Friday, July 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంబనకచర్లపై చీకటి ఒప్పందమేంటి?

బనకచర్లపై చీకటి ఒప్పందమేంటి?

- Advertisement -

– సీఎం రేవంత్‌ రెడ్డి మాటలకు చేతలకు పొంతనేది? : మాజీమంత్రి హరీశ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

బనకచర్లపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి చేసుకున్న అర్థరాత్రి చీకటి ఒప్పందమేంటని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ఏర్పాటు చేసిన సమావేశానికి తాము హాజరు కావడం లేదని లీకులిచ్చిన సీఎం తెల్లారేసరికి ఆ సమావేశానికి వెళ్లారని ఎద్దేవా చేశారు. ఆయన మాటలకు, చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు తిరస్కరిస్తే అదే అంశంపై కేంద్ర ప్రభుత్వం సమావేశం ఎలా ఏర్పాటు చేసిందని ప్రశ్నించారు. అలాంటి సమావేశానికి బనకచర్లను వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఎలా హాజరయ్యారని నిలదీశారు. అర్థరాత్రి చేసుకున్న చీకటి ఒప్పందమే రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళ్లడానికి కారణమని ఆరోపించారు. ఆ సమావేశంలో బనకచర్లపై చర్చ జరిగిందని ఏపీ మంత్రి నిమ్మల చెబుతుంటే, అలాంటిదేమి లేదని రేవంత్‌ రెడ్డి బుకాయిస్తున్నారని విమర్శించారు. బనకచర్ల పేరుతో తెలంగాణకు మరణశాసనం రాశారనీ, చంద్రబాబు లేదా బీజేపీ ఎవరు ఒత్తిడి చేశారో చెప్పాలన్నారు. రేవంత్‌ రెడ్డి ఇచ్చిన పీపీటీలో చంద్రబాబును ఒక్క మాట అనలేదనీ, కేసీఆర్‌ పైనే విమర్శలు చేశారని తెలిపారు. కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగిస్తూ రేవంత్‌ నిర్ణయం తీసుకున్నారనీ, కేసీఆర్‌ గర్జించాకే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. ఆ నదిపై న్యాయమైన వాటా కోసం కేసీఆర్‌ సెక్షన్‌ 3 సాధించారని తెలిపారు. వాటా దక్కితే తెలంగాణకు 800 టీఎంసీలు వస్తాయని గుర్తుచేశారు. తెలంగాణకు చేసిన ద్రోహానికి సీఎం రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎట్టి పరిస్థితిలో బనకచర్లను బీఆర్‌ఎస్‌ ఒప్పుకోదని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -