Monday, March 16, 2026
E-PAPER
Homeజాతీయంఈ ప్రశ్నలకు బదులేది?

ఈ ప్రశ్నలకు బదులేది?

- Advertisement -

పరిస్థితులను ముందుగా అంచనా వేయని కేంద్రం
యుద్ధానికి ముందు ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటన
దేశంలో ఇంధన నిల్వలు పెంచకపోవడంతో ఇబ్బందులు
ఇరాన్‌ సుప్రీం లీడర్‌ హత్యనూ ఖండించని వైనం
ప్రణాళికా లేదు.. ప్రత్యామ్నాయమూ లేదు
మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శల వెల్లువ

న్యూఢిల్లీ : ఇజ్రాయిల్‌-అమెరికా దాడులతో ప్రారంభమైన ఇరాన్‌ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, రూపాయి విలువ, ఉద్యోగాలపౖౖె తీవ్ర ప్రభావం చూపుతోంది. కేంద్రం ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరిం చడంతో భారత్‌లో కఠిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. మోడీ సర్కారుకు ముందు చూపు లోపించడం, పరిస్థితులను అంచనా వేయడంలో విఫలం కావడం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోవడం కారణంగా దాని భారం ప్రజలపై పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. కేంద్రం తీరుతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తీరుపౖౖె అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తుతు న్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రానికి విశ్లేషకులు ఎనిమిది ప్రశ్నలను సంధిస్తున్నారు.

  1. యుద్ధానికి ముందు మోడీ ఇజ్రాయిల్‌ పర్యటన ఎందుకు?
    ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ దాడులకు ముందుగా ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అది ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్‌లు యుద్ధానికి దిగే అవకాశాలున్నాయంటూ ప్రపంచ మీడియా సైతం కోడై కూస్తున్న తరుణంలో మోడీ ఇజ్రాయిల్‌ పర్యటనకు వెళ్లారు. అయితే మోడీ ఇజ్రాయిల్‌కు వెళ్లకుండా భారత్‌లోనే ఉండాల్సిందనీ, అత్యవసర ప్రణాళికలు రూపొందించాల్సిందని విశ్లేషకులు చెప్తున్నారు.
  2. యుద్ధం వచ్చే సూచనలే కనిపించలేదా?
    అమెరికా-ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం అకస్మాత్తుగా సంభవించింది కాదు. వీటి మధ్య గత కొన్ని నెలలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయినా భారత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ఊహించలేకపోయిందా లేదా ఊహించినా తగిన చర్యలు తీసుకోలేకపోయిందా అనే సందేహాలు సర్వత్రా కలుగుతున్నాయి.
  3. చైనా లాగా ఇంధన నిల్వలు ఎందుకు పెంచలేదు?
    భారత్‌ పొరుగు దేశమైనా చైనా మధ్యప్రాచ్యంలోని పరిస్థితులను ముందుగానే పసిగట్టింది. వెంటనే అప్రమత్తమైంది. యుద్ధం వచ్చే అవకాశం ఉందని ముందుగానే భారీ చమురు నిల్వలు సేకరించింది. కానీ భారత్‌ మాత్రం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. తక్కువ నిల్వలతో తాజా సంక్షోభంలోకి ప్రవేశించింది. దీంతో చైనా లాగా భారత్‌ తన ఇంధన నిల్వలు ఎందుకు పెంచలేదో కేంద్రం సమాధానం చెప్పాలనే ప్రశ్న తలెత్తుతోంది.
  4. కొరత నేపథ్యంలో ఇంధన ఎగుమతులు ఎందుకు?
    మధ్యప్రాచ్యంలోని యుద్ధ పరిస్థితులతో కొన్ని దేశాలు వెంటనే అలర్ట్‌ అయ్యాయి. తమ ఇంధన ఎగుమతులను నిలిపివేశాయి. కానీ భారత్‌ మాత్రం ఇంకా డీజీల్‌, పెట్రోల్‌ ఎగుమతులను కొనసాగిస్తోంది. దీంతో దేశీయ వినియోగదారులకు భవిష్యత్తులో కొరత వచ్చే ప్రమాదం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి.
  5. హార్ముజ్‌ మూసుకుపోతే ప్రత్యామ్నాయం ఏమిటీ?
    ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైంది హార్ముజ్‌ జలసంధి. దీనిపై ఇరాన్‌కు పట్టుంది. దీంతో ఈ జలసంధి గుండా జరిగే నౌకాయానంపై ఇరాన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అమెరికా, దానికి సహకరించే దేశాలకు ఇక్కడ అనుమతి నిరాకరిస్తోంది. ప్రస్తుతం భారత్‌కు కొంత సానుకూల పరిస్థితులే ఉన్నా.. ఒకవేళ హార్ముజ్‌ పూర్తిగా మూసుకుపోతే కేంద్రం వద్ద ఏవైనా ప్రత్యామ్నాయ చర్యలున్నాయా..? అంటే అందుకు భారత ప్రభుత్వం వద్ద సరైన సమాధానం లేదనే చెప్పాలి. ఇక్కడ కూడా కేంద్రానికి ముందస్తు ప్రణాళిక కరువైందని విశ్లేషకులు చెప్తున్నారు.
  6. రష్యా, ఇరాన్‌ చమురు దిగుమతులు ఎందుకు తగ్గాయి?
    మోడీ సర్కారు హయాంలో భారత దౌత్యం కొత్త పుంతలు తొక్కుతోందని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే మోడీ దౌత్యం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేతిలో ఉందనే విమర్శలూ ఉన్నాయి. అమెరికా ఒత్తిడితో భారత్‌ రష్యా, ఇరాన్‌ చమురు దిగుమతులను తగ్గించిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఫలితంగా భారత్‌ చౌకైన చమురు అవకాశాన్ని కోల్పోయిందని అంటున్నారు. దీని భారం ఇప్పుడు దేశ ప్రజలు భరిస్తున్నారని వారు వెల్లడిస్తున్నారు.
  7. ఇరాన్‌ నాయకత్వం హత్యపై కేంద్రం మౌనం ఎందుకు?
    ఇరాన్‌ నాయకత్వమే టార్గెట్‌గా అమెరికా, ఇజ్రాయిల్‌లు జరిపిన యుద్ధోన్మాదాన్ని భారత్‌ వ్యతిరేకించలేదు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ హత్యనూ స్పష్టంగా ఖండించలేదు. దీంతో కేంద్రంలోని మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం గమనార్హం. మోడీ ప్రభుత్వ తీరు భారత విదేశాంగ విధానం స్వతంత్రత తగ్గిందనే అభిప్రాయానికి కారణమైందని విశ్లేషకులు చెప్తున్నారు.
  8. రూపాయి పతనం.. ధరల పెరుగుదల.. వీటిపై ప్రణాళిక ఏమిటి?
    మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగితే భారత రూపాయి విలువ పడిపోవచ్చు. ఇంధన ధరలు మరింతగా పెరగొచ్చు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నష్టపోతాయి. ఉద్యోగాలకు కోత పడే ప్రమాదం ఉంది. మొత్తంగా ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ సమస్యలకు ప్రభుత్వానికి ఒక స్పష్టమైన కార్యాచరణ ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఈ కీలక ప్రశ్నలు, సందేహాలపై మోడీ ప్రభుత్వం వద్ద సరైన సమాధానాలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తు వ్యూహం కొరవడటం, అమెరికాపై అధికంగా ఆధారపడటం, దేశంలో ప్రజాస్వామ్య పారదర్శకత లేకపోవడం వంటి పరిస్థితులు భారత్‌కు కష్టాలను తెచ్చిపెడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితి భారత విదేశాంగ విధానంలో పెద్ద లోపాన్ని చూపుతోందని వారు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -