Friday, January 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికృష్ణా జలాలపై బీజేపీ వైఖరేంటి?

కృష్ణా జలాలపై బీజేపీ వైఖరేంటి?

- Advertisement -

రాష్ట్రాల మధ్య కొనసాగుతోన్న నదీ జలాల వివాదాలను చూస్తూ కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందా..? రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చోద్యం చేస్తోందా..? కర్నాటక,ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదం మరో దశాబ్ధ కాలం పాటు కొనసాగాల్సిందేనా..? ప్రధానమంత్రి మౌనముద్రను చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. నీళ్ల కేటాయింపుల వివక్ష నేపథ్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలోనూ అదే తీరు కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టు కేటాయింపుల అనుమతులపై బీజేపీ స్తబ్ద వైఖరిపై ప్రజల్లో అసహనం వ్యక్తమౌతోంది. దశాబ్దాల కాలంగా గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వీటికి పులిస్టాప్‌ పడుతుందని ప్రజలు ఆశించినా.. మరింత జటిలమయ్యాయి. పుష్కర కాలంగా ఆయా రాష్ట్రాల మధ్య ఆరోపణలు- ప్రత్యారోపణలు..ఎన్జీటీ, కోర్టు కేసుల విచారణలు కొనసాగుతున్నాయి. ఫలితంగా తెలంగాణ ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది.

ప్రస్తుతం కృష్ణా నదీ జలాల వివాదం తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కొద్దిరోజులుగా ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, అధికార కాంగ్రెస్‌ పార్టీల నేతల మధ్య అగ్గి రాజేస్తోంది. అయితే..ఈ సమస్యను పరిష్కరించాల్సిన కేంద్రం మాత్రం ఏమీ ఎరగనట్టుగానే వ్యవహరిస్తోంది. తెలంగాణ నుండి ఎనిమిదిమంది బీజేపీ పార్లమెంటు సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా కీలక భూమిక పోషిస్తున్నారు. అసెంబ్లీలోనూ ఎనిమిది మంది బీజేపీ శాసన సభ్యులున్నారు. కృష్ణా జల కేటాయింపులు, సమస్య పరిష్కారానికి వీరు చూపిన చొరవ శూన్యం. ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు తొంభై టీఎంసీల నీటి కేటాయింపు, ఇందుకు ఎన్జీటీ అనుమతులపై కేంద్ర ప్రభుత్వంను ఒప్పించే ఏ ప్రయత్నమూ చేయలేదనే విమర్శలున్నాయి. పాలమూరు నుండి బీజేపీ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ పార్లమెంటు నియోజక వర్గ ప్రజలకు కృష్ణా జలాలు అత్యవసరం. ఈ ప్రాజెక్టు నీటి కేటాయింపుల అనుమతులకు ప్రధాన మంత్రిని ఒప్పించాల్సిన బాధ్యత ఆమెపై ఉంది.

అసెంబ్లీలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా..తమ పార్టీ విధానాన్ని వారు స్పష్టం చేయకపోవడం విచారకరం. సికింద్రాబాద్‌ నుండి ప్రాతినిధ్యం వహిస్తోన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితులు. తన నియోజక వర్గానికీ కృష్టా నీటి అవసరాలున్నాయి. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న టీ(బీ)ఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృష్ణా జలాల హక్కులను సాధించడంలో విఫలమయ్యారా అంటే.. ప్రస్తుతం ఆ పార్టీ అధినేత మౌనం చూస్తే అలానే అనుకోవాల్సి వస్తోంది. గత పాలనలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పెట్టిన కీలకబిల్లులకు గులాబీ పార్టీ ఎంపీలు సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రధాని మోడీతో కేసీఆర్‌కు తత్సంబంధాలు న్నా.. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ వాటాను సాధించుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 2015లో అపెక్స్‌ కౌన్సిల్‌లో, ఆ తర్వాత కోర్టుకిచ్చిన అఫిడావిట్‌..ఇలా గత బీఆర్‌ఎస్‌ పభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎండగడుతోంది. కాళేశ్వరం తరహాలోనే పాలమూరు ప్రాజెక్టు డిజైన్‌ను శ్రీశైలంకు మార్చి ఎక్కువ ఎత్తునుండి ఎత్తిపోసి ప్రాజెక్టు నిర్మాణానికి అత్యధిక ఖర్చు అయ్యేలా చేశారనే రేవంత్‌ రెడ్డి ఆరోపణలకు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నుండి సరైన జవాబు లేకుండా పోయింది.

తెలంగాణ ప్రాజెక్టుల్లోని తప్పులు, వాటి వల్ల తీరని నష్టం జరిగే వరకు కేంద్ర ప్రభుత్వం చోద్యం చేస్తుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతుంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ, రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చుకుంటూపోతే..ప్రజలు ఇబ్బందులు పడేవారే కాదు. కేంద్రం ఆ చొరవ చూపడం లేదు. గత కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలోనూ ఇదే జరిగింది. ఈ ప్రాజెక్టు ప్రాజెక్టు కుంగిపోయాక బీజేపీ విమర్శల దాడిచేస్తోంది. ఇది బీఆర్‌ఎస్‌కు ఏటీఎంగా మారిందని తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలుమార్లు ప్రధాన మంత్రి మోడీ తీవ్ర విమర్శలు చేసిన విషయాన్ని గుర్తుచేసుకోవచ్చు. చేతిలో అధికారం ఉండగా అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం కృష్ణా నదీ జలాల కేటాయింపుపౖౖె బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాల్సిన బాధ్యత ఉంది. ఏపీలో బీజేపీ అలయెన్స్‌ ప్రభుత్వం ఉండడంతో వారికి మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా బీజేపీ తన పార్టీ తన ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కనపెట్టి..తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉన్నది.

  • చిలగాని జనార్ధన్‌, 8121938106
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -