Sunday, April 5, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిచట్టబద్ధత తర్వాత ఘట్టమేంటి?

చట్టబద్ధత తర్వాత ఘట్టమేంటి?

- Advertisement -

విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరా వతిని విభజన చట్టంలో చేరుస్తూ పుష్కర కాలం తర్వాతనైనా పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు ఆమోదించడం హర్షనీయమైంది. ఇది చారిత్రా త్మక ఘట్టమని ఏపీ పాలక కూటమి సంబరాలు చేస్తుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్‌ మావిగన్‌ పేరుతో మరో కొత్త రాజధాని ప్రతిపాదన తెచ్చి విమర్శలు కొనితెచ్చుకుం టున్నారు. పార్లమెంటులోనూ వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తున్నాము గానీ అమరావతిని కాదని అస్పష్టంగా మాట్లాడారు. సభలో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, బీఆర్‌ఎస్‌ సభ్యులు తమ తమ రాజకీయ అవసరాల ప్రకారం మాట్లాడి వ్యూహాలు బయట పెట్టుకున్నారు. ఒకరిద్దరు సీనియర్లు బాధ్యతా రహితంగా కులాల పేర్లు కూడా తీసుకొచ్చారు. ఇన్నిటి మధ్యనా చాలా తక్కువ మాట్లాడిందీ, కొత్తగా ఏమీ చెప్పంది కేంద్రం మాత్రమే. తాము నిమిత్తమాత్రులమైనట్టు కొందరు మాట్లాడితే తెలుగుదేశం నుంచి కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో ప్రవేశించిన వారు పాత రాగాలే ఆలోపించారు. కిషనర్‌ రెడ్డి, లక్ష్మణ్‌ వంటివారు ఆవేశపూరితంగా మాట్లాడుతూ అసలు అంశాలు దాటేశారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటుతో పాటు రాజధానుల నిర్ణయం అద్భుతంగా జరిగిపోయిందని పవన్‌ కళ్యాణ్‌ వంటివారు ప్రశంసలు కురిపిస్తున్నారు.

1953లో ఆంధ్రరాష్ట్రం స్వాతంత్రానికి ముందు తొలి భాషా రాష్ట్రంగా ఒరిస్సా ఏర్పడిన నాటి నుంచి కూడా పాలకులు రాష్ట్రాల ఏర్పాటు, రాజధానుల పట్ల అవకాశవాదంతో వ్యవహరించడం,కేంద్రం తన ప్రయో జనాలను బట్టి స్పందించడం జరుగుతూనే వస్తోంది. ఇప్పుడు చూస్తున్నది కూడా అందుకు మినహాయింపు కాదు. ఈ రచయిత గతంలో అమరావతిపై రాసిన పుస్తకానికి పెట్టిన అమరావతి అడుగులెటు? అనే శీర్షిక ఇప్పటికి ఆలోచించ వలసిందే. ఇప్పటివరకూ కేంద్రంలోని బీజేపీ రాజధానికోసం స్పష్టంగా తన పాత్ర వెల్లడించడం గానీ, రాష్ట్ర ప్రభుత్వం అందరితో అఖిలపక్షం నిర్వహించడం గానీ ఎప్పుడూ జరగలేదు. రెండు ప్రభుత్వాలలోనూ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సిఆర్‌డిఎ) కమిషనర్లను కూడా కొనసాగించిన దానికంటే నిరంతరంగా మార్చిందే ఎక్కువ. వైసీపీ మూడు రాజధానుల ప్రహసనంలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిపరివిధాల మాట్లాడటంతో పారదర్శ కత అన్నది దాదాపు లేకుండా పోయింది. ఆ విధంగా ఇప్పటి వరకూ అమరావతి విషయంలో అవాంఛ నీయమైన ప్రతిష్టంభనకు మూడు ప్రధాన పాలక పార్టీలు బాధ్యత వహించవలసి వుంటుంది. సీపీఐ(ఎం) వంటి పార్టీలు మాత్రమే అప్పుడు ఇప్పుడూ అమరావతి నిర్మాణం అన్ని ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు సమకూర్చాలనే స్ప్షష్టమైన విధానంతో వున్నాయి. ఆ విషయం పక్కనపెట్టి రాజకీయంగా ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేదు. చెప్పాలంటే ఏపీ మాత్రమే కాదు, తెలంగాణ విభజన వల్ల అభివృద్ధి చెందుతున్న వాదనలు ఈ పన్నెండేళ్ల తర్వాత తీవ్ర సవాలును ఎదుర్కొంటున్నాయి. తొలి ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విధానాలను ఆయన కుమార్తె కవితతో సహా మాజీ సహచరులే తోసి పుచ్చుతున్నారు. ఇక ఇప్పుడు పాలిస్తున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలపై బీఆర్‌ఎస్‌ నిప్పులు కక్కుతున్నది. ఏపీకి జీవనాడి అన్న పోలవరం నుంచి కేసీఆర్‌ స్వప్న ఫలం అన్న కాళేశ్వరం వరకూ వివాదగ్రస్తంగా విఘాతాలతో సాగుతు న్నాయి. హైదరాబాద్‌ సైబరాబాద్‌ నిర్మాణం గురించి చంద్రబాబు అదేపనిగా చెబుతుంటే ఫ్యూచర్‌ సిటీ అంటూ రేవంత్‌రెడ్డి హంగామా చేస్తున్నారు. ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి వ్యూహాలను చర్చకు పెడుతున్నాయి.

