ఎప్పటికీ చర్చల అంశం కావని చెప్పారు. ఇదిలాఉంటే ఇరాన్‌ ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయిల్‌ కారణమని మరోసారి ఇరాన్‌ అధ్యక్షుడు మసౌజ్పె జెష్కియన్‌ స్పష్టం చేశారు. ట్రంప్‌, నెతన్యాహు యూరప్‌లో ఆందోళనలను పెంచారని, తద్వారా ప్రజలను రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు. ఇరాన్‌ సైన్యాధ్యక్షుడు అమీర్‌ హతామి ‘గత పన్నెండు రోజుల యుద్ధం తర్వాత దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేశామని, భవిష్యత్‌ దాడులకు ఇరాన్‌ను దీటుగా సమాధానం చెబుతుందని’ మాట్లాడాడు.

ఈ అందరి వ్యాఖ్యల్నిబట్టి చూస్తే అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గల్ఫ్‌లో ఇరుకైన ముఖద్వారం హర్ముజ్‌ జలసంధి. ఇక్కడినుంచే ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు దారి. ఈ జలసంధిలో ఇరాన్‌, ఒమన్‌ దేశాలకు ప్రాదేశిక జలాలు ఉన్నప్పటికీ, దీన్ని అన్ని దేశాల నౌకలు ప్రయాణించగల అంతర్జాతీయ జలమార్గంగా పరిగణిస్తారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కూడా ఈ మార్గానికి సమీపంలోనే ఉంది.యుఎస్‌ ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌కు ఇదే చాలా కీలకమైన ప్రాంతం. ఇదే హర్ముజ్‌ జలసంధిలో ఇటీవల రెండు రోజుల లైవ్‌-ఫైర్‌ నావికా విన్యాసాలను ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌కు దగ్గరగా అమెరికా యుద్ధనౌకలు మోహరింపు, అమెరికా అధ్యక్షుడి హెచ్చరికల ప్రకటనలు యుద్ధానికి కాలుదువ్వినట్టుగానే కనిపిస్తున్నాయి. ఇరాన్‌ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా దాడి చేయొచ్చు! ఇరాన్‌, దాని ప్రాక్సీలు(హౌతీలు, హమాస్‌ సంస్థలు) అమెరికా స్థావరాలు, మిత్రదేశాలైన ఇజ్రాయిల్‌, గల్ఫ్‌ దేశాలపై ప్రతీకార దాడులుచేసే అవకాశాలూ లేకపోలేదు.

ఇరాన్‌ గనక హార్ముజ్‌ జలసంధిని మూసివేస్తే ప్రపంచ ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటమే కాదు, ప్రాంతీయ అస్థిరత నెలకొంటుంది. అది ప్రపంచంపై తీవ్ర ఆర్థికపరమైన ప్రభావం పడుతుంది. ఇంధన ధరల భారీ పెరుగుదల (ముడి చమురు), స్టాక్‌ మార్కెట్ల పతనం, హార్ముజ్‌ జలసంధిలో వాణిజ్య అంతరాయం కలిగించవచ్చు. చమురు, గ్యాస్‌ ఎగుమతులకు తీవ్ర ఆటంకం ఎదురుకావచ్చు. పశ్చిమాసియాలో అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగి, ప్రపంచ ఆహార, రవాణా రంగాలు దెబ్బతింటాయని నివేకలు హెచ్చరిస్తున్నాయి. మరోవైపు అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు మిడిల్‌ ఈస్ట్‌ దేశాలు గట్టిగానే కృషిచేస్తున్నాయని స్థానిక కథనాల సమాచారం. ప్రత్యక్ష చర్చలు లేనప్పటికీ ఖతార్‌, తుర్కియేతో సహా ఇతర మధ్యవర్తులుగా చర్చలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరగనుందో వేచిచూడాల్సిందే!

దివిటి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -