పటేల్ కల ‘ఆర్‌ఎస్‌ఎస్ లేని దేశం’
చరిత్రను వక్రీకరిస్తే తరిమికొట్టడం ఖాయం : తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవ సభలో ఎస్.వీరయ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌంమంత్రిగా విధులు నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కల ‘ఆర్‌ఎస్‌ఎస్ లేని భారతదేశమ’ని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య తెలిపారు. బీజేపీకి, పటేల్‌కు సంబంధమేంటని ప్రశ్నిం చారు. హౌంమంత్రిగా పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మఖ్దూం మొయినుద్దీన్ విగ్రహం వద్ద సీపీఐ (ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో నగర కార్యదర్శి ఎం.వెంకటేశ్ అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ పోరాటంలో పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో దేశద్రోహుల సభ నిర్వహించారని విమర్శించారు. విమోచనమే జరిగితే నిజాం రాజును జైళ్లో పెట్టకుండా రాజ్ ప్రముఖ్‌గా ఎందుకు ప్రకటించారనీ, ఖాసీం రజ్వీని రాచ మర్యాదలతో పాకిస్తాన్‌కు ఎలా పంపించారని ఆయన ప్రశ్నించారు. సెప్టెంబర్ 13న యూనియన్ సైన్యాలు రాకుంటే నిజాం రాజును, ఖాసీం రజ్వీని ప్రజలే ఉరి తీసేవారని తెలిపారు. సాయుధ పోరాటం చివరి దశలో షోలాపూర్ నుంచి వచ్చిన వారితో మరఠ్వాడలో హిందూ- ముస్లింల మధ్య మత ఘర్షణలు పెట్టేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నించిందని గుర్తు చేశారు. నేలకొరిగిన 4వేల మంది కమ్యూనిస్టులే సాయుధ పోరాటానికి వారసులని స్పష్టం చేశారు. నాటి నుంచి నేటి వరకు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం పోరాటం చేస్తున్నది కమ్యూనిస్టులేనని తెలిపారు.
స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, మరే పోరాటంలోనూ ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర లేదని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బ్రిటీషర్లు కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. చరిత్రను వక్రీకరిస్తూ కాంగ్రెస్ నాయకుడు పటేల్ చిత్రపటాన్ని ముందు పెట్టుకుని బీజేపీ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పిన అబద్ధాలు ఎల్లకాలం పని చేయవని హెచ్చరించారు. మీడియా బీజేపీ చేతిలో ఉంటే, సోషల్ మీడియా యువత చేతిలో ఉందని గుర్తుచేశారు. నేపాల్ తదితర దేశాల్లో తిరుగుబాటు వచ్చినట్టే భారతదేశంలోనూ వస్తుందనీ, ఆలస్యమైనా ప్రజలు నిజం గ్రహిస్తారనీ, ఆ రోజు దేశద్రోహులను తరిమికొట్టడం ఖాయమన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యురాలు టి.జ్యోతి మాట్లాడుతూ కులమతాలు, భాషా బేధాలు, ప్రాంతాలకతీతంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నాడు పోరాటం జరిగిందని తెలిపారు. మహిళలు పెద్ద సంఖ్యలో భాగస్వాములైన తెలంగాణ సాయుధ పోరాటం విజయం సాధించిందని తెలిపారు. పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ ఊర్లో ఉత్సవానికి కుక్కల హడావుడిలా బీజేపీ ఆర్భాటాలున్నాయని ఎద్దేవా చేశారు. ప్రపంచం గుర్తించిన పోరాటంపై బీజేపీ చేస్తున్న వక్రీకరణలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు ఎం.వెంకటేశ్ మాట్లాడుతూ ఊడిగం చేసే పరిస్థితి నుంచి దున్నవారిదే భూమి అనే స్థాయికి ప్రజా పోరాటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డీ.జీ.నరసింహారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాసరావు, కేఎన్ రాజన్న, ఎం.మహేందర్, నగర కమిటీ సభ్యులు వరలక్ష్మి, పద్మ, ఆర్.వెంకటేశ్, జె.కుమారస్వామి, ఎన్.మారన్న పాల్గొన్నారు.