రాజధానుల నిజానిజాలు
1953లో విజయవాడకు పూర్తి మద్దతున్నా నాటి కాంగ్రెస్‌ పెద్దలు విశాఖ, తిరుపతి, కర్నూలు అంటూ చివరకు కర్నూలును తాత్కాలిక రాజధానిగా నడిపించడం చరిత్రలో నమోదైంది, తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం కాంగ్రెస్‌ పెద్దల తతంగమే గానీ అతి పెద్ద పార్టీగా వున్న కమ్యూనిస్టులను కలుపుకున్నది లేదు. ఒరిస్సా రాజధానిగా కటక్‌, భువనేశ్వర్‌ మధ్య దాగుడుమూతలూ చాలా సాగాయి. చాలా కల్లోలాల తర్వాత కూడా ఉమ్మడి రాజధాని చండీఘర్‌ ఎవరికి చెందాలనేది ఇప్పటికీ తేల్చలేదు. హైదరాబాద్‌తో పోల్చదగిన ఒకే ఉదాహరణ షిలాంగ్‌ విషయంలోనూ చాలా సమయం తీసుకున్నారు. 2000లో వాజ్‌ పేయి హయాంలో మూడు రాష్ట్రాలను ఏర్పాటుచేసినా రాజధాని సమస్య రాలేద నడం బూటకం. ఇప్పటికీ ఉత్తరా ఖండ్‌కు శాశ్వత రాజధాని లేదు. డెహ్రాడూన్‌ తాత్కాలిక రాజధాని మాత్రమే. గైరిసన్‌ వేసవి కాలపు రాజధాని, ఆ చిన్న హిమా లయ ప్రాంత రాజధానికి మూడు రాజధానుల చర్చ నడుస్తూనే వుంది. ఛత్తీస్‌గఢ్‌లో రారుపూర్‌ను ఆధారం చేసుకుని నయా రారుపూర్‌ పెట్టారు. ఆధునికమైన హరిత నగరంగా గొప్పగా చెబుతుంటారు. ఆధునిక సదుపాయాలు వున్నాయని గొప్పగా వల్లెవేస్తుంటారు. కానీ, నయా రాయపూర్‌లో పూర్తి నివాసయోగ్యత లేదు, మంత్రులు అందరూ మారింది లేదు. ఏపీ విభజన సమయంలో అధికారంలో వున్నది యుపిఎ అయినప్పటికీ బీజేపీ పూర్తిగా సహకరిం చడం వల్లనే అది సాధ్యమైంది. 2014 తర్వాత నుంచి కొనసాగుతున్నది బీజేపీ ఎన్‌డిఎ ప్రభుత్వమే. ఇంకా చెప్పాలంటే మోడీ రాజ్యమే. రెండు సార్లు ప్రారంభో త్సవాలు శంకుస్థాపనల్లో పాల్గొన్నది మూడోసారీ వస్తారని చంద్రబాబు ప్రకటిస్తున్నదీ మోడీనే గనక కేంద్రం పాత్ర కీలకం. మొదట మట్టి నీళ్లు తీసుకువచ్చారని స్వయంగా ఆయనే విమర్శలు గుప్పించారు. వైసీపీ మూడు రాజధానులు అంటుంటే మోడీ వ్యూహాత్మక తటస్తత అనుసరించి గందరగోళానికి దోహదం చేశారు. కోర్టులలో కేంద్రం వైఖరి చెప్పకుండా నానబెట్టారు.మాకు సంబం ధమే లేదని వాదించారు, అమరావతి రైతుల ఉద్యమానికి బీజేపీ మద్దతివ్వకుండా చాలాకాలం ఊగిసలాడింది. అప్పటి నేతలు కొందరు విశాఖకు అనుకూలంగా మాట్లాడటమే గాక మోడీ స్వయంగా వచ్చి సభల్లో పాల్గొని పరోక్షంగా ఆశీస్సులు ఇచ్చారు. మోడీ అండదండలు లేకుండా జగన్‌ ఇంత నిర్ణయం తీసుకోరనే మాట మార్మోగింది. పార్లమెంటులో రాజధానిపై ప్రశ్నలకు కూడా అస్పష్టంగా సమాధానాలిస్తూ వచ్చారు విభజన సమస్యలూ తేల్చకుండా అన్యాయం చేస్తున్నారు. కనక ఈ విషయంలో కేంద్రం తటస్తంగా వుందని తాజాగా ముఖ్యమంత్రి చెప్పడం నిలబడేది కాదు. ఇప్పటికైనా మోడీ సర్కారు నిధులిచ్చి తన నిబద్దత చాటుకోవలసి వుంటుంది.

మూడు నుంచి మావిగన్‌,,,
ఇక జగన్‌ శాసనసభలో హఠాత్తుగా మూడు రాజధానుల పాట ఎత్తుకోవడం ఎన్నికల ప్రచారంలో అమరావతికి కట్టుబడి వున్నామని ఇచ్చిన మాటకు విరుద్ధం. తర్వాత ఎన్ని అర్థం లేని మాటలు, రెచ్చగొట్టే వాదనలు తెచ్చారో చెప్పడం స్థలాభావం రీత్యా సాధ్యం కాని పని, చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో అవినీతి చేసిందనే ఆరోపణ తప్ప ఇందుకు మరో కారణం చూపింది లేదు. తాము తక్కువకు త్వరగా కట్టి చూపారా అంటే అదీ జరగలేదు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ భూముల కుంభకోణం కేసుల వంటివి పెట్టడం తప్ప. అసంపూర్ణంగా వున్న పనులనైనా పూర్తి చేయాలనుకోలేదు. పాలనా వికేంద్రీకరణను ఎవరూ కాదనకున్నా ఆ దిశలో తీసుకున్న నిర్దిష్ట చర్యలేమీ లేవు. విశాఖ ఉక్కుకే ఎసరు పెడుతుంటే నామకార్థంగా మాట్లాడటం తప్ప అందరినీ కూడగట్టి నిర్మాణాత్మకంగా అడ్డుకున్నది లేదు. మరింత తమాషా ఏమంటే రుషికొండలో రూ.వందల కోట్లతో కట్టిన భవనాలు ఎందుకు అన్నదానిపై కూడా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. నేను విశాఖకు వచ్చేస్తానంటూ ముహూర్తాలు ప్రకటించిన జగన్‌ ఎప్పుడూ అక్కడనుంచి పనిచేసింది లేదు. రాయలసీమ రాజకీయ ప్రచారం తప్ప కచ్చితంగా ఒక పథకం పూర్తి చేసింది లేదు. కర్నూలులో న్యాయ రాజధానిని టీడీపీతో సహా అందరూ బలపర్చినా ఏవో శంకుస్థాపనలు తప్ప ఆ దిశలో చొరవతీసుకున్నది లేదు.మరోవైపున అదానీఅంబానీలకు కట్టబెట్టే తతంగాలు ఆగిందీ లేదు. ఇవి చివరకు అమెరికా మీడియాలోనూ ఈ ఆరోపణలు భగ్గుమనే పరిస్థితి వచ్చింది, వాటిని ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా కొనసాగిస్తున్న మాట నిజమే.ఇద్దరూ మోడీతో ముడిపడి వుండటమే ఇక్కడ అసలు రహస్యం.ఈ కారణం వల్లనే సీపీఐ(ఎం) ఎప్పుడూ బీజేపీతో కలసి రాజధాని సమస్యపై కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నిరాకరించింది. ఇప్పుడైనా నిధులు మంజూరు చేయ కుండా కాల్యవవధితో పూర్తి చేయడానికి సహకరించకుండా కేంద్ర పాలకులు ఎన్ని కబుర్లు చెప్పినా విలువుండదు. అలాగే జగన్‌ సరికొత్త పరిశోధనగా తీసుకొచ్చిన మావిగన్‌ కూడా ప్రజలు తీవ్రంగా తీసుకోరు. ఎందుకంటే తను అధికారంలో వున్నప్పుడు ఈ మాటే రాలేదు కదా?

