Sunday, October 19, 2025
E-PAPER
Homeజాతీయంఆర్థిక పురోభివృద్ధి ఏది?

ఆర్థిక పురోభివృద్ధి ఏది?

- Advertisement -

పథకాల కింద వచ్చిన నగదును విత్‌డ్రా చేసేందుకే ఉపయోగం
ఆ మొత్తం కూడా సొంత అవసరాలకే వాడుతున్న పరిస్థితి
మహిళకు లాభం చేకూర్చని బ్యాంక్‌ ఖాతాలు

దేశంలో 89 శాతం మంది మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు ఉన్నాయి. అయితే అవి వారికి అర్థవంతమైన ఆర్థిక నియంత్రణను అందించడం లేదు. సంపద సృష్టికి ఉపయోగపడడం లేదు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనమిక్‌ రిలేషన్స్‌ (ఐసీఆర్‌ఐఈఆర్‌)కు చెందిన పరిశోధకులు ‘ది హిందూ’ పత్రికలో ప్రచురించిన విశ్లేషణ ప్రకారం… ఆగస్టు నాటికి ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన పథకం కింద 56 కోట్ల బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. వీటిలో 55.7 శాతం ఖాతాలు మహిళలకు చెందినవే. అయితే డేటాను కూలంకషంగా పరిశీలించిన ప్రపంచబ్యాంక్‌ ఫిండెక్స్‌- సీఎంఎస్‌ టెలికం నివేదిక ఓ ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేసింది. బ్యాంక్‌ ఖాతా ఉన్న వారు దానిని ఆర్థిక పురోభివృద్ధికి ఉపయోగించుకోవడం లేదన్నది దాని సారాంశం.

న్యూఢిల్లీ : సంక్షేమ పథకాల నిమిత్తం తమ బ్యాంక్‌ ఖాతాల్లో పడిన మొత్తాన్ని వెనక్కి తీసుకోవడానికే ఎక్కువ మంది మహిళలు వాటిని ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్‌ యోజన పథకం కింద బీహార్‌ మహిళల ఖాతాల్లో పదివేల రూపాయల చొప్పున సీడ్‌ క్యాపిటల్‌ను ప్రభుత్వం జమ చేసింది. సీడ్‌ క్యాపిటల్‌ అంటే కొత్త వ్యాపారం లేదా స్టార్టప్‌ను ప్రారంభించడానికి అవసరమైన ప్రారంభ పెట్టుబడి. అయితే మహిళల్లో ఎక్కువ మంది ఆ మొత్తం బ్యాంక్‌ ఖాతాలో పడగానే దానిని సొంత అవసరాల కోసం వెనక్కి తీసేసుకుంటున్నారు తప్పించి ఎలాంటి వ్యాపారాన్నీ మొదలు పెట్టడం లేదు.

వాస్తవ పరిస్థితి ఎలా ఉందంటే…
బ్యాంక్‌ ఖాతాలు ఉన్న మహిళల్లో కేవలం 30 శాతం మందికి మాత్రమే డెబిట్‌ కార్డు ఉంది. ఖాతాలు కలిగిన మహిళల్లో 25 శాతం మంది నగదును పంపడానికి లేదా పొందడానికి ఈ ఖాతాలను ఉపయోగించుకుంటున్నారు. 21.2 శాతం మంది పొదుపు చేస్త్తున్నారు. డిజిటల్‌ చెల్లింపుల సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నది 7.8 శాతం మందే. మహిళల్లో 18.9 శాతం మంది మాత్రమే లావాదేవీల కోసం కార్డు లేదా మొబైల్‌ ఫోన్‌ ఉపయోగిస్తు న్నారు. ఇక బ్యాంక్‌ ఖాతాలు ఉన్న వారిలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. 11.9 శాతం మంది మాత్రమే బ్యాంక్‌ నుంచి రుణం పొందారు. వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా నిర్వహించడానికి రుణం తీసుకున్న వారు 9 శాతం మందే. విద్యుత్‌, నీరు, గ్యాస్‌, ఫోన్‌, ఇంటర్నెట్‌ వంటి ముఖ్యమైన సేవలు పొందినందుకు యుటిలిటీ బిల్లులు చెల్లిస్తున్న వారు 8.4 శాతం మంది మాత్రమే. ప్రతి ఐదు బ్యాంక్‌ ఖాతాల్లో ఒకటి…అంటే 17.5 శాతం ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగడం లేదు.

