సనాతనం పేరుతో సమాజంలో జరుగు తున్న అఘాయిత్యాలకు లెక్కలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకులు, ఒకరిని మించి ఒకరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతు న్నారు. ప్రజలకు ఏమి సందేశమిస్తున్నారో కూడా వారు తెలుసుకోవడం లేదు. వైదిక మతం గుప్పిట్లో సమాజం పూర్తిగా విలువలు కోల్పోయింది. వాళ్లు చెప్పే పురాణాలు, గాథలు, సంప్రదాయ కీర్తనలు, భక్తి, మూఢత్వం సమాజాన్ని భ్రష్టుపట్టించాయి. ఇంతకీ సనాతనంలో ఏముందీ? అంటే, అందులో అసమానత ఉంది. నిజాయితీ, నైతికతలు లేవు. బ్రాహ్మణిజమనే కాదు, మతాలేవైనా సరే, మనుషుల సమాన స్థాయి గురించి మాట్లాడవు. అయినప్పుడు మతాలు ఇంకా అవసరమా? అనేది ఆలోచించుకోవాలి కదా?
సనాతన ధర్మం ప్రకారం – మగపిల్లవాడు పుట్టడానికి పుత్ర కామేష్టి యాగం చేయాలి. శత్రువులను చంపడానికి శత్రుసంహార మంత్రం ఉండనే ఉంది. అమ్మాయిలను ఆకర్షించి వశపరుచుకోవడానికి వశీకరణ మంత్రముంటే – లక్ష్మీ దేవిని వశం చేసుకుని డబ్బు సంపాదించేందుకు లక్ష్మీ మంత్రం ఉపయోగించాలి. వర్షాలకు వరణయాగం! అలాగే విజయానికి, ఆరోగ్యానికి, పెండ్లికి, చావుకీ అన్నింటికీ మంత్రాలే! మరి కష్టపడేది ఎప్పుడూ? కష్ట పడకుండా, చెమట చిందకుండా, కూచుని పొట్ట పోసుకోవడానికి- ఒక వర్గం వీటిని సృష్టించి, తమ జీవనాధారం తాము చూసుకున్నారు. ఇవన్నీ సనాతనవాదుల బోధనలు జీర్ణించుకున్న, నేటి ఆధునికులు కూడా అనుసరిస్తున్నవి! నిజానికి ఏ మంత్రం వల్లా ఏ ఉపయోగమూ ఉండదు. కాయకష్టం చేసి గానీ, స్వంత తెలివిని ఉపయోగించుకుని గానీ, భవిష్యత్తుకు దారులు వేసుకోవాల్సి ఉంటుంది.
సనాతన ధర్మం పేరుతో మనువాదులు చెప్పుకునే గొప్పలు ఎలా ఉంటాయో మనకు తెలుసుకదా? ఉదాహరణకు-వినాయకుడి తొండం ప్లాస్టిక్ సర్జరీ అంటారు. శివుడు గొప్ప పర్యావరణవేత్త అని చెప్తారు. సీతాదేవి టెస్ట్ ట్యూబ్ బేబి అని, (పుష్పక) విమానాలు రామా యణ కాలం నాటికే ఉన్నాయనీ, శ్రీలంక వారధి కోతులు కట్టిందేనని చెప్పుకుంటారు. అంతేకాదు ఇంటర్నెట్ సౌకర్యం భారత కాలానికే ఉందని సంజయుడు భారత యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాడన్న – కోతలు కోస్తారు. విచారించవల్సిన విషయమేమంటే – చదువుకున్న మూర్ఖులే ఇలాంటి వివరణలు ఇస్తున్నారు. సామాన్య పౌరులు తమ వ్యాఖ్యల్ని ఎలా స్వీకరిస్తున్నారోనన్న స్పృహ కూడా వీరికి ఉండదు. ఎంత చదువురాని వారికైనా, ఇంతో అంతో ఇంగిత జ్ఞానం, ఆలోచనా శక్తి ఉంటాయన్నది కూడా వీరు తెలుసుకోరు.
ఈ ప్రపంచంలోని సృష్టి సమస్తం, ఆ భగవంతుడిదే-అని విశ్వసించే సనాతన వాదులు, కరోనా మాత్రం చైనా సృష్టి అని ఎందుకు చెపుతున్నట్లూ? అంటే వారి వాదనల్లోని విషయాల మీద వారికే నమ్మకం లేదని తెలుస్తూనే ఉంది కదా? దేశభక్తి పేటెంట్ తమదే అయినట్టు గొంతు చించుకునే ఆరెస్సెస్, బీజేపీ నేతలూ, కార్యకర్తలు ఏరీ ఎక్కడా? వరద బాధితులను ఆదుకోవడానికి ఒక్కరైనా కనబడరెందుకూ? వారు విశ్వసించే వారి ధర్మ పరిరక్షకుడైనా వచ్చి ఏ సహాయమూ చేయడెందుకూ? దేశంలో ఓ చోట క్లౌడ్‌బస్ట్ అయ్యి వరదలొస్తున్నాయి. మరోచోట కొండ రాళ్లు విరిగి పడి జనం చచ్చిపోతున్నారు. గుజరాత్‌లోనే బోయింగ్ విమానం మెడికల్ హాస్టల్ మీద కూలి, వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రంలోనే వంతెన కూడా కూలింది. ఆ పార్టీ కార్యకర్తలు ఒక్కరైనా ఆయా చోట్ల కనబడలేదు.
బాధ్యత గల మంత్రులెవరూ రాజీనామా చేయరు సరికదా, దేశ పౌరులకు క్షమాపణలు కూడా చెప్పుకోరు. తమది మోడల్ రామరాజ్యమని ధీమాగా ఉన్నారేమో? సనాతన ధర్మానికి కొందరు అధికారిక ప్రవక్తలుంటారు. వారు తమ వేషభాషలు మార్చుకుని, సామాన్యుల కన్నా ఉన్నతులమన్నట్టు ప్రవర్తిస్తుంటారు. నుదుటిమీద, భుజాలమీద గుర్తులు పెట్టుకుని, విచిత్రమైన భాష మాట్లాడుతుంటారు. తాము అధికులమనే భావన కలిగించడానికి నానా తంటాలు పడుతుంటారు. ఉదాహరణకు స్వాములుగా మారినవారు పెట్టుకునే పేర్లు గమనించండి. తమ పాతపేర్లను త్యజించి, సన్యాసి అని తెలిసే విధంగా కొత్త పేరు స్వీకరిస్తారు. దాన్నే ‘యోగ పట్టం’ అని అంటారు. ఈ యోగ పట్టం పది రకాలుగా ఉండొచ్చని శంకరాచార్య నిర్దేశించారు- అవి: తీర్ధ, గిరి, పురి, ఆశ్రమ వన, భారతి, సరస్వతి, అరణ్య, పర్వత్ సాగర-వంటివి. అందుకే చూడండి మనకు నృసింహభారతి, ఆనంద తీర్థ, చంద్రశేఖర సరస్వతి, విద్యారణ్య వంటి పేర్లు కనబడుతుంటాయి.
సనాతన ధర్మం యొక్క పాశస్త్యం తెలుసుకుందామని ఎవరైనా పొరపాటున పురాణాల్లోకి తొంగిచూస్తే, అక్కడ వారికి ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. కారణం అందులో అనైతిక అంశాలు కోకొల్లలుగా ఉంటాయి. మచ్చుకి కొన్ని మాత్రమే చూపెడుతున్నాను. చంద్రుడు చదువు నేర్చుకోవడానికి గురువు దగ్గరికి వెళతాడు. అక్కడ గురువు భార్య తార కనిపిస్తుంది. అంతే! చంద్రుడు ఆమెతో సంబంధం పెట్టుకుని, బుధుడు అనే కొడుకును కంటారు. బృహస్పతికి రుచికుడు అనే అన్న ఉంటాడు. ఆయనకు మమత అనే భార్య ఉంటుంది. బృహస్పతి అన్న భార్య మమతతో జతకడతాడు. ఆకుతీరుచి ప్రజాపతికి ఇద్దరు పిల్లలుంటారు. యక్షుడనే మగపిల్లవాడు, సుదక్షిణ అనే ఆడపిల్ల! ఈ ఇద్దరు అన్నా చెల్లెళ్లు పెరిగి పెద్దవారై పెండ్లి చేసుకుని భార్యాభర్తలవుతారు. ఇక సుదర్శనుడనేవాడు స్వంత మనుమరాలితో పిల్లల్ని కంటాడు. సమకాలీన సమాజంలో కూడా ఇలాంటి వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలు వింటుంటాం కదా? అంటే ఏమిటీ? పునరావృతమౌతున్న పురాణ సంస్కృతి – అన్నమాట? ఘనమైన సనాతన ధర్మాన్ని ఇంకా కొందరు నిలబెడదామని ప్రయత్నిస్తున్నారన్నమాట! అయితే ఇలాంటి వారికి కఠినమైన శిక్షలెందుకు పడుతున్నాయో – సంప్రదాయ వాదులే చెప్పాలి.
అక్రమ సంబంధాల వల్ల పుట్టిన వారికి పురాణ రచయితలు మంచి మంచి బిరుదులు కూడా ఇచ్చారు. 1. కానీనుడు: పెండ్లి కాక ముందే అక్రమంగా పుట్టినవాడు 2.గూఢత్పాన్నుడు: గూఢంగా అంటే రహస్యంగా పుట్టిన వాడు, భర్తకు తెలియకుండా అక్రమ సంబంధంతో పుట్టినవాడు 3.క్షేత్రజుడు: భర్త అనుమతితోనే అక్రమ సంబంధానికి పుట్టినవాడు. ఇలా మనకు పన్నెండు రకాల పుత్రులు కనిపిస్తారు. వారినందరినీ కలిపి ద్వాదశ పుత్రులు అని అన్నారు (దశ-పదిబీ ద్వా-రెండు మొత్తం పన్నెండు రకాలు) ఆడ-మగ భేదం తప్ప ఇందులో వావి వరుసలు లేవు. ఆనాటి పురాణ రచయితలు ఇవి రాశారంటే అర్ధం చేసుకోవచ్చు. అది అనాగరిక సమాజం. వారికి సైన్సు, చరిత్ర, లోక జ్ఞానం వంటివి ఏవీ తెలియవు. ఆ కాలానికి వాళ్లు అలా రాసుకున్నారని పరిణతి చెందిన ఆధునికులు అర్థం చేసుకోవాలే తప్ప – అవి గొప్ప రచనలనీ, వాటిని ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలనీ చెప్పే మూర్ఖ సనాతనవాదులను ఏమందాం?
ముఖం నుండి పుట్టినవాడు ఎంతటి మూర్ఖుడయినా, అతను అస్పృశ్యుడు కాడు. పాదాల నుండి పుట్టిన వాడు ఎంతటి విద్వాంసుడైనా అతను అస్పృశ్యుడే!- ఇదే బ్రాహ్మనిజం సూక్తి. సనాతన ధర్మాన్ని విశ్వాసంచే వారి సిద్ధాంతాలు ఇలాగే ఉంటాయి. ఇవి నేటి యువతరానికి నచ్చవు – ఆయినా, ముఖం నుండి, పాదాల నుండి ఎవరికి ఎవరూ పుట్టరు కదా? ఆవన్నీ కుట్ర పూరితంగా రాసుకున్న కట్టుకథలని ఈ తరం గ్రహించింది. దేవాలయ ప్రాంగణంలో కూర్చున్న ప్రతివాడూ బిచ్చగాడే! తేడా ఒక్కటే ఇంగితం ఉన్నవాడు మనుషుల్ని బిచ్చమడుగుతాడు. అది లేనివాడు రాతివిగ్రహాల్ని అడుగుతాడు. అయితే, విగ్రహాల్ని బిచ్చమడిగేవాడు పెద్ద మోసగాడు. విగ్రహాల ముందు నిల్చుని ప్రార్థిస్తున్నట్టు నటిస్తూ, భక్తుల్ని నమ్మిస్తూ-వారినే దోచుకుంటాడు. ఇవన్నీ గమనించిన ప్రసిద్ధ తెలుగు కవి గురజాడ అప్పారావు ” వర్ణ ధర్మ, మధర్మ ధర్మంబే” అన్నాడు. నియోగి బ్రాహ్మణుడయినా హేతువాదిగా, సంఘసంస్కర్తగా మారి బ్రాహ్మనిజం పట్ల తనకు ఉన్న అభిప్రాయాన్ని నిష్కర్షగా వెల్లడించాడు.
అందరూ చదువుకుంటే వేల సంవత్సరాలుగా మను వాదుల అధిపత్యం ఎలా కొనసాగేదీ? కొంచెం లోతుగా ఆలోచించిన వారికి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే వారు శూద్రుల, మహిళల చదువు మీద ఆంక్షలు పెట్టారు. బహుజనుల పిల్లలకు పాలు అందకుండా చేశారు. పిల్లలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవుపాలు తెచ్చి, భక్తి పేరుతో, అభిషేకాల పేరుతో రాళ్లమీద, రప్పల మీద పోయించారు. మట్టిపాలు చేయించారు. దానివల్ల ఏం సాధించినట్టూ? చెప్పుకోవడానికి ఏమీలేదు. ఇప్పుడేమో, ఆవుపేడ తినాలి. ఆవు మూత్రం తాగాలి అని – ఆవు మూత్రం ఔషధం అనే ప్రచారం చేస్తున్నారు. వారు మాత్రం పేడ తినరు. మూత్రం తాగరు. కానీ, బహుజనుల్ని ప్రభావితం చేసి, వారితో పేడ తినిపించి, ఆవు మూత్రం తాగించాలన్న కుట్ర వారిది! ఆ రకంగా బహుజనులు బలహీనులుగా, బానిసలుగా ఉండిపోవాలన్నది వారి కుట్ర. విషయం అర్థం చేసుకోని కొందరు మూర్ఖ బహుజన నాయకులు బ్రాహ్మనిజ ప్రభావంలో ఇంకా కొట్టుకు పోతూనే ఉన్నారు.
బల్లి రాత్రంతా వందల పురుగుల్ని తిని, తెల్లవారగానే శ్రీ రాముడి ఫొటో వెనుక దాక్కుందట! ఇదిగో ఇదే పని ఒక శతాబ్దంగా ఆరెస్సెస్-(బీజేపీలు) చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అదేపని మోడీ-షాలు కొనసాగిస్తున్నారు. ఆధునిక ఆయుధాల పేర్లు కూడా తెలుసుకోని మన దేశనాయకులు దేశాన్ని రక్షించుకునేందుకు తమవద్ద ‘సుదర్శన చక్రం’ -ఉందని ప్రకటిస్తారు. పురాణాల్లోని ఒక కల్పిత ఆయుధం తమ దేశాన్ని రక్షిస్తుందనడం హాస్యాస్పదం ! ఈ వ్యాసంలో బ్రాహ్మణులు, బ్రాహ్మణిజం వంటి పదాలు వాడినందువల్ల, సమకాలీనంలో ఉన్న బ్రాహ్మణుల్ని ద్వేషిస్తున్నట్టు కాదు. ద్వేషించమని చెప్పడం కూడా కాదు.
మనుషులందరిలాగానే వారు కూడా సమానస్థాయి గల మానవులే! అయితే, ఒకప్పుడు బ్రాహ్మణిజం బహుజనుల, మహిళల జీవితాల్ని ఎంత దుర్భరం చేసిందనేది సమీక్షించుకోవడం ఎందుకంటే-గతం తెలుసుకోకుండా కొంతమంది యువతీయువకులు ఒకనాటి బ్రాహ్మణి జపు ప్రభావంలో పడుతున్నారు. అవేవో గొప్ప భారతీయ సంప్రదాయాలన్నట్టు.. వాటిని అనుసరిస్తున్నారు. అందుకే వారు గతం తెలుసుకోవాలి! తెలుసుకుంటేనే, సమకాలీనం అర్థమవుతుంది కాబట్టి! వ్యక్తిగతంగానైనా, సమాజపరంగా నైనా బ్రాహ్మణిజాన్ని నాశనం చేస్తేనే దేశ భవిష్యత్తు అభ్యుదయ పథంలో వైజ్ఞానికంగా ముందుకు పోతుంది! సనాతన ధర్మమంటే నేటి హిందుత్వ-హిందూ రాష్ట్ర నినాదాలకు వెన్నెముకలాంటిదన్నది- ఈ దేశప్రజలు గ్రహించారు.దాన్ని తరిమికొట్టడానికి సంసిద్ధులై ఉన్నారు.
-సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రొఫెసర్.
డాక్టర్ దేవరాజు మహారాజు



