ప్రియమైన వేణు గీతికకు
నాన్న.. ఎలా ఉన్నావు? మీ కొలీగ్ వాళ్ళ నాన్న గారు పోయారు అని చెప్పావు. చాలా బాధ కలిగింది. మేము వచ్చినప్పుడు పలకరించి పెళ్లికి తప్పకుండా రండి ఆంటి అంది.. పెళ్లి కుదిరింది అనే సంతోషం ఒక వైపు, నాన్న పోయారనే బాధ మరొకవైపు తన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించు. తనకు తోడుగా ఉండు. ధైర్యం చెప్పు. నాన్న నీకు కిందటి సారి సహజీవనం గురించి చెప్పాను. ఇప్పుడు పెళ్లి గురించి చెప్తాను.
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన అంశం. జీవిత భాగస్వామి అంటారు. అంటే నీ జీవితంలో ఒక భాగం. ఒక కుటుంబాన్ని ముందుకు నడపడానికి పెళ్లి అనేది కావాలి. ఇక్కడ సహకారాలు ఉండాలి తప్ప, అహంకారాలు కాదు. భార్య భర్తల మధ్య నమ్మకం ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి ప్రేమ, ఆప్యాయత ఉండాలి. కష్ట, సుఖాల్లో ఒకరికి ఒకరు అండగా ఉండాలి. ఇష్టాలు, అయిష్టాలు తెలుసుకుని, కొన్ని విషయాల్లో ఇద్దరు సర్దుకుపోతూ ఉండాలి. నాన్న.. పెళ్లి అంటే అమ్మాయి, అబ్బాయి ఒక్కటవ్వడం మాత్రమే కాదు, రెండు కుటుంబాల కలయిక. పెళ్లి వలన బాధ్యతలు తెలియడమే కాక పెరుగుతాయి కూడా. కుటుంబ వ్యవస్థ బాగుపడాలి అంటే పెళ్లి ఎంతో అవసరం.
నేడు పెళ్లి అనే పదానికి విలువ లేకుండా పోయింది. వివాహం ఎంత గొప్పదో తెలుసుకోవడం లేదు. పెళ్లిని కూడా వ్యాపార ధోరణిలో చూస్తున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉంటున్నారు. కొన్నేండ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే వారికంటూ ఎవరూ ఉండరు. కాబట్టి ఆడపిల్లలకు 25 ఏండ్లు రాగానే పెళ్లి చేసేయాలి. కెరియర్ అనేది నెమ్మదిగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇందులో నువ్వు, నేను అనేది కాకుండా మనం అనే భావం ఉండాలి. నువ్వు కూడా నేను చెప్పే విషయాలపై దృష్టి పెట్టు.ఎంత త్వరగా జీవితంలో స్థిరపడితే అందరికి అంత మంచిది.పెళ్లి అంటే బాధ్యతలు కదమ్మ అన్నావు,బాధ్యత అనేది తెలుకున్ననాడు వాటిని సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేయాలి. నువ్వు అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలవు అనే నమ్మకం నాకుంది. ఉంటాను నాన్న… జాగ్రత్తా…
ప్రేమతో అమ్మ
పాలపర్తి సంధ్యారాణి



