చట్ట ప్రకారమే ముందుకెళ్లండి
42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవో చట్టబద్ధతను ప్రశ్నిస్తున్నాం
బిల్లుకు గవర్నర్ ఆమోదం దక్కకుండానే జీవో ఏంటి?
నోటిఫికేషన్‌కు ముందే పిటిషన్ వచ్చింది
విచారించి ప్రభుత్వానికి ఉత్తర్వులిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలి
విచారణ అక్టోబర్ 8కి వాయిదా : హైకోర్టు
నవతెలంగాణ-హైదరాబాద్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో చట్టప్రకారమే ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో చట్టబద్ధతను ప్రశ్నించింది. ఎన్నికల నిర్వహణను రెండు, మూడు నెలలు వాయిదా వేస్తే నష్టమేంటి? అని అడిగింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకముందే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది కాబట్టి విచారణ చేస్తామనీ, ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. విచారణను అక్టోబర్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26న జీవో 9ని జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, ఇతరులు వేర్వేరుగా వేసిన అత్యవసర హౌస్‌మోషన్ పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ విజరుసేన్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ శనివారం సాయంత్రం సుధీర్ఘంగా విచారించింది. అక్టోబర్ 8వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన బీసీ సంక్షేమ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులకు, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది.
తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేస్తున్నప్పటికీ ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినా, ఈ పిటిషన్లపై విచారణ చేసి తీర్పు చెబుతామని చెప్పింది. పంచాయతీరాజ్ చట్టంలోని 285-ఎ సెక్షన్‌ను సవరిస్తూ ప్రభుత్వం, అసెంబ్లీ ఆమోదిస్తే సరిపోదనీ, గవర్నర్ బిల్లును ఆమోదించకుండానే బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9ని ఎలా జారీ చేస్తుందని ప్రశ్నించింది. తాము పిటిషన్లల్లోని మెరిట్స్‌లోకి వెళ్లడం లేదనీ, న్యాయపరమైన అంశాలకే పరిమితమై ప్రశ్నలు వేస్తున్నామని స్పష్టం చేసింది. గవర్నరు ఆమోదం లేకుండా జీవో ఎలా జారీ చేస్తారు? చట్టానికి విరుద్ధంగా రిజర్వేషన్ల జీవో ఇవ్వడం చట్ట వ్యతిరేకం కాదా? స్థానిక సంస్థల ఎన్నికలను మరో రెండు నెలలు వాయిదా వేస్తే నష్టమేమిటి? అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జీవో ఇవ్వొచ్చునా? అని రాష్ట్రం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది జి.విద్యాసాగర్‌రావుల ను అడిగింది. అసెంబ్లీలోని అన్ని పార్టీల ఆమోదంతో తీర్మానం చేయడం వల్ల దీనిపై జీవో ఇస్తే తప్పు లేదని ఏజీ వాదించారు. గవర్నర్ ఆమోదం చెప్పాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఈసీ లాయర్ చెప్పారు. గవర్నర్‌కు బిల్లు పంపి నెల రోజులు కూడా కాలేదని హైకోర్టు చెప్పింది.
ప్రభుత్వ వివరణ తెలుసుకుని చెబుతామంటే విచారణ సోమవారానికి వాయిదా వేస్తామని చెప్పింది. సంక్షేమ చర్య కాబట్టి జోక్యం చేసుకోవద్దని ఏజీ కోరడం సబబు కాదంది. బీసీ రిజర్వేషన్ల అంశంలోకి వెళ్లడం లేదనీ, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జీవో ఇవ్వడంపై ఉన్న చట్టబద్ధతను మాత్రమే ప్రశ్నిస్తున్నామని చెప్పింది. చట్టపరంగా జీవో లేనప్పుడు స్టే లేదా స్టేటస్‌కో ఆర్డర్ ఇవ్వడం ఒక్కటే తమ ముందున్న అంశమని స్పష్టం చేసింది. స్టే ఇస్తే ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ప్రక్రియ అంతా ఆగిపోతుందనీ, ప్రభుత్వమే ఎన్నికలను వాయిదా వేయడమో, గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండటమో చేస్తే బాగుంటుందని హితవు పలికింది. సంక్షేమ వ్యవహారంపై శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని ఏజీ చెప్పడం సరికాదంది. తమ ముందున్నది ప్రభుత్వ జీవో 9 అని గుర్తు చేసింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించ లేకపోతే ఇదే విషయాన్ని హైకోర్టుకు చెప్పి రెండు, మూడు నెలలు గడువు కోరడానికి ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరమేంటని ప్రశ్నించింది. లేదంటే గవర్నర్ బిల్లుకు ఆమోదం చెప్పే వరకు ఆగితే వచ్చే నష్టం ఏమిటని కూడా అడిగింది. ప్రభుత్వానికి ఓపిక లేకపోతే ఎలాగని ప్రశ్నించింది.
ఏదో జరిగిపోతోందనే వ్యవహారంపై విచారణ ఎందుకు జరగాలంది. ప్రభుత్వం క్లారిటీగా ఎందుకు లేదని అడిగింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ హామీ ఇస్తే విచారణను వాయిదా వేస్తామంది. బిల్లుకు ఆమోదం లేకుండా అధికారులే శాసన నిర్ణయాలు తీసుకుంటే ఎలాగని ప్రశ్నించింది. రాకేష్ కుమార్ కేసులో షెడ్యూలు ప్రాంతాల్లోని రిజర్వేషన్లు 50 శాతానికి మించి చేయవచ్చునని సుప్రీం కోర్టు చెప్పిందని ఏజీ వాదించారు. అది వేరే విషయమనీ, కేసు మెరిట్స్‌లోకి ఇంకా వెళ్లలేదని, బిల్లుకు ఆమోదం లభించకుండా జీవో ఇవ్వడంపైనే వివరణ కోరుతున్నామని చెప్పింది. జీవో 9లో పీఆర్ యాక్ట్‌లోని సెక్షన్ 285ఎ గురించి ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. అసెంబ్లీ 285-ఎపై తీర్మానం చేస్తే చట్టం అయిపోతుందా? దీనిపై బిల్లును గవర్నర్ ఆమోదించాకే చట్టం అవుతుంది కదా? సుప్రీం కోర్టు తాజా తీర్పు ప్రకారం బిల్లు పంపిన మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనప్పుడు ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి అర్థం ఉంటుంది కదా? ఇక్కడ బిల్లు నెల రోజులు కూడా పెండింగ్‌లో లేదు కదా? అన్న సందేహాలను లేవనెత్తింది. సుప్రీం కోర్టు మూడు నెలల వ్యవహారంపై రాష్ట్రపతి ఐదు ప్రశ్నలతో రాసిన లేఖపై సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కూడా గుర్తుచేసింది.