బాధ్యత బాబుపైనే
ఏది ఏమైనా ఇప్పుడు అధికారంలో వున్నది చంద్ర బాబుపైనే అమరావతి ఎంత వాస్తవికంగా త్వరితంగా పూర్తి చేస్తారనే సవాలు వుంటుంది. మొదటి దఫాలోనే కనీసంగా చేసి వుంటే జగన్‌ అవన్నీ చేసే అవకాశం వుండేది కాదు. సింగపూర్‌పై ఆశలు నిజమయ్యేవి కావని తేలిపోయింది. ఇక కేంద్రం నుంచి నిధులు అడిగే సాహసం ఎలాగూ చేయరు. అప్పులు తెచ్చి కట్టడం వల్ల ఆర్థిక భారమే గాక ప్రపంచ బ్యాంకు షరతులు బిగింపులూ ముందస్తు బంధాలుగా పరిణమిస్తాయి. రాష్ట్రంలో ప్రజల్లో తీవ్ర విమర్శలకు నిరసనలకు దారితీసున్న కార్పొరేట్‌ పిపిపి నమూనా అమరావతికి అన్వయించడం అనుమతించ రానిది, గతంలో భూములిచ్చిన రైతులకు సంబంధించిన సమస్యలతో పాటు వారికి వాగ్దానం ప్రకారం అభివృద్ధి చేసిన ప్లాట్ల కేటాయింపు, లాభదాయకమైన వసతుల కల్పన చాలావరకూ మిగిలేవుంది. మళ్లీ వచ్చి 21 మాసాలు గడిచినా నిర్దిష్ట నిర్మాణ ప్రణాళికలేదు. ఇంకా చెప్పాలంటే ఆలస్యంపై స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ వంటివారే ఆగ్రహం వెలిబుచ్చిన సందర్భాలు చూశాం. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ వాస్తవరూపం దాల్చిన ఉదాహరణలు లేవు. ఇప్పుడున్న భూమికి అయిదు లక్షల కోట్లు వస్తాయని 2025 ఆగష్టులో నారాయణ ప్రకటించారు గాని జరిగింది లేదు. భూమిని బాగా డెవలప్‌ చేసి అమ్మాలంటున్న చంద్రబాబు సైబరాబాద్‌ను తానెలా కట్టింది ఆయన నిరం తరం చెబుతుంటారు. అది హైదరాబాద్‌కు పొడగింపు తప్ప కొత్తది కాదు, అప్పుడు ఐటికి వున్న వూపు ఇప్పుడు లేదు. హైదరాబాదు విస్తరణలో సమస్యలే లేవనుకోవడం కూడా పొరబాటే. పాలకులు ఎంతో జాగ్రత్తగా అడుగులు వేయకుండా భారీ ఆశలు కల్పించడం వల,్ల పథకాలు ప్రకటించడం వల్ల ఫలితం వుండదు. ముందు స్థానిక ప్రజలు భూములిచ్చిన రైతుల దైనందిన జీవితానికి ప్రాధాన్యత ఇవ్వాలి.ఇప్పుడు సమీకరించినది చాలక మలివిడత అంటూమరో యాభైవేల ఎకరాలు స్పోర్ట్‌సిటీ అంతర్జాతీయ విమానశ్రయం అంటూ హడావుడి చేయడం ప్రాధాన్యతలు తలకిందులు చేస్తుంది. గతంలో రెండు ప్రభుత్వాల హయాంలోనూ జరిగిన పొరబాట్లనుంచి పాఠాలు నేర్చుకోవాలి. ముందు అఖిలపక్ష సమావేశం, వివిధ సంఘాలతో చర్చలు జరిపి ఒక కాలవ్యవధితో కార్యాచరణ ప్రకటించడం అవసరం. చంద్రబాబు సైబరాబాద్‌ గురించే చెబుతుంటే రేవంత్‌ రెడ్డి ఫ్యూచర్‌ సిటీ అంటూ మరో కొత్త నగరం ప్రకటించడం యాదృచ్చికం కాదు. ఏపీలోనే గాక తెలంగాణలో బీజేపీ ఎత్తులు పైఎత్తులు మరింత నిగూఢంగా నడుస్తున్నాయి. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ యుద్ధాలు, బీజేపీ పట్ల ఎవరి వైఖరి ఏమిటనేది కూడా ప్రశ్నార్థకం చేసేలా వ్యవహరిస్తున్నది. దేశాన్ని పాలిస్తున్న పార్టీ అయినా రెండుచోట్ల రెండు రకాలుగా మాట్లాడుతూ వివాదాలు పెంచడమే గాక మత రాజకీయాలు కూడా ఎగదో స్తున్నారు. కనక అమరావతి ఏపీ రాజధాని సమస్య అయినా తెలంగాణలోనూ నేతల పార్టీల తీరుతెన్నులను ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ సందర్భం ఉపయోగపడుతుంది.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -