అమెరికా ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్స్‌ను ముంచగలమన్న ఖమేనీ
సుప్రీంలీడర్ వ్యాఖ్యలతో ఆ దేశ ఆయుధ సామర్థ్యాలపై చర్చ
టెహ్రాన్ : అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయన్న పలు కథనాలూ వెలువడుతున్నాయి. అటు అమెరికా కూడా యుద్ధ నౌకల మోహరింపును జరపుతోంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎయిర్ క్యారియర్‌లను సముద్రంలో ముంచగల సామర్థ్యం తమకు ఉన్నదని హెచ్చరించారు. అయితే తమ వద్ద ఉన్న ఆ బలమైన ఆయుధాలు ఏమిటో ఆయన తెలపకపోయినప్పటికీ.. హైపర్‌సోనిక్ క్షిపణుల నుంచి యాంటీ-షిప్ క్రూయిజ్ మిసైళ్ల వరకు ఇరాన్ ఆయుధ సామర్థ్యాలపై చర్చ నడుస్తున్నది. అమెరికా నౌకాదళం యూఎస్‌ఎస్ అక్రబహం లింకన్, యూఎస్‌ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్ట్‌లను ఇరాన్ సమీప ప్రాంతాలకు మోహరించింది. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన హెచ్చరికలు చర్చనీయాంశంగా మారాయి.
యాంటీ-షిప్ క్రూయిజ్ మిసైళ్ల భారీ నిల్వ
హైపర్‌సోనిక్ క్షిపణులు అత్యాధునికమైనవైనా.. ఇరాన్ సముద్ర నిరోధక వ్యూహంలో ప్రధాన బలం యాంటీ-షిప్ క్రూయిజ్ మిసైళ్లు (ఏఎస్‌సీఎంలు). అంచనా ప్రకారం.. ఇవి ఇరాన్ వద్ద 1000-1200 వరకు ఉండవచ్చని పలు విశ్లేషణలు చెప్తున్నాయి. ఇందులో నూర్ (పరిధి : 120-170 కిలోమీటర్లు), ఖదర్ (ఘదర్) (200 కిలోమీటర్ల వరకు), ఘదీర్ (300 కిలోమీటర్ల వరకు, సముద్ర ఉపరితలానికి దగ్గరగా ప్రయాణించే సామర్థ్యం), నాసర్ (నాసర్-1 లేదా నాసర్-ఎ-బషీర్, 25-35 కిలోమీటర్ల పరిధి), రాడ్ (350 కిలోమీటర్ల రేంజ్), అబూ మహిది (వెయ్యి కిలోమీటర్ల వరకు దూర లక్ష్యాలను చేధించే సామర్థ్యం) వంటివి ఉన్నాయి. ఇవి పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ జలసంధి ప్రాంతాల్లో ‘ఏరియా డినయల్’ వ్యూహంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెప్తున్నారు.
అమెరికా రక్షణ సామర్థ్యమూ బలంగానే..!
అమెరికా క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ వద్ద అత్యాధునిక గగనతల, క్షిపణి నిరోధక వ్యవస్థలు ఉన్నాయి. రెడ్‌సీ సంక్షోభ సమయంలో అమెరికా నౌకలు, డ్రోన్లు, క్షిపణి దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన ఉదాహరణలు ఉన్నాయి. ఇరాన్ వద్ద సముద్ర గనులు, టార్పెడోలు, మానవరహిత వాహనాలు కూడా ఉన్నప్పటికీ.. అవి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా నౌకాదళంపై ఎంత వరకు ప్రభావం చూపగలవన్నది స్పష్టత లేదని నిపుణులు వివరిస్తున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. సైనిక హెచ్చరికలు, అణుచర్చలు సమాంతరంగా కొనసాగుతున్నాయి. పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుందా? లేక చర్చల ద్వారానే పరిష్కారం దిశగా వెళ్తుందా? అన్నది వేచి చూడాల్సిందేనని పరిశీలకులు చెప్తున్నారు.
ప్రధాన ఆయుధం హైపర్‌సోనిక్ క్షిపణులేనా?
ఇరాన్ వద్ద శక్తివంతమైన ఆయుధంగా భావించబడుతున్నది ఫత్తాహ్ శ్రేణి హైపర్‌సోనిక్ క్షిపణులు. ఇది సుమారు 1400 కిలోమీటర్ల పరిధిలో గల లక్ష్యాలను ఛేదించగలదు. ఫత్తాహ్-2 హైపర్‌సోనిక్ గ్లైడ్ వాహనం (హెచ్‌జీవీ) సాంకేతికతతో మరింత మార్గ మార్పు సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఈ క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా రూపకల్పన చేసినట్టు ఇరాన్ ప్రకటిస్తోంది. 2024లో ఇజ్రాయిల్‌పై జరిగిన దాడుల్లో ఈ శ్రేణి క్షిపణులు ఉపయోగించినట్టు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి.