మొబైల్‌ ఉన్నా…
ఆధునిక బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు మొబైల్‌ ఫోన్‌ చాలా కీలకం. కానీ ఈ విషయంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రాథమిక డిజిటల్‌ సేవలు పొందడం కూడా వారికి సవాలుగానే ఉంది. మొబైల్‌ ఫోన్‌ ఉన్న మహిళల్లో 27 శాతం మంది మాత్రమే అకౌంట్‌లో బ్యాలెన్స్‌ను సరిచూసుకుంటున్నారు. 32శాతం మంది మహిళలకు వారి పేర్లపై సిమ్‌ కార్డులు ఉన్నాయి. అయితే కుటుంబంలోని పురుషుల సహాయం లేకుండా మొబైల్‌లో ఆర్థిక లావాదేవీలు జరుపుతున్న మహిళలు 28 శాతం మందే. చాలా మంది మహిళలకు వ్యక్తిగత మొబైల్‌ ఫోన్లు లేవు.

31 శాతం మంది తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి ఫోన్‌ను ఉపయోగించుకుంటున్నారు. 24 శాతం మంది పూర్తిగా ఇతరుల ఫోన్ల పైనే ఆధారపడుతున్నారు. మహిళలకు సొంత మొబైల్‌ ఫోన్లు లేకపోవడం వెనుక కన్పిస్తున్నవి ఆర్థిక, సామాజిక కారణాలే. మొబైల్‌ ఫోన్‌ను ఉపయోగించడం ఖర్చుతో కూడిన పని అని 38శాతం మంది మహిళలు భావిస్తుండగా 32శాతం మందికి వాటిని కొనే స్తోమత ఉండడంలేదు. ధర విషయం అలా ఉంచితే చదవడం, టైపు చేయడం కష్టంగా ఉంటోందని 27 శాతం మంది చెప్పారు. వ్యక్తిగత భద్రత విషయంలో ఆందో ళన కారణంగా ఫోన్‌ కొనలేదని 18 శాతం మంది తెలిపారు.

ఏం చేయాలంటే…
కేవలం బ్యాంక్‌ ఖాతాను తెరిచినంత మాత్రాన మహిళలు సవాళ్లను అధిగమించలేరని పరిశోధకులు వివరించారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన పితృస్వామ్యం, ఆర్థిక నిర్వహణ సామర్ధ్యం తక్కువగా ఉండడం వంటి ప్రధాన అడ్డంకుల కారణంగా మహిళలు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. మహిళల ఆస్తి హక్కులను బలోపేతం చేయడం, భూమిపై వారికి ఉమ్మడి యాజమాన్య హక్కులు కల్పించడం వంటి చర్యల ద్వారా వారు సులభంగా రుణాలు పొందగలుగుతారు. మహిళా బ్యాంకింగ్‌ ఏజెంట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ప్రస్తుతం దేశంలోని 13 లక్షల బిజినెస్‌ కరస్పాండెంట్లలో మహిళలు 10 శాతం కంటే తక్కువగానే ఉన్నారు. బ్యాంక్‌ ఖాతాలు, నగదు బదిలీలు మహిళలకు నిజమైన సాధికారత కల్పించాలంటే డిజిటల్‌ లావాదేవీలు, ఆర్థిక నిర్వహణ, సామాజిక నిబంధనలు వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని నివేదిక సూచించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -