Sunday, May 25, 2025
Homeజాతీయంబస్తర్‌లోఏం జరుగుతోంది?

బస్తర్‌లోఏం జరుగుతోంది?

- Advertisement -

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాల అడుగులు
మాజీ మావోయిస్టుల సాయంతో దుర్బేధ్యమైన అడవుల్లో గాలింపు
ప్రాణాలు కోల్పోతున్న అమాయక ఆదివాసీలు
ఖనిజ సంపద కార్పొరేట్లకు కట్టబెట్టేందుకేనని విమర్శలున

దేశంలో సుసంపన్నమైన ఖనిజ సంపదకు పెట్టింది పేరైన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతంలో సాయుధ తిరుగుబాట్లను తుడిచిపెట్టడమే లక్ష్యంగా భద్రతా దళాలు మావోయిస్టులపై పూర్తి స్థాయి యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలలో విస్తరించిన కర్రెగుట్ట అటవీ ప్రాంతం ఇప్పుడు వార్‌జోన్‌గా మారిపోయింది. పది వేల మందికిపైగా సైనికులు ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టులను ఏరివేసే పనిలో నిమగమయ్యారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ (ఛత్తీస్‌గఢ్‌) అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకూ కనీసం 201 మంది మావోయిస్టులను హతమార్చింది.
రాయ్ పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) : ఛత్తీస్‌గఢ్‌లోని నారా యణపూర్‌లో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు దళపతి నంబాల కేశవరావు సహా 27 మంది హతమయ్యారు. ఆదివాసీలు గణనీయ సంఖ్యలో నివసిస్తున్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గడిచిన 16నెలల కాలంలో 400 మందికిపైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారు. అయితే వీరిలో ఎక్కువ మంది అమాయక ఆదివాసీలేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దశాబ్దాల తరబడి నలుగుతున్న సమస్యకు పరిష్కారం సాధించడానికి కాల్పుల విరమణ పాటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు మేధావులు, ప్రతిపక్ష నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మావోయిస్టులు సైతం చర్చల ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. అయినప్పటికీ దీనిని కేంద్రం ఏ మాత్రం పట్టించుకోకుండా ఆపరేషన్‌ కగార్‌ను కొనసాగిస్తోంది. మావోయిస్టుల విషయంలో ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి శాంతి స్థాపనకు దోహదపడుతుందా లేక ఇప్పటికే దేశంలో అత్యంత అణగారిన వర్గాలలో ఒకటిగా ఉన్న ఆదివాసీలను మరింత వంచిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.
ఆ అడవిలో అపార సంపద
పదివేల మందికిపైగా కేంద్ర బలగాలతో సాగుతున్న తాజా ఆపరేషన్‌ ఛత్తీస్‌గఢ్‌లో ఖనిజ సంపదకు పెట్టింది పేరైన బస్తర్‌ అటవీ ప్రాంతం చుట్టూ కేంద్రీకృతమైంది. దీని విస్తీర్ణం 38,932 చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపుగా అమెరికాలోని కెంటుకీ పరిమాణంలో ఉంటుంది. ఒక్క బస్తర్‌లోనే ప్రభుత్వం 320 భద్రతా శిబిరాలను ఏర్పాటు చేసింది. బస్తర్‌లో 30 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. భద్రతా శిబిరాలలో సిబ్బంది సంఖ్య అవసరాలను బట్టి మారుతూ ఉంటుంది. ఒక్కో శిబిరంలో కనిష్టంగా 150 మంది, గరిష్టంగా 1,200 మంది సిబ్బంది ఉంటారు. మావోయిస్టులపై జరిగే ఆపరేషన్‌లో సాయపడ డానికి శిబి రాలలో తరచుగా నిఘా, కమ్యూనికేషన్‌ పరికరాలను ఏర్పాటు చేస్తుంటారు. బస్తర్‌లో జరుగుతున్న మావోయిస్టుల ఏరివేత చర్యలలో 20 వేల మంది స్థానిక పోలీసులు కూడా భాగస్వాములు అవుతుంటారు. అత్యంత శక్తివంతమైన కెమెరాలను, థర్మల్‌ ఇమేజింగ్‌ సెన్సార్లతో కూడిన అధునాతన డ్రోన్లను, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుండడంతో దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను పసిగట్టడం సులభమవుతోంది.
బూటకపు ఎన్‌కౌంటర్లు…చట్టవిరుద్ధ హత్యలు
2000వ దశకంలో ఖనిజ సంపద కలిగిన గిరిజన ప్రాంతాలలో సుమారు మూడింట ఒక వంతు ప్రాంతం నక్సల్స్‌ నియంత్రణలో ఉండేది. దీనినే రెడ్‌ కారిడార్‌ అంటారు. ఇది ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌, మహారాష్ట్రల్లో విస్తరించి ఉంది. అయితే మావోయిస్టుల ప్రభావం క్రమేపీ తగ్గిపోవడం మొదలైంది. 2013లో 126 జిల్లాలలో వీరి ప్రభావం కన్పించగా గత సంవత్సరం ఏప్రిల్‌ నాటికి వాటి సంఖ్య 38కి తగ్గిపోయింది. మావోయిస్టులపై జరుపుతున్న సైనిక దాడుల్లో విజయం సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటుండగా భద్రతా దళాలు బూటకపు ఎన్‌కౌంటర్లు, చట్టవిరుద్ధ హత్యలు చేస్తున్నాయని పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) వంటి మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత ఏడాది నుండి బస్తర్‌లో హింస, మానవ హక్కుల ఉల్లంఘనలు, సైనికీకరణ బాగా పెరిగాయని అవి చెబుతున్నాయి. బూటకపు ఎన్‌కౌంటర్లలో అమాయకులైన గిరిజనులను పొట్టనపెట్టుకుంటు న్నారని ఆందోళన వ్యక్తం చేశాయి. గడిచిన సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రంలో 11బూటకపు ఎన్‌కౌంటర్లు జరిగాయని పీయూసీఎల్‌ తెలిపింది. మార్చి 25న బస్తర్‌కు 160 కిలోమీటర్ల దూరంలోని బీజాపూర్‌ జిల్లాలోని ఓ గ్రామంలో మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చామని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు రాత్రి వేళ గ్రామాన్ని చుట్టుముట్టి 17 మందిని తీసికెళ్లారని, వారిలో ఏడుగురిని విడిచిపెట్టి ముగ్గురిని కాల్చి చంపారని, మిగిలిన వారిని వారి వద్దే ఉంచుకున్నారని గ్రామస్థులు ఆరోపించారు.
బీజేపీ పాలనలోనే…
ఛత్తీస్‌గఢ్‌లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల విషయంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. 2020-2023 మధ్య కాలంలో కాంగ్రెస్‌ హయాంలో 141 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2024లోనే 223 మంది మావోయిస్టులను మట్టుబెట్టామని భద్రతాదళాలు ప్రకటించాయి. గత పదిహేను నెలలుగా భద్రతా దళాలు నక్సల్స్‌తో పోరాటం చేస్తున్నాయని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ శాయి తెలిపారు. నక్సలిజం నుంచి భారత్‌కు విముక్తి కల్పించడానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌ షా కృతనిశ్చయంతో ఉన్నారని, ఆ దిశగా ఇప్పుడు నిర్ణయాత్మక దశకు చేరుకున్నామని, మరింత వేగంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలోని అనుమానిత మావోయిస్టు స్థావరాలను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఈ ఆపరేషన్‌లో సైనిక హెలికాప్టర్లు వారికి సాయపడుతున్నాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో పారామిలటరీ, ప్రత్యేక దళాలు సహా 66,000 మంది భద్రతా సిబ్బంది మోహరించి ఉన్నారు. వీరిలో సుశిక్షితులైన కమాండోలు కూడా ఉన్నారు.
సహజ వనరుల దోపిడీని అడ్డుకుంటున్నందుకే…
ఏదేమైనా మావోయిస్టుల ప్రభావం క్రమేపీ తగ్గి పోతోంది. నియామకాలు జరగడం లేదు. ఆయుధ నిల్వలు కూడా అడుగంటి పోతున్నాయి. 40 మంది కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో సభ్యుల్లో ఇప్పుడు 18 మంది మాత్రమే మిగిలారు. మిగిలిన వారు చనిపోవడమో లేదా అరెస్ట్‌ కావడమో జరిగింది. అదే సమయంలో భద్రతా దళాల విస్తరణ జరిగింది. కొత్త శిబిరాలు నిర్మితమయ్యాయి. నిఘా, శిక్షణ మెరుగయ్యాయి. పలు ప్రాంతాలపై మావోయిస్టుల పట్టు సడలిపోతోంది. సహజ వనరుల దోపిడీని అడ్డుకోవడమే తమ ఉద్యమ లక్ష్యమని మావోయిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా బడా కార్పొరేట్‌ శక్తులకు మైనింగ్‌ లీజులు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల స్థానిక గిరిజనులు నిరాశ్రయులవుతున్నారని వారు వాదిస్తున్నారు. బస్తర్‌ ప్రాంతంలో 51 ఖనిజ లీజులు ఉండగా వాటిలో 36 ప్రయివేటు సంస్థలకే కట్టబెట్టారు.
ప్రత్యేక పోలీస్‌ అధికారులుగా ఆదివాసీలు
గత 25 సంవత్సరాల కాలంలో బస్తర్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. కానీ కేవలం రెండింటి పైన మాత్రమే న్యాయ విచారణ జరిగింది. మైనింగ్‌ ప్రాజెక్టులు, సైనికీకరణకు వ్యతిరేకంగా శాంతియుతంగా జరిగిన నిరసనలను కూడా తీవ్రంగా ణచిచేశారు. ఇటీవలి కాలంలో గిరిజనులను(వీరిలో చాలా మంది మాజీ మావోయిస్టులు)ప్రభుత్వం దళాలలో నియమించుకుంటోంది. వారిని మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలో వినియోగించుకుంటోంది. ఎందుకంటే దుర్బేధ్యమైన అటవీ ప్రాంతాల ఆనుపానులన్నీ వారికి తెలుసు. మావోయిస్టుల స్థావరాలను కూడా వారు గుర్తించగలరు. అయితే ఆదివాసీలను ప్రత్యేక పోలీసు అధికారులుగా తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -