లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ లేవనెత్తిన ఓట్‌చోరీ నినాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చగా మారిందనేది తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ ఈసీ నుంచి సమాధానం రాలేదు.అసలు ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది? దీనిపై ఎవరూ ఏమీ మాట్లాకపోవడంతో, ఇది ప్రజలకేమీ సంబంధంలేని వ్యవహారంగా రాజకీయరంగు పులుముకొంటోంది. దొంగ ఓట్ల చేరిక మొదలు కొందరి ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేస్తున్నారని రాహుల్ చెబుతుంటే దీనికి పూర్తి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈసీకి ఉందా,లేదా?ఈ వ్యవహారంపై నిజం ఏమిటన్నది రాహుల్‌గాంధీ ప్రశ్నలకు కాకపోయినా దేశ ప్రజానికానికైనా జవాబు చెప్పాలి.ఎందుకంటే, ప్రభుత్వాలను ప్రజలు తమ ఓటు ద్వారా ఎన్నుకొనేలా ఎన్నికలు నిర్వహించేది ఈసీ. అలాంటి ఎన్నికలపై అనేక అనుమానాలు వస్తుంటే వాటికి ఈసీ వివరణ ఎంతో అవసరం. అదిచ్చే క్లారిటీతోనే తమ ఓటుతోనే ఎన్నికైన ప్రభుత్వం వచ్చిందన్న భరోసా ప్రజల్లో పెరుగుతుంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి కొన్ని అనేకమార్లు వివిధ రాష్ట్రాల్లో ఈసీ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించింది. కేంద్రంలో ప్రభుత్వం కోసం ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి. ఇన్నిసార్లు ఎన్నికలు జరిగినా ఈసీ మీద ఈస్థాయిలో ఎవరూ ఆరోపణలు ఎప్పడూ రాలేదు. ఇప్పుడ రాహుల్‌గాంధీ వేస్తున్న ప్రశ్నలు ఈసీ మూలాలనే ప్రశ్నిస్తున్నాయి, కమిషన్ ఉనికినే సవాల్ చేసేలా ఉన్నాయి. అయినా ఈసీ అంతపెద్దగా రియాక్ట్ కావడం లేదన్న చర్చ అయితే అంతటా నడుస్తోంది. ఈసీ అంటే సర్వ స్వతంత్ర సంస్థ. అంతేకాదు రాజ్యాంగబద్ధమైనది కూడా. అలాంటి సంస్థ మీద ప్రతిపక్షనేత ఇంత సీరియెస్ విమర్శలు చేస్తూ ఆధారాలతో సహా వెల్లడిస్తుంటే జవాబు చెపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. తీవ్రమైన చర్చ జరిగాక ఆగస్టు పదిహేడున ఒకసారి ఈసీ ప్రెస్‌మీట్ పెట్టి ”రాహుల్ గాంధీ చేసిన విమర్శలు తప్పు. ఆయన దగ్గర ఆధారాలుంటే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. లేదంటే క్షమాపణలు చెప్పాలి” అని ఎన్నికల ప్రధానాధికారి అన్నారు. ఆ తర్వాత ఈసీ తరఫున మళ్లీ ఎవరూ ప్రెస్ ముందుకు రాలేదు. ఇక దీనిపై ట్వీట్లతోనే ఖండిస్తున్నారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తరఫున ప్రశ్నించే హక్కు విపక్షాలకు ఉంటుంది. ఓట్‌చోరీ వ్యవహారంపై ఇప్పుడు రాహుల్‌గాంధీ సంధించే ప్రశ్నలు కూడా అదే కోణంలో చూడాలి. కానీ బీజేపీ అలా చూడకపోవడం బాధాకరం. ప్రజల్ని తప్పుతోవ పట్టించేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నాడని, ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం లేదని, చెప్పే మాటలు అర్థం లేనివని ఏవేవో వ్యాఖ్యానిస్తున్నది. ఎక్కడెక్కడ ఓట్లు చోరికి గురయ్యాయో, ఎక్కడ తొలగించారో సాక్ష్యాలతో సహా వివరిస్తుంటే కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తున్న బీజేపీని మాటలనే ప్రజలు విశ్వసించడం లేదని ఆ పార్టీ నాయకులు గ్రహించడం లేదు. ఓట్ చోరీ జరగలేదని బీజేపీ రుజువు చేయచ్చు కదా? దీనిపై ఎలా ముందుకెళ్లినా తమకే నష్టమన్న రీతిలో ఆ పార్టీ ఆలోచిస్తోందని అర్థమవుతోంది. పైగా బీహార్ ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో దీన్నుంచి ఎలాగైనా గట్టెక్కాలనే ఆందోళనలో ఉంది. ఇలాంటి సందర్భంలో ఈసీ ఎందుకు మాట్లాడం లేదు? దీన్నిబట్టి చూస్తే రాహుల్ ఆరోపించినట్టుగా బీజేపీ- ఈసీ బంధం బాగా ధృఢంగా సాగుతోందన్నట్టే కదా.
లేదంటే ఆరోపణలన్నింటికి సమాధానం చెప్పాలి. రాహుల్ చేసిన ఆరోపణలను సుమోటోగా స్వీకరించాలి, విచారణ చేపట్టాలి.ఆయన చేసిన ఆరోపణలు తప్పయితే చర్యలు తీసకునే అధికారం ఈసీకి ఉంది. మరి అలాంటప్పుడు జంకడం దేనికి? ఈసి, బీజేపీ కుమ్మక్కయిందని ఇట్టే అర్థమవుతోంది. కానీ,ఒక్క విషయం ఈసీ గుర్తెరగాలి. ఈ రోజు రాహుల్, రేపు మరొకరు ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే ఇదే తరహాలో ఖండించి ఊరుకుంటే ఈ దేశ ఓటర్ల మదిలో అనేక సందేహాలు గూడు కట్టుకుంటాయి. అలా జరగడానికి అవకాశమివ్వకూడదు. ఎన్నికలు వస్తాయి..పోతాయి, రాజకీయ పార్టీలు కూడా గెలుస్తాయి..ఓడుతాయి, కానీ ప్రజాస్వామ్యం నిలబడాలి. అది జరగాలంటే ఎన్నికల వ్యవస్థ బలంగా ఉండాలి, దానిపై అనుమానాలు, అపోహలు ఉండకూడదు, రాకూడదు. అలా జరగొద్దని ఈసీ భావించాలి. ఓట్ చోరీ…ఓట్ల తొలగింపుపై ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ దేశానికి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
- సయ్యద్ నిసార్ అహ్మద్, 7801019343