బెంగళూరు డాక్టర్ దొరికితేనే కేసు పురోగతి
రెండు బృందాలతో గాలిస్తున్న పోలీసులు
మదనపల్లె : కిడ్నీ రాకెట్ దురాగతంతో ప్రాణాలు కోల్పోయిన యమునకు ఎడమవైపు కిడ్నీ లేదని పోస్టుమార్టం నివేదికలో వైద్యులు తేటతెల్లం చేశారు. అయితే ఆ కిడ్నీ ఏమైందనేది పోలీసులకు కూడా అంతుచిక్కడం లేదు. బెంగళూరుకు చెందిన ఓ యురాలజీ డాక్టర్ మదనపల్లెకు వచ్చి గ్లోబల్ హాస్పిటల్‌లో యమునకు కిడ్నీ ఆపరేషన్ చేసి కిడ్నీని తొలగించాడని పోలీసులు చెబుతున్నారు. ఆ కిడ్నీ గోవాకు చెందిన రంజన్ నాయక్‌తో బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.
అయితే కిడ్నీ ఆపరేషన్ చేసిన డాక్టర్ పరారీలో ఉండడంతో ఆ కిడ్నీ విక్రయించారా? బెంగళూరులోనే ఎవరికైనా అమర్చారా? గోవాకు పంపారా?లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కిడ్నీ ఎవరికి చేర వేశారన్నది బెంగళూరు డాక్టర్ దొరికితేనే తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. పరారీలో ఉన్న అతని కోసం రెండు బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పట్టుకుంటామని మదనపల్లె డిఎస్‌పి మహేంద్ర తెలిపారు. కాగా, కిడ్నీ రాకెట్ కేసులో ఉన్న డాక్టర్ ఆంజనేయులు, టెక్నీషియన్లు బాలరంగడు, మెహరాజ్, పద్మ, సత్య, సూరిబాబులను డిఎస్‌పి కార్యాలయంలో విచారిస్తున్నారు.
ఆధారాలు చెరిపేసిన గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం
గ్లోబల్ ఆస్పత్రి ముందు, లోపల వివిధ ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల డేటాను తొలగించి ఆధారాలు తారుమారు చేశారు. పోలీసులు ఆస్పత్రిలోని సిసి కెమెరాల పుటేజీలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నా, వారికి డేటా డిలీట్ అని రావడంతో విస్తుపోయినట్లు తెలుస్తోంది.
పోలీసుల దర్యాప్తు తీరుపై విమర్శలు
కిడ్నీ రాకెట్‌లోని ముఠాను పట్టుకోవడానికి పోలీసులు బృందాలుగా ఏర్పడి, ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకున్నారన్న సమాచారం. అయితే ఇప్పటికే ఆధారాలు చెరిపేసిన కిడ్నీ రాకెట్‌లోని బృందం బాగోతం బయటపడినప్పటికీ ఆ ఆస్పత్రి యాజమాన్యంలోని డాక్టర్ ఆంజనేయులు మినహా అందులో పనిచేస్తున్న వైద్య బృందం డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతిలపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో పోలీసుల దర్యాప్తు తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి.
‘యమున’ కిడ్నీ ఏమైనట్లు..?
- Advertisement -
- Advertisement